జెర్సీ మూవీ రివ్యూ

jersey movie final collections

బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాథ్, రావు రమేష్, సత్య రాజ్, సంపత్,బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామ కృష్ణ,రోనిత్ తదితరులు
సినిమాటోగ్రఫీ : సాను వరగేసే
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్‌ రవిచందర్
ప్రొడ్యూసర్: ‎సూర్యదేవర నాగ వంశి
స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్: గౌతమ్ తిన్ననూరి

నేచురల్ స్టార్ అనే బిరుదు నానికి రావడం 100 పెర్సెంట్ కరెక్ట్. ఎందుకంటే నాని నటన అంత నేచురల్ గా సహజసిద్ధంగా ఉంటుంది. ఒక లోకల్ కుర్రాడిగా, మిడిల్ క్లాస్ అబ్బాయిగా, రాయలసీమ కుర్రాడిగా, ఫారిన్ కుర్రాడిగా ఏ పాత్రలోనైనా తన సహజమైన నటనతో ప్రేక్షకులను మురిపిస్తాడు. మాస్ యాంగిల్ చిత్రాలతో హైలెట్ కాలేకపోయినా… క్లాస్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఏడు చిత్రాల హిట్ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంతో కాస్త యావరేజ్ అందుకున్న నాని.. గత ఏడాది కృష్ణార్జున యుద్ధంతో ఫ్లాప్ అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధంలో ఫారిన్ కుర్రాడిగా, రాయలసీమ కుర్రాడిలా అదరగొట్టిన నాని.. ఆ చిత్రంతో హిట్ కొట్టలేకపోయాడు. ఇక మళ్లీ రావా అనే డీసెంట్ ప్రేమ కథతో మెప్పించిన గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో కొత్తగా జెర్సీ అనే క్రికెట్ నేపథ్యం ఉన్న కథతో సినిమా చేసాడు. సుమంత్ తో సాలిడ్ గా లవ్ స్టోరీతో మెప్పించిన గౌతమ్ తిన్నసూరి నానితో క్రికెట్ మ్యాచ్ ఆడించాడు. ఇక నాని.. అర్జున్ పాత్రలో అటు ప్రేమికుడిగా, ఫెయిల్ అయిన భర్త గా, ఏమీ చెయ్యలేని తండ్రిగా, రిటైర్ట్ అయ్యే టైంలో క్రికెట్ తో చెలరేగిపోయి మళ్లీ కెరీర్ ని నిలబెట్టుకునే పాత్రలో నాని నటనకు థియేటర్స్ లో క్లాప్స్ పడడం ఖాయమనే సూచనలు జెర్సీ ట్రైలర్ లో కనిపించాయి. అనిరుధ్ సంగీతం, గౌతమ్ తిన్నసూరి, కొత్త హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ సినిమాకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి నాని ఈ జెర్సీతో బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ

జెర్సీ ట్రైలర్ లోనే జెర్సీ సినిమా కథని రివీల్ చేసేసారు. మరి ట్రైలర్ లో చూపించినట్టుగానే అర్జున్(నాని) ఓ క్రికెటర్.. సారా(శ్రద్ధా శ్రీనాథ్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎంత బాగా ఆడినా జాతీయ జట్టులో స్థానం రాకపోవడంతో 26 ఏళ్ల వయసులోనే క్రికెట్ కి దూరం అవుతాడు. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ కూడా పోతుంది. మరోపక్క సారా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. వీరిద్దరికీ ఓ కొడుకు(నాని) పుడతాడు. నాని తన పుట్టిన రోజున అర్జున్‌ను జెర్సీ గిఫ్ట్‌గా అడుగుతాడు. ఐదొందల రూపాయల జెర్సీని కొనేందుకు అర్జున్ చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఇదే సమయంలో అర్జున్‌కు.. సారాకు మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి. తన కొడుకు అడిగిన జెర్సీ కొనిపెట్టలేకపోయానన్న కసితో చివరికి తాను వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలు పెడతాడు. 36 ఏళ్ల వయసులో మళ్లీ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోసం రంగంలోకి దిగుతాడు. మరి అర్జున్‌ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదిస్తాడా? తన కొడుకు నాని ఆనందం కోసం అర్జున్ ఏం చేశాడు? చివరికి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పోతాయా? అన్నదే జెర్సీ మిగతా కథ.

నటీనటుల నటన

నాని అర్జున్ పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. నేచురల్ నటనతో మరోసారి నాని అదరగొట్టాడు. ముఖ్యంగా తన కొడుకు విషయంలో, ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో నాని కనబర్చిన సహజ నటన సినిమా చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. క్రికెటర్ గా, తండ్రిగా, భర్తగా మూడు వేరియేషన్స్ లో నటన అద్భుతమని చెప్పాలి. అర్జున్ పాత్రలో నాని కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ సినిమాలో నాని నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నాని లవర్ గా, భార్యగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ద శ్రీనాధ్ కూడా అదరగొట్టేసింది. నాని నటనకు ఏ మాత్రం తగ్గని పర్ఫార్మెన్స్ తో శ్రద్ద శ్రీనాధ్ ఆకట్టుకుంది. అటు గ్లామర్ పరంగా, ఇటు ట్రెడిషనల్ గా ఆమె నటన బాగుంది. భర్త ఖాళీగా కూర్చుంటే, భార్య కష్టపడుతూ సంసారాన్ని నడిపించే పాత్రకి శ్రద్ధ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. నాని – శ్రద్ద కాంబో సీన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక నాని కొడుకు పాత్ర చేసిన రోనిత్, కోచ్ సత్య రాజ్, రావు రమేష్ సంపత్, సుబ్బరాజు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ

