మోక్షజ్ఞ ఇలా అయితే ఎలా అబ్బా...!
తెలుగు సినిమా రంగానికి నందమూరి ఫ్యామిలీకి దశాబ్దాల అనుబంధం ఉంది. నందమూరి వంశంలో ఇప్పటికే మూడో తరం హీరోలు కూడా స్టార్ హీరోలుగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే టాలీవుడ్లో ఎలాంటి బజ్ ఉంటుందో ? తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఎలాంటి సందడి ఉంటుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండో తరంలో బాలయ్య ఇప్పటకీ కుర్ర హీరోలకు పోటీగా యేడాదికి రెండు సినిమాలు చేస్తున్నారు.
ఇక గత యేడాది కాలంగా బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ముందుగా బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో శాతకర్ణి తనయుడు రోల్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో బాలయ్య కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ఆ తర్వాత 2017లోనూ మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.
మోక్షు డెబ్యూ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తారని కూడా టాక్. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ స్టిల్ బయటకు వచ్చింది. ఆ స్టిల్ చూస్తే మోక్షు చాలా బొద్దుగా కనిపిస్తున్నాడు. ఇంకా డెబ్యూ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లకుండానే మోక్షజ్ఞ ఇంత లావుగా ఉంటే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాలయ్య రెండో కుమార్తె తేజస్వినికి బాబు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బాలయ్య కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చాయి.
ఈ ఫోటోల్లో మోక్షజ్ఞ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ లా కనిపించారు. అయితే ఆయన చాలా బొద్దుగా ఉన్నాడు. ఇంకా సినిమాల్లోకి రాకుండానే ఇలా ఉంటే ? రేపు ఫైట్స్, యాక్షన్ సీన్లలో చేసేందుకు బాగా కష్టపడాల్సి ఉంటుంది... మరి మోక్షు డెబ్యూ సినిమా సెట్స్ మీదకు ఈ యేడాది చివర్లో వెళుతుందని అంటున్నారు. అప్పటకీ అయినా కసరత్తులు చేసి తగ్గుతాడేమో ? చూద్దాం.