శైలజారెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్
నటీనటులు: నాగ చైతన్య, అను ఇమ్మాన్యువల్, రమ్యకృష్ణ, సీనియర్ నరేష్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, కమెడియన్ వేణు,రఘు బాబు, శరణ్య ప్రదీప్ తదితరులు
సినిమాటోగ్రఫీ: నైజర్ షఫీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
నిర్మాతలు: ఎస్. రాధా కృష్ణ, ప్రసాద్, సురేష్ నాగ వంశీ
దర్శకత్వం: మారుతీ

మారుతీ కామెడీ డైరెక్టర్ గా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. నాగ చైతన్య కూడా మాస్ చిత్రాలతో విసిగిపోయి… కామెడీ ఎంటర్టెనర్ లో నటించాలని.. మాస్ మాస్ అంటే కెరీర్ లో ముందుకుపోలేమని గ్రహించి మారుతీ చెప్పిన శైలజారెడ్డి అల్లుడు అనే కథకు కమిట్ అవడము.. సినిమాని పట్టాలెక్కించడం చకచకా జరిగిపోయాయి. సినిమా షూటింగ్ కూడా ఆ రేంజ్ లోనే పరిగెత్తి విడుదలకు టైం ఫిక్స్ చేసుకున్నారు మారుతీ అండ్ చైతు లు. కానీ అనుకోని అవాంతరాలతో సినిమా గత నెలాఖరులో విడుదలకాల్సింది…రెండు వారాల పోస్ట్ పోన్ తో నేడు వినాయకచవితి శుభాకాంక్షలతో ఈ గురువారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మీద ట్రేడ్ లో ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమా లో రమ్యకృష్ణ నాగ చైతన్య కి అత్తగా పవర్ ఫుల్ రోల్ అయిన శైలజ రెడ్డి పాత్రలో నటించడంతో సినిమా మీద క్రేజ్ పెరిగింది. అయితే తెలుగులో ఇప్పటి వరకు అత్త, అల్లుడు కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్లయ్యాయి. మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈ ఫార్ములాతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శైలజారెడ్డి అల్లుడు కూడా అత్తా అల్లుళ్ళ కథతోనే తెరకెక్కింది. ఇక శైలజారెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్లు, పాటలు, ప్రోమోలు ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడుతో నాగ చైతన్య సక్సెస్ ట్రాక్ లోకొచ్చాడా? అజ్ఞాతవాసి, నా పేరు సూర్య ప్లాప్స్ తో ఉన్న అను ఇమ్మాన్యువల్ కి ఈ సినిమా అయినా హిట్ అందించిందా? బాహుబలి శివగామిగా ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్న రమ్యకృష్ణ శైలజారెడ్డి గా ఎలా ఆకట్టుకుందో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
సాఫ్ట్‌వేర్ కంపెనీ చైర్మన్ రావు గారు (మురళీశర్మ) అహంభావి, కోపిష్టి. అలాంటి తండ్రి చెప్పింది చేస్తూ లైఫ్ లో చప్పగా బతికేస్తుంటాడు చైతు(నాగ చైతన్య). అయితే జీవితంలో విసుగు చెందిన చైతు తండ్రి లక్షణాలు అంటకుండా పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంచుకుంటాడు. తన చుట్టూ ఉండే సమాజంలోని అందరితో ఫ్రెండ్లిగా ఉంటాడు. కానీ చైతు కలలో కూడా తలవని… ఇగో ఉన్న అమ్మాయే అను రెడ్డి(అను ఇమ్మాన్యువల్) నచ్చడం… ఆమెని మొదటి చూపులోనే ప్రేమించెయ్యడం జరుగుతుంది. అయితే తండ్రి పోలిన ఈగోతో ఉన్న అను రెడ్డి ని ఇంప్రెస్ చేసిన చైతు… అను తల్లి శైలజ రెడ్డి(రమ్యకృష్ణ) చేతిలో ఇరుక్కుపోతాడు. అనుకోకుండా చైతు తండ్రి రావు అను రెడ్డి కి, చైతు కి ఎంగేజ్మెంట్ చేసేస్తాడు. ఇక తండ్రి తో సమానమైన ఈగో ఉన్న అనుని ప్రేమించిన చైతూకి అత్తగారు అదేనండి.. శైలజారెడ్డి కి కూడా బోలెడంత ఈగో ఉంటుంది. ఆడవాళ్ళ కష్టాలు చూస్తే రెచ్చిపోయే శైలజ రెడ్డి.. భర్తనే బానిసగా ఆడుకునే టైపు. మరి అంత ఈగోతో ఉన్న శైలజారెడ్డి ఈగోని పక్కన బెట్టి కూతురు అను రెడ్డి ప్రేమను ఒప్పుకుంటుందా? అసలు అను రెడ్డికి చైతు కి పెళ్లవుతుందా? ఈగోతో ఊగిపోయే శైలజారెడ్డి ఈగో ని చైతు ఎలా శాటిస్ఫాయ్ చేసాడు? ఈగోతో ఉన్న రావు కూడా కొడుకు ప్రేమను ఎందుకు ఒప్పుకుంటాడు? మరి ఇన్ని అనుమానాలు తీరాలంటే శైలజ రెడ్డి ని చూసేస్తే పోలా.

