‘ఆ నలుగురి’కి మద్దతుగా యువ హీరో కామెంట్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'ఆ నలుగురు...' అనే మాట ఫుల్ పాపులర్. థియేటర్లని గుప్పెట్లో పెట్టుకొని పరిశ్రమని శాసిస్తున్నారంటూ ఆ నలుగురిపై ఓ అపవాదు ఉంది. చిన్న సినిమాలకి సమస్యలొచ్చిన ప్రతిసారీ ఆ నలుగురిని టార్గెట్ చేసుకొని విమర్శించేవాళ్లు ఎంతోమంది. అయితే తాజాగా ఓ కొత్త హీరో ఆ నలుగురికి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తూ కొన్ని కామెంట్లు చేశాడు. ఆ హీరో ఎవరో కాదు.. కార్తికేయ. ఆర్.ఎక్స్.100తో పాపులర్ అయ్యాడీయన.
అవిన్నీ అబద్ధాలు.. నమ్మకండి..!
ఈ సినిమా 25 రోజుల ఫంక్షన్ నిన్ననే జరిగింది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ... ''ఇండస్ట్రీలో తొక్కేస్తారు, నలిపేస్తారు.. ఆ నలుగురు థియేటర్లు ఇవ్వకుండా నానా ఇబ్బందులకి గురిచేస్తారంటూ బయట చాలా వినిపిస్తుంటాయి. ఏదైనా ప్రయత్నిద్దామని వచ్చే నిర్మాతలకి ఇలాంటి మాటలు చాలా భయాన్ని పుట్టిస్తాయి. కానీ అవేవీ నమ్మకండి. దిల్‌రాజు తన సినిమా విడుదల ఉన్నా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ముందు మన కంటెంట్‌లో దమ్ముంటే ఎవ్వరేం చేయలేరు. అందరూ సహకారం అందిస్తారు'' అంటూ మాట్లాడాడు. ఈ వేడుకకి దిల్‌రాజు కూడా హాజరయ్యాడు. అక్కడే ఉన్న దిల్‌రాజుకి ఈ హీరో చెప్పిన మాటలు సంతోషాన్నిచ్చాయి. కార్తికేయ త్వరలోనే దిల్‌రాజు సంస్థలోనూ ఓ సినిమా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.