అమెరికా వెళ్లేలోగా ఏపీలో కొత్త కేబినెట్!

chandrababu comments on farmers

చంద్రబాబునాయుడు మంత్రి వర్గ విస్తరణ చేపడతారు, పునర్‌వ్యవస్థీకరణ చేపడతారు… అనే మాటలు కొన్ని నెలలుగా  వినిపిస్తూనే ఉన్నాయి. ఆశావహుల్లో ఉత్సాహం  కూడా సన్నగిల్లిపోతున్నది గానీ.. చంద్రబాబుకు ముహూర్తం మాత్రం కుదరడం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగేప్పుడు, పండగలు వచ్చినప్పుడు.. ‘ఈ  సందర్భాన్ని పురస్కరించుకుని కేబినెట్ విస్తరణ ఉంటుంద’నే ఊహాగానాలు రావడం.. అదేమీ లేకుండానే రోజులు గడచిపోవడం రివాజుగా మారింది.

అయితే ఈసారి కొంచెం గట్టిగానే వదంతులు వినిపిస్తున్నాయి. వెలగపూడి నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి నవంబరు నెలలో చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఆ ఘడియవచ్చేలోగా ఇక్కడ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గాన్ని కొలువుదీర్చి వెళతారని అనుకుంటున్నారు. షెడ్యూలు ప్రకారం నవంబరు 12న చంద్రబాబు అమెరికా వెళ్లాలి. ఆలోగా.. కేబినెట్ వ్యవహారం పూర్తవుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

లోకేష్‌ను కేబినెట్లోకి తీసుకోవడం అన్నది ఖరారే. లోకేష్ కు పదవి ఆలస్యం అవుతోంది కాబట్టి ఆయన అలిగారని, అందుకే శిక్షణ కార్యక్రమాలు తొలిరోజులు రాలేదని గతంలో వదంతులు వచ్చినప్పటికీ అవి నిజం కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. లోకేష్‌కు మంత్రి పదవి విషయంలో పునరాలోచనే లేదనేది వారి వాదన. కాకపోతే లోకేష్ కు ఏ శాఖలు ఇస్తారన్నదే కీలకాంశంగా ఉంది. ఆయనకు మునిసిపల్ శాఖను అప్పగించి అమరావతి నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించేలా చూస్తారని గతంలో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకు పరిశ్రమలు, ఐటీ శాఖ అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో ఉన్న ఖాళీలకంటె ఎక్కువ సంఖ్యలోనే కొత్తమంత్రులకు అవకాశం దక్కవచ్చునని, ఆమేరకు పాత వారికి కొందరికి ఉద్వాసన తప్పకపోవచ్చునని అనుకుంటున్నారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న మరికొందరికి కూడా రెండో పదవి గా మంత్రి పదవి దక్కవచ్చునని అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*