మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటిటి రివ్యూ

Middle Class Melodies Movie Review

బ్యానర్: భవ్య క్రియేషన్స్ 
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపిరాజు రమణ, చైతన్య గరికపాటి, తరుణ్ భాస్కర్ (గెస్ట్ రోల్)తదితరులు 
మ్యూజిక్ డైరెక్టర్: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి 
ఎడిటర్:రవి తేజ గిరజాల
నిర్మాత: వెనిగళ్ల ఆనంద ప్రసాద్
స్కరీన్ ప్లే, దర్శకత్వం: వినోద్‌ అనంతోజు

మిడిల్ క్లాస్ కొంచెం సంతోషం, కొంచెం ఎమోషన్, కొంచెం కష్టాలు.. అటు ధనికులు కానీ ఇటు పేదవారు కానీ జీవితం మధ్యతరగతి జీవితం. పల్లెటూర్లలో మిడిల్ క్లాస్ ఫామిలీస్ జీవన శైలి చాలామంది ఎరుగుదురు. మధ్యతరగతి బతుకులకి గొప్పగా ఎదగాలనే కోరికలు ఉన్నా దానికి సరిపడా డబ్బు ఉండదు.. ఉన్నదానిలోనే సర్దుకుపోవాలి. లేదంటే ఉన్నది అమ్మాలి, ఇంకా కాదంటే అప్పులు చెయ్యాలి. అదే మధ్యతరగతి నేపధ్యాన్ని తీసుకుని కొత్త దర్శకుడు వినోద్‌ అనంతోజు.. విజయ్ దేవరకొండ తమ్ముడు దొరసాని ఫేమ్ ఆనంద్ దేవరకొండ – వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్స్ గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాని తెరకెక్కించాడు. మిడిల్ క్లాస్ ఫామిలీస్ లో జరిగే ప్రతి చిన్న విషయం ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. పల్లెటూరి నుండి పట్నం వెళ్లి తానేమిటో నిరూపించుకోవాలనే కొడుకు.. పల్లెటూరిలో కొడుకు పనికి రాకూండా పోతాడేమో అనే భయంతో, గడుసు తనంతో నోరేసుకుపడిపోయే తండ్రి, తన బావ ప్రేమ కోసం పాకులాడే మరదలు, కొడుకు ఏం చేసినా కొడుక్కి అండగా నిలబడే తల్లి.. జాతకాల పిచ్చితో తిరిగే స్నేహితుడు.. ఈ కేరెక్టర్స్ చుట్టూనే మిడిల్ క్లాస్ మెలోడీస్ కథ తిరుగుతుంది. మరి మిడిల్ క్లాస్ కి అద్దంపట్టేలా ఉన్న ఈ కథ ఓటిటి ప్రేక్షకులకు ఎంతగా రీచ్ అయ్యిందో సమీక్షలో చూసేద్దాం.

కథ
రాఘవ(ఆనంద్ దేవరకొండ) గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరులో చిన్న హోటల్ నడిపే కుటుంబంలోని కుర్రాడు. పల్లెటూరిలో ఉంటే పైకి ఎదగలేం..పట్నం పోయి హోటల్ పెట్టాలి అక్కడ తాను చేసే బొంబాయ్ చెట్నీతో.. గుంటూరులో హోటల్ పెట్టి.. ఫెమస్ అవ్వాలనుకుంటాడు. రాఘవకు స్నేహితుడు గోపాల్( చైతన్య గరికపాటి) వెన్నంటి ఉంటాడు. రాఘవ ఫ్రెండ్ కి జాతకాల పిచ్చి. గుంటూరులో హోటల్ లీజు కోసం దూరం చుట్టమయిన నాగేశ్వరరావు ఇంటికి వెళ్తాడు రాఘవ. నాగేశ్వరరావు కూతురు సంధ్య(వర్ష బొల్లమ్మ) తో స్కూల్ డేస్ నుండి బావ మరదళ్ల సరసాలు మొదలవుతాయి. స్కూల్ అవ్వగానే రాఘవ మరదలు సంధ్యకి ఐ లవ్ యు చెప్పేస్తాడు. ఇక ఆ తరవాత  గుంటూరులో హోటల్ పెట్టడానికి రాఘవకి అడుగడుగునా కష్టాలే. చివరికి తండ్రి ఒప్పుకుంటే.. ఊరిలోని చిట్టీల వ్యాపారి… ఐపీ పెట్టడంతో.. ఉన్న పొలం అమ్మి కొడుక్కి హోటల్ పెట్టడానికి డబ్బులు ఇస్తాడు రాఘవ తండ్రి. హోటల్ పెట్టడానికి కష్టాలు పడిన రాఘవకు హోటల్ తెరిచినా లాభముండదు. మరోపక్క తాను ప్రేమించిన సంధ్యకి  ఆమె తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. అసలు రాఘవకు బొంబాయ్ చెట్నీ మీద అంత నమ్మకం ఎందుకు? గుంటూరులో హోటల్ పెట్టేందుకు నానా కష్టాలు పడిన రాఘవకి సక్సెస్ దొరికిందా? ప్రేమించిన సంధ్యని రాఘవ దక్కించుకున్నాడా? గోపాల్ జాతకాల పిచ్చి ఎటువంటి పరిణామాలకు దారితీసింది? అనేదే మిడిల్ క్లాస్ మెలోడీస్ మిగతా కథ.

నటనాపరంగా….
దొరసాని సినిమాలో సాదా సీదా పేదవానిగా.. దొరల కూతురిని ప్రేమించే యువకుడిగా పర్వాలేదనిపించిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడు రాఘవ పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. బొంబాయ్ చెట్నీ బొంబాయ్ చెట్నీ అంటూ హోటల్ పెట్టడానికి అవస్థలు పడే కుర్రాడిగా.. ప్రేమ కోసం మరదలు తో సరసాలాడే బావగా.. తనేం చెయ్యాలనుకున్నా అడ్డం పడే తండ్రికి కొడుకుగా.. ఆనంద్ దేవరకొండ మంచి నటన కనబర్చాడు. పల్లెటూరి యువకుడిలా ఎమోషన్స్ ని బాగానే క్యారీ చేసాడు. ఇక వర్ష బొల్లమ్మ విషయానికి వస్తే.. పట్నంలో పుట్టినా  మిడిల్ క్లాస్ మిడిల్ క్లాసే అనడానికి ఆమె పాత్రే ఉదాహరణ, ట్రెడిషనల్ గా.. లుక్స్ పరంగా వర్ష ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి మరో హైలెట్ ఆనంద్ తండ్రి కేరెక్టర్ చెసిన గోపిరాజు రమణ. మధ్యతరగతి ఇంట్లో ఒక తండ్రి ఎలా ఉంటాడో గోపిరాజు రమణ పాత్ర చూస్తే అర్ధమవుతుంది. అతను ఆ పాత్రని దర్శకుడు బాగా హైలెట్ చేసాడు. ఇక ఆనంద్ ఫ్రెండ్ గా నటించిన చైతన్య, గెస్ట్ రోల్ చెసిన తరుణ్ భాస్కర్ మిగతా నటీనటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
పల్లెటూరి జీవ శైలి ఎలా ఉంటుంది.. కల్మషం లేని ప్రేమ, కోపమొస్తే అరిచేసే గుణం, చిన్న చిన్న అపర్దాలు, అలకలు దానికి తోడు మిడిల్ క్లాస్ అంటే అన్నిటికి సర్దుకుపోతూ.. కాలనిలో పోరాటం చెయ్యడమే. మధ్యతరగతి నేపథ్యం అనగానే ఎంచుకున్న వాతావరణం, ఎంచుకున్న పాత్రలు, సహజత్వానికి దగ్గరగా అనిపించేవిగా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. దర్శకుడు అనుకున్నట్టుగానే ఎలాంటి హడావిడి లేకుండా.. అచ్చమైన పల్లెటూరి మధ్యతరగతి జీవన శైలికి అద్దం పట్టేలా కథని రాసుకున్నాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు.. పల్లెటూరి మధ్యతరగతి బ్రతుకుల మనోభావాలు కనిపిస్తాయి.  పల్లెటూరులోనే ఉండిపోతే ఎదుగు బొదుగూ ఉండదని.. పట్నం పోయి హోటల్ పెట్టి పైకి ఎదగాలనే కథానాయకుడికి స్నేహితుడి సాయం ఉన్నా.. తండ్రి తిట్లు శాపనార్ధాలు, తల్లి సపోర్ట్ ఉంటుంది. తండ్రి ఎన్ని తిట్టినా కొడుకు కోసం ఎదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కథానాయకుడి లవ్ స్టోరీ, హోటల్ పెట్టాలని పట్నం తిరగడంతోనే నడిపిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ లో కథానాయకుడి స్నేహితుడి జాతకాల పిచ్చి, పల్లెటూర్లలో చిట్టీలు కట్టిచుకుంటూ బోర్డు తిప్పేసే మోసగాళ్లు, కథానాయకుడు హోటల్ ఓపెన్ చేసినా.. తప్పని కష్టాలు, ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి సంబంధాలు.. వీటన్నితో కథానాయకుడి కి కోపం, చిరాకులతో.. ఫ్రస్టేషన్ తో లాగించేసాడు దర్శకుడు. భారీ ట్విస్ట్ లు లేవు, అలాగే మనసును తాకే ఎమోషన్ లేదు, అదరగొట్టే కామెడీ లేదు.. కానీ స్వచ్ఛమైన ప్రేమ కథ, జీవితంలో పైకి ఎదగాలనే యువకుడి తపన ని బాగా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు హీరోని పరిచయం చెయ్యడానికి తీసుకున్న టైం, అక్కడక్కడా లాగింగ్ సన్నివేశాలు, నిడివి ఎక్కువగా ఉండడం, అకట్టుకొలేని పాటలు ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి. హీరో నటన, వారి పాత్రల డిజైన్, హీరో తండ్రిగా చెసిన గోపిరాజు రమణ పాత్ర, స్వీకర్ అగస్తి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ  సినిమాకి మెయిన్ హైలెట్స్. మరి థియేటర్స్ బంద్ తో విలవిలలాడుతున్న ప్రేక్షకులకు.. ఓటిటి నుండి వస్తున్న ఇలాంటి సినిమాలు పుండు మీద కారం చల్లినట్టుగా కాకుండా.. పుండు మీద ఆయింట్మెంట్ రాసేవిగా అనిపిస్తున్నాయి. 

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*