కాపు వెర్సస్ యాంటీ కాపు : కులాల చిచ్చు రగుల్తోంది!

కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే చంద్రబాబునాయుడు ఉద్దేశం మంచిదే కావచ్చు. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీఓ ఇచ్చేయడం కాకుండా, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండడానికి కూడా కాపు కమిషన్ ను ఏర్పాటుచేసి.. వారిని బీసీల్లో చేర్చే విషయమైన రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ రకంగా పద్ధతి ప్రకారం చేస్తే , బీసీల్లోకి చేర్చడం కాస్త ఆలస్యం అయినప్పటికీ.. ముందుముందు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ప్రభుత్వ వర్గాల మాట.

అయితే అభిప్రాయ సేకరణ అనే పర్వం సాంతం కులాల మధ్య కార్చిచ్చు లాగా మారుతుండడం చాలా శోచనీయం. కమిషన్ ఎక్కడ జనాభిప్రాయం సేకరించడానికి వెళ్లినప్పటికీ.. అక్కడ యుద్ధవాతావరణం నెలకొంటోంది. విపరీతమైన పోలీసు బందోబస్తు మధ్య ఆ పర్వాన్ని పూర్తి చేయాల్సి వస్తోంది. కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్న బీసీకులాల సంఘాలు అన్నీ కలసి కట్టుగా కమిషన్ వచ్చిన చోట్ల ధర్నాలు, హర్తాళ్లు నిర్వహిస్తున్నారు. కొన్ని  చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగానూ మారుతున్నాయి. బీసీ కులాల వారంతా వచ్చి వ్యతిరేకించడానికి పూనుకున్నప్పుడు సహజంగానే.. కాపు కులాల వారంతా అదే సంఖ్యలో గుమికూడి మద్దతుగా నినదించడం జరుగుతోంది. అది ఘర్షణలకు కూడా దారితీస్తోంది.

కాపు కమిషన్ అభిప్రాయ సేకరణలు తిరుపతి, కడప ల్లో జరిగినప్పుడు కూడా ఇలాంటి అవాంఛనీయ పరిణామాలే ఎదురయ్యాయి. ఇవాళ అనంతపురంలో కాపు కమిషన్ అభిప్రాయ సేకరణ చేస్తుండగా పరిస్థితి అదుపు తప్పింది. బీసీ కుల సంఘాల వారికి, కాపు కులాల వారికి ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే కాపుల రిజర్వేషన్ వ్యవహారం అనేది నెమ్మదిగా సమాజంలో అశాంతికి, వర్గాల మధ్య, కులాల మధ్య పోరుకు కారణంగా మారుతోందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతోంది.

గతంలోనూ అనేక కులాలను బీసీలుగా చేర్చడం అనే ప్రక్రియను ప్రభుత్వాలు చేపట్టాయి. అప్పట్లో బీసీ కులాల నుంచి ఇంత పెద్ద మోతాదులో వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ కాపుల విషయానికి వచ్చేసరికి యుద్ధ వాతావరణం నెలకొంటుందేమో అనిపించేలా ఉంది. ప్రభుత్వం మాత్రం .. బీసీ కులాల వారు నిలదీసినప్పుడు ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న బీసీ కులాలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ సదుపాయం ఇవ్వడం జరుగుతుంది అంటూ జనాంతికంగా ఒక మాట చెబుతుంది. అయితే ఆ మాటతో ప్రభుత్వం బీసీ కులాల్లో నమ్మకాన్ని  కలిగించగలుగుతోందా? అనేది అనుమానమే. ప్రభుత్వం ఆ కులాల్లో ఆ నమ్మకాన్ని కలిగించగలిగితే.. కాపు కమిషన్ వెళ్లిన ప్రతిచోటా ఇంత పెద్ద రాద్దాంతాలు జరిగేవి కాదు. ప్రభుత్వం కమిషన్ నివేదిక ఇచ్చేదాకా ఎన్ని రచ్చలు జరిగినా తమకు అనవసరం అన్నట్లుగా ఉపేక్ష ధోరణి అవలంబించకుండా.. ఇలాంటి  వైషమ్యాలు కులాల మధ్య ఏర్పడకుండా ఉండేందుకు తమ పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*