నటీనటుల నటన:
శైలజారెడ్డి అల్లుడిగా.. చైతు పాత్రలో నాగ చైతన్య పర్ఫామెన్స్ ఆకట్టుకుంది. ఈగో కేరెక్టర్స్ మధ్యన నలిగిపోయే కుర్రాడిలా చైతు అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో క్లాసీ లుక్స్ తో చైతు నటనలో సరికొత్త హావభావాలు ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. గెడ్డం పెంచి కాస్త రఫ్ లుక్ తెచ్చుకునే ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. కాకపోతే మరీ ఊర మాస్ యాక్షన్ మసాలా సినిమాలకు కావలసిన కరుకుదనం ఇంకా రావాల్సి ఉంది. ఇక అను ఇమ్మాన్యుయేల్ తన అందంతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహం నిండిన క్యారెక్టర్ తో సరికొత్తగా నటించింది. తను అనుకున్నదే జరగాలని, ఎవడైనా తన ముందు తక్కువే అనే భావనతో పొగరబోతు అమ్మాయిలా అను ఇమ్మానుయేల్ ఆకట్టుకుంది. ఇక సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మురళీశర్మ, రమ్యకృష్ణ గురించి. వీరిద్దరి పాత్రల స్వభావాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇగోను తలకెక్కించుకున్న వ్యక్తుల పాత్రల్లో వీరిద్దరూ జీవించేశారు. రమ్య కృష్ణ పాత్ర సినిమాలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆమె పాత్రలో నటించిన విధానం హావభావాలు చాలా దృడంగా ఉన్నాయి. మురళీశర్మ తన పాత్రకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్, పృథ్వీ, నరేష్ వీకే తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే కమెడియన్ పృథ్వీ కామెడీ ఈ సారి పెద్దగా పేలలేదు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ ఇప్పుడిప్పుడే ఫామ్ లోకొస్తున్నాడు. రెండుమూడు పాటలకు మ్యూజిక్ బాగున్నప్పటికీ…. కొన్ని పాటల్లో ఆ మ్యూజిక్ బాగా వీక్ అయ్యింది. కాకపోతే గోపి సుందర్ అందించిన నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి ప్లస్ గా మరింది. ఎమోషన్స్ సీన్స్ లోను, రొమాంటిక్ సీన్స్ లోను గోపి సుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్రాణం పోసింది. నైజర్ షఫీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్. సాంగ్ లొకేషన్స్ కానివ్వండి అన్ని విషయాల్లోనూ నైజర్ షఫీ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఇక కోటగిరి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ఎడిటింగ్ లో చాలా కత్తెర్లు పడాల్సింది. కానీ ఎడిటింగ్ విషయంలో కాస్త లైట్ గా వున్నారనిపించింది. ఇక సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. కథకు తగ్గ బడ్జెట్ తో నిర్మాణ విలువలు ఉన్నాయి.

