అందరూ వెళ్తూనే ఉంటే వైకాపా ఇమేజి దెబ్బతినదా?

అధికారదండం చేతిలో లేనప్పుడు, పార్టీ బలగాలను శ్రేణులను కాపాడుకోవడం కూడా చాలా కష్టసాధ్యమైన పని. పార్టీ గుర్తు మీద గెలిచిన చట్టసభల ప్రతినిధులే అధికారం అండచూసుకుని పాలక పార్టీల్లోకి ఫిరాయించేస్తున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు గడ్డు స్థితే ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏపీలో పలువురు నాయకులు తెలుగుదేశం లోకి జంప్ చేయడం అనేది చాలా సహజంగా జరుగుతూనే ఉంది. కేవలం అధికార లాలసతోనే ఎన్నికలకు ముందు వైకాపాలోకి వచ్చిన వారు చాలా మంది.. ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కాగానే.. తెలుగుదేశంతో బేరసారాలు మాట్లాడుకుని అటు ఫిరాయించేస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరడం .. వారి ఫిరాయింపుల మీద వైకాపా న్యాయపోరాటం సాగిస్తూ ఉండడం జరుగుతోంది. అదే సమయంలో.. చట్టసభల ప్రతినిదులుగా లేని చాలా మంది వైకాపా నాయకులు కూడా తెలుగుదేశంలో చేరిపోవడం జరుగుతూనే ఉంది. ఎమ్మెల్యేలు చేరుతూ ఉంటే.. అసెంబ్లీలో తమ బలాన్ని తగ్గించడానికి తెదేపా కుట్ర చేస్తున్నదంటూ వైకాపా ఆరోపిస్తుంది. మరి మిగిలిన హోదాల్లోని నాయకులు కూడా వెళ్లిపోతోంటే ఏం చెప్పగలుగుతంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. పార్టీలు మారే నాయకులకు వ్యక్తిగతంగా ఉండే క్రెడిబిలిటీని బట్టి కూడా వారి ఫిరాయింపుల వల్ల పార్టీకి జరిగే నష్టం ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. వైకాపా నుంచి ఇంకా ఫిరాయింపులు ఆగకపోతుండడం అనేది ఆ పార్టీ నేతలనే ఆలోచనలో, అంతర్మధనంలో పడేస్తోంది. తాజాగా వైకాపా తరఫున కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీచేసిన బూరగడ్డ వేదవ్యాస్ తెలుగుదేశంలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. బూరగడ్డ వేదవ్యాస్ అంటే సీనియర్ నాయకుడిగా పేరున్న వ్యక్తి. మరి ఇలాంటి నాయకులు అందరూ వెళ్లిపోతూ ఉంటే దాని ప్రభావం వైఎస్సార్ కాంగ్రెస్ మీద తీవ్రంగానే ఉంటుంది కదా.. అని పలువురు మధన పడుతున్నారు.

నిజానికి ఎన్నికల తర్వాత.. వైకాపా ప్రతిపక్షానికి పరిమితం కాగానే.. పార్టీనుంచి వెళ్లిపోయిన నాయకులు చాలా మందే ఉన్నారు. అయితే తెలుగుదేశంలో చేరకుండా ఆ నాటినుంచి ఇప్పటికీ స్వతంత్రంగానే ఉన్న దాడి వీరభద్రరావు, కొణతాల వంటి నాయకులు చాలా మందే ఉన్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికీ సీనియర్ నాయకులు వలస వెళ్లిపోతూ ఉంటే కార్యకర్తల్లో కూడా కాస్త ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని పార్టీ అధినేత జగన్ తెలుసుకోవాలి.

వెళ్లిపోయే వారి విషయంలో జగన్ రెండు ధోరణులు అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు వెళ్తోంటే.. వారికోసం నానా బీభత్సంగా బుజ్జగింపు రాజీ చర్చలు చేయిస్తున్న జగన్, మరికొందరి వ్యవహారంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లోపల ఎలాంటి అభిప్రాయాలు విబేదాలు ఉన్నా.. ఎవరు వెళుతున్నా సరే.. వారిని ఆపడానికి ప్రయత్నం అంటూ చేయడం పార్టీకి మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*