చినబాబు ముందుచూపు ఎప్పటికీ కాపాడుతుంది!

నారా లోకేష్

ప్రపంచంలో అత్యంత తీయనైనది పొగడ్త అని ఒక సామెత. ఎదుటి వారిని ఇంప్రెస్ చేసి, బుట్టలో పడేయడానికి, వారిని ప్రసన్నులను చేసుకుని కాగల కార్యాలు నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇదంతా క్రమంగా వ్యక్తిపూజకు దారితీస్తూ ఉంటుంది. రాజకీయాల్లో అయితే వ్యక్తిపూజ పరాకాష్టగా ఉంటుందనేది అందరికీ తెలిసిన సంగతే. అధికారంలో ఉన్న వారి చుట్టూ.. ఏదో ఒక పైరవీలు చేసుకుని బతికిపోదాం అని కోరుకునే వారంతా..  అధికార పార్టీలో అధికార కేంద్రాల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకోవడంలో జీవితాలు వెళ్లబుచ్చేస్తూ ఉంటారన్నది అందరూ ఊహించదగినదే.

అయితే అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాత్రం కాస్త అప్రమత్తత వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీకి కీలక నాయకుడిగా, ముఖ్యమంత్రి తనయుడిగా.. పరిపాలనకు సంబంధించిన చాలా వ్యవహారాల్లో నారా లోకేష్ పాత్ర ఉంటున్నదనేది తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పరిపాలన సంగతి ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి సంబంధించినంత వరకు దాదాపుగా అన్ని వ్యవహారాలు లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పార్టీని ఆయనే నడుపుతున్నారని చెప్పవచ్చు. అలాంటి నేపథ్యంలో తెలుగుదేశంలో తమ మనుగడ కోరుకునే వారంతా లోకేష్ ప్రాపకం కోసం ఎగబడడంలో ఆశ్చర్యం ఏముంటుంది.

తాజాగా అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు.. అమరావతిలో లోకేష్ ను కలిశారు. ‘నారా లోకేష్ వెల్ఫేర్ అసోసియేషన్’ అంటూ ఒకటి ఏర్పాటు చేసి.. దాని పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ వారు లోకేష్ తో ప్రతిపాదించారు. అయితే లోకేష్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. తన పేరిట సంస్థలు పెట్టి.. సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కరెక్టు కాదని లోకేష్ వారి ఆలోచనకు అడ్డుకట్ట వేయడం విశేషం. ఆ రకంగా తనను అడ్డదారుల్లో ఇంప్రెస్ చేయడానికి ఎవ్వరూ ప్రయత్నించకుండా ఉండేలా లోకేష్ అప్రమత్తంగా, ముందుచూపుతో ఇలా స్పందించినట్లుగా కనిపిస్తోంది.

లోకేష్ చాలా జాగ్రత్తగా తనను కలిసి ఇలాంటి ప్రతిపాదన పెట్టిన వారితో.. మనందరికీ కూడా పార్టీనే సుప్రీం అని.. రాష్ట్రంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయదలచుకున్నా సరే.. పార్టీ పేరుతోనే చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. లోకేష్ తీసుకుంటున్న జాగ్రత్తల్ని గమనిస్తే.. తన పేరును ఎవ్వరూ అడ్డగోలుగా వాడుకోవడానికి, తద్వారా తన మీద బురద పడే, మరక అంటుకునే అవకాశానికి వీల్లేకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాంటి జాగ్రత్తలు ఆయనను ఎప్పటికీ కాపాడుతాయని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*