నయనతారకు భలే డిమాండ్..!
తమిళంలో నయనతారకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. సీనియర్లు, జూనియర్లు, కొత్తవాళ్లు అనే తేడా లేకుండా ఏ హీరోపక్కనైనా ఆమెనే తీసుకోవాలని దర్శకనిర్మాతలతో పాటు హీరోలు కూడా పట్టుపడుతున్నారు. అదే సమయంలో ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను 4కోట్లకు తీసుకెళ్లింది. కాగా ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లోని సీనియర్ స్టార్స్‌కు కూడా ఏకైక ఆప్షన్‌గా మారింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి నటించే తన 150వ చిత్రమైన 'కత్తి' రీమేక్‌లో ఆమె అడిగినంత ఇచ్చి ఆమెను హీరోయిన్గా తీసుకోనున్నారు. అదే సమయంలో ఇప్పటికే 'సింహా, శ్రీరామరాజ్యం' వంటి చిత్రాల్లో బాలయ్య సరసన నటించిన ఈ అమ్మడు తాజాగా బాలయ్య చేయబోయే తన 100వ చిత్రంలో కూడా నటించనుందని సమాచారం. క్రిష్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్యకు జోడీగా నయనతారనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఈ చిత్రంలోని ఓ కీరోల్‌ను నిత్యామీనన్ చేయనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన గుర్రపుస్వారీ శిక్షణతో పాటు ఈ చిత్రం కోసం మీసాలు పెంచిన బాలయ్య లుక్ అదిరిపోతోందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉగాది పర్వదినాన వెలువడనుంది. ఇక నయన ప్రస్తుతం వెంకటేష్ సరసన మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'బాబు బంగారం' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి నయనకు టాలీవుడ్ సీనియర్ స్టార్స్వైపు నుండి పెద్ద డిమాండే ఏర్పడుతోంది.