మళ్లీ రావా అనే ప్రేమ కథను మనసులకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు తిన్నసూరితో నేచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా అనగానే.. ఒకే ఒక హిట్ ఉన్న దర్శకుడిని నమ్మి నాని సినిమా చేస్తున్నాడా? అని చాలామంది దీర్ఘాలు చేశారు. ఇక జెర్సీ సినిమా క్రికెట్ నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కిస్తున్నారు అని అనగానే అది ఒక బయోపిక్ అంటూ ప్రచారం జరిగింది. కానీ నాని మాత్రం ఇది ఎమోషనల్ స్టోరీతో తెరకెక్కిన సినిమా.. ఇది ఎవరి బయోపిక్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక జెర్సీ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చేసారు. ఇక జెర్సీ కథలోకి వెళితే… న్యూయార్క్ నుంచి మొదలైన సినిమాలో అర్జున్ కొడుకు నాని అక్కడ పని చేస్తుంటాడు. తన తండ్రి లైఫ్ స్టోరీపై జెర్సీ అనే బుక్ రాసే నేపథ్యంలో స్టోరీ చెప్పడం మొదలుపెడతాడు. 1986 నాటి ఫ్లాష్ బ్యాక్‌.. క్రికెట్ స్టేడియం‌లో నాని, శ్రద్ధా‌శ్రీనాథ్ పాత్రల పరిచయం జరుగుతుంది. పదేళ్లు ముందుకు అంటే 1996 నుంచి అసలు కథ మొదలవుతుంది. టాప్ క్రికెటరైన అర్జున్.. కొన్ని సమస్యల వల్ల గేమ్‌ని వదిలిపెడతాడు. అర్జున్- అతడి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు ముగ్దులవుతారు. పదేళ్ల తర్వాత ఓ చారిటీ మ్యాచ్ కోసం నాని వదిలేసిన క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెడతాడు. జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక, సంపాదనకు కూడా నోచుకోలేని ఓ క్రీడాకారుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో మనసుకు హత్తుకునేలా చూపించాడు. కేవలం రూ.500 పెట్టి జెర్సీ కొనిపెట్టడానికి ఓ తండ్రి పడే ఆవేదన, ప్రయత్నం అన్నీ ఫస్టాప్ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. కొడుకు కోసం హీరోలా మిగిలిపోవడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయని ఓ తండ్రి కథ సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది. విరామం తర్వాత కథ పూర్తిగా క్రికెట్‌ నేపథ్యంలో సాగుతుంది. అంతేకాకుండా నాని, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్‌లను దర్శకుడు చాలా సహజంగా తీశాడు. సినిమాలో మ్యాచ్‌లను చూస్తుంటే.. రియల్‌‌గా చూస్తున్నట్టే ఉన్నాయి. దీనికి నాని శ్రమను కూడా అభినందించాల్సిందే. ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకుడిని కట్టి పడేస్తోంది. నాని కనబర్చిన అద్భుత నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా అక్కడక్కడా స్లో నరేషన్ మైనస్ అని చెప్పొచ్చు. జెర్సీ లో ఎక్కడ చూసినా ప్లస్ పాయింట్స్ కనబడినా.. ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ కి ఎక్కినట్టు గా ఒక వర్గం ఆడియన్స్ ని మెప్పించలేకపోవచ్చు. ఏదైనా నాని ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

సాంకేతిక‌వ‌ర్గం ప‌నితీరు

సాంకేతిక పరంగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద్రన్ జెర్సీ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చినా తెలుగు ప్రేక్షకులను అంత‌గా ఆకట్టుకోలేదు. కానీ జెర్సీకి నేపథ్య‌ సంగీత మాత్రం అనిరుధ్‌ అద్భుతంగా ఇచ్చాడు. ఎమోషనల్ సీక్వెన్సెస్ లో అనిరుధ్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అనేలా ఉంది. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ ఎస్సెట్ సినిమాటోగ్రఫీ. సాను వరగేసే తన కెమెరాతో అద్భుతం చేసి చూపించాడు. 1986 కాలాన్ని, 1996 కాలాన్ని అలాగే క్రికెట్ మ్యాచ్‌ల‌ను తన కెమెరాతో ఆకట్టుకునేలా అద్భుతంగా చిత్రీకరించాడు. ఎడిటింగ్ విషయానికొస్తే.. సెకండ్ హాఫ్ లో కాస్త లాగింగ్ సీన్స్ ఇబ్బంది పెట్టాయి. నవీన్ నూలి ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. నిడివి కూడా సినిమా మైనస్ ల‌లో ఒకటిగా నిలుస్తుంది. ఇక నిర్మాత ఈ సినిమాకి పెట్టాల్సిందంతా పెట్టబట్టే… సినిమా నిర్మాణ పరంగా కూడా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్: నాని నేచురల్ ప‌ర్ఫార్మెన్స్, కథ, కథనం, డైరెక్షన్, నేపథ్య‌ సంగీతం, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్, ఎమోషనల్ సీక్వెన్సెస్, క్రికెట్ మ్యాచ్ లు, డైలాగ్స్, అద్భుతమైన క్లైమాక్స్

మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్, సినిమా నిడివి, కొంతమందికి మాత్రమే ఎక్కే సినిమా కావడం

రేటింగ్: 3.25/5

 

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*