పొగడ్తలు తప్ప జైట్లీ రాకతో ఏం ఒరిగింది?

అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణం అనేది సరికొత్త వ్యవహారం లాగా దానికి ఓ సరికొత్త శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు చంద్రబాబునాయుడు. మంచిదే. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది చంద్రబాబు ఎంచుకున్న మార్గం అని అనుకోవచ్చు. జైట్లీకి రాష్ట్ర సర్కారు తరఫున ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంతకూ జైట్లీ రాక ద్వారా ప్రభుత్వానికి లేదా కోర్ కేపిటల్ నిర్మాణాలకు భరోసా కలిగేలాగా కొత్తగా ఏం ఒరిగింది? ఈ ప్రశ్నకు శూన్యమే సమాధానం!!

ఈ శంకుస్థాపన సభలో జైట్లీ గాని, మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గానీ.. చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని, సమర్థతను వేనోళ్ల పొగిడారు. ఎంతటి కార్యాన్నయినా ఆయన చక్కబెట్టేస్తారని చెప్పారు. అయితే ప్యాకేజీ ద్వారా ప్రకటించిన వివరాలు తప్ప కొత్తగా ఒక్క ముక్క కూడా జైట్లీ నోటి వెంట బయటకు రాలేదు. చంద్రబాబు ను కీర్తించడం తప్ప జైట్లీ రాజధాని నిర్మాణాలకు భరోసా దక్కేలాగా ఒక్క మాట కూడా చెప్పలేదంటే అతిశయోక్తి కాదు.

ఏపీ సర్కారు కోరిందెల్లా ఒక్కటే ఒక్కటి. ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరారు. దానివల్ల కేంద్రంలో సర్కారు మారినా సరే ఏపీకి నిధుల విడుదలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే చట్టబద్ధత కల్పిస్తామా లేదా అనే విషయంలో జైట్లీ ఏ మాత్రం నోరు జారలేదు. మాట వరసకు కూడా హామీ ఇవ్వలేదు. వచ్చే అయిదేళ్లలో తమ ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఇస్తుందని చెప్పారే తప్ప.. వచ్చే రెండేళ్లలో మోదీ పరాజయం పాలైతే ఏపీ సంగతి బజార్న పడినట్లేనా అనే సంగతిని ఆయన ప్రస్తావించలేదు. కాబట్టి జైట్లీ వచ్చిపోవడానికి సంబంధించి.. ఏదో ