సూపర్ స్టార్ తిరస్కారానికి ఇదంట కారణం
తాజాగా 66 వ ఏట అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజని కాంత్ ఇప్పటికీ చెరగని ఛరిష్మాతో కేవలం తన పోస్టర్ తో ప్రేక్షకులను థియేటర్ల వైపు బారులు తీరేలా చేస్తున్నారు. ఆయనతో కలిసి తెరను పంచుకోవాలని ఉవ్విల్లూరే అగ్ర తారలు ఎందరో లెక్కే లేదు. ఇటీవల ఆయన నటిస్తున్న 2 .o చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ వేడుకలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తనకు రజని కాంత్ తో కలిసి నటించాలని వుంది అని వేదిక పై బహిరంగ ప్రకటన చేశారు. బాలీవుడ్ మరో టాప్ హీరో ఆమిర్ ఖాన్ తాను నటించినా దంగల్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువదిస్తుండగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పవలసిందిగా రజని ని కోరారు.
ఆమిర్ ఖాన్ చేసిన ప్రతిపాదనను రజని కాంత్ తిరస్కరించారు అన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వాస్తవమే కానీ, రజని కి సినిమా నచ్చకపోవటం వలెనే తన గొంతు అరువు ఇవ్వటానికి నిరాకరించారు అని వచ్చిన కథనాలను మాత్రం ఆమిర్ ఖాన్ ఖండించారు. దంగల్ ప్రత్యేక ప్రదర్శన వేసి రజని కాంత్ కి చూపించగా ఆయనకు బాగా నచ్చటంతోనే తాను తమిళ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పవలసిందిగా రజని ని కోరాడట ఆమిర్ ఖాన్. అయితే ఇద్దరు స్టార్ హీరోస్ ల కు ఇటువంటి సహకారాలు వర్తించకూడదు అని, ఒకవేళ ఆలా చేస్తే ఫలితం తేడా కొట్టే అవకాశాలున్నాయని సూచించి రజని తిరస్కరించారట. రజని గొంతు తమిళ ప్రేక్షకులకు సుపరిచితం కావటంతో తెరపై కనిపిస్తున్న ఆమిర్ హావభావాలని ఆస్వాదించకుండా కేవలం వినిపించే గొంతు తో ప్రయాణం చేసే ప్రమాదం ఉండటమే రజని ఆమిర్ ప్రతిపాదనను నిరాకరించటానికి కారణమట.
- Tags
- Rajinikanth