విశ్లేషణ:
కథను కామెడీగా తెరకెక్కించడంలో మారుతికి ఎంతగా పట్టుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతని గత చిత్రాలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అత్తా అల్లుళ్ళ కాన్సెప్ట్ తో మారుతీ ఈ శైలజ రెడ్డి అల్లుడు సినిమాని కామెడీతో కూడిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. కానీ దర్శకుడు మారుతీ మాత్రం శైలజారెడ్డి అల్లుడితో అనుకున్నంతగా కామెడీ పండించలేకపోయాడు. తీసుకున్న కథలో ఎంతగానో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు తెరకెక్కించిన విధానం నిరాశపరచింది. ఈ విషయంలో దర్శకుడు మారుతి పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. కొంతమేర ఆకట్టుకున్నా ఒక పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ తో పాటు ప్రేమ కథకు చాలా టైం ఖర్చు పెట్టిన మారుతీ అసలు కథలోకి రెండో భాగంలో ఎంటర్ అవ్వడం వల్ల అప్పటిదాకా జరిగిందంతా అనవసర ప్రహసనంగా అనిపిస్తుంది. పైగా తన బలమైన కామెడీ టైమింగ్ ఇందులో అంతగా పండకపోవడం సినిమాకి మెయిన్ మైనస్ అన్నట్టుగా మారింది. ఫస్టాఫ్‌లో పాత్రల్లో ఇగోలు, ప్రేమలు చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో శైలజారెడ్డి సామ్రాజ్యాన్ని చూపించారు. ఈ క్రమంలో కామెడీని పండించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ ఒకమాదిరిగా ఉన్నప్పటికీ… సెకండాఫ్ బాగుంటే సినిమా హిట్టయినట్టే. కానీ ఈ సినిమాకు అక్కడే దెబ్బేసింది. సెకండాఫ్‌ను మారుతి ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. ఇంటర్వల్ తరవాత వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ తప్ప బలమైన సన్నివేశాలు సినిమాలో మచ్చుకైనా కనిపించవు. సెకండ్ హాఫ్ లో అత్తా అల్లుళ్ళ మధ్య మంచి డ్రామా ఆశించే ప్రేక్షకులను సైతం నిరాశపరిచి ఎవరి అంచనాలను చెరుకోలేకపోయాడు. తల్లీ కూతుళ్ల మధ్య కోల్డ్ వార్‌ను ఇంకాస్త ఆసక్తికరంగా చూపించి ఉంటే బాగుండేది. బాహబలి లో శివగామిగా రెచ్చిపోయి నటించిన రమ్యకృష్ణ… శైలజారెడ్డి పాత్ర చిత్రీకరణ కూడా ఈ సినిమాలో అంత గొప్పగా ఏమీ లేదు. రమ్యకృష్ణ పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అయితే చైతు, అను కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. వీళ్లిద్దరి జోడి తెరపై చూడటానికి బాగుంది. ఈ మధ్యన సినిమాల్లో కామన్ అయిన ఒక లిప్‌లాక్ కూడా చైతు – అనులు పెట్టేసారు. అయితే మారుతీ పాత్రలను సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం మరియు కథనం సరిగ్గా లేకపోవటంతో ఈ శైలజరెడ్డి అల్లుడు అక్కినేని అభిమానులకు అయితే ఓకె గాని… సగటు ప్రేక్షకుడుకి మాత్రం అంతగా రుచించదు.

ప్లస్ పాయింట్స్: చైతు – అను జంట, ఫస్ట్ హాఫ్, రెండు పాటలు, నాగచైతన్యను చూపించిన విధానం, రమ్యకృష్ణ కేరెక్టర్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం, కామెడీ, కథ, కథనం, లాగింగ్ సీన్స్, ఎడిటింగ్ , సెకండ్ హాఫ్

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*