‘పల్లె’ అంటే భయపడిపోతున్న చంద్రబాబు

పల్లె రఘునాధరెడ్డి

ఇదేమీ విలేజి అనే పల్లె గురించి కాదులెండి! తన కేబినెట్ లోని సహచరుడు అనంతపురం జిల్లాకు చెందిన నాయకుడు పల్లె రఘునాధరెడ్డి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక రేంజిలో భయపడిపోతున్నారట. బాబు కేబినెట్ లో పల్లె రఘునాధరెడ్డి సమాచార పౌరసంబంధాల శాఖను తానే చూస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటనలు చేయాల్సిన బాధ్యత ఆ శాఖ చూసే మంత్రిగా ఆయన మీదే ఉంటుంది. కానీ, పల్లెకు బాద్యత అప్పగిస్తే.. ఆయన మీడియా ముందుకు వెళితే.. తెలిసీ తెలియకుండా ఏం మాట్లాడేస్తాడో అని చంద్రబాబు బెదిరిపోతున్నాడుట.

సాధారణంగా కేబినెట్ భేటీ తరువాత.. అందులో జరిగిన చర్చలు, తీర్మానాల గురించి మీడియాకు ఇచ్చే బ్రీఫింగ్‌ను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ప్రకటించడం ఆనవాయితీ. కొన్ని దశాబ్దాలుగా ఇదే సాంప్రదాయం నడుస్తోంది. కానీ చంద్రబాబు తాజాగా కేబినెట్ భేటీ అయిన తర్వాత.. ఎవరి శాఖలకు సంబంధిచిన అంశాలను వారే వెళ్లి నేరుగా వారే… మీడియాకు వెల్లడించాల్సిందిగా సూచించారుట.

దాంతో నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ తదితరులంతా.. తమ తమ శాఖలకు చెందిన, కేబినెట్ లో జరిగిన చర్చలన్నిటనీ. తామే ప్రెస్ మీట్లో వెల్లడించారు. నిజానికి ఆ పని చేయాల్సిన సమాచార మంత్రి పల్లె రఘునాధరెడ్డికి మాత్రం.. చిల్లర మల్లర సంగతులు మాత్రమే మిగిలాయి.

కామినేని శ్రీనివాస్ లేచి వెళుతూ.. ఇదిగో మా నాలుగో కృష్ణుడు వస్తున్నాడు. మిగిలిన విషయాలు మీకు వెల్లడిస్తారు అని ప్రకటన చేయగానే.. చిరునవ్వు నవ్వుకుంటూ పల్లె రఘునాధ రెడ్డి వచ్చి కూర్చుని మిగిలిన వివరాలు వెల్లడించారుట. మొత్తానికి పల్లె రఘునాధరెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించాలంటే చంద్రబాబు భయపడిపోతున్నారని మాత్రం మీడియా మిత్రులందరికీ అర్థమైపోయింది మరి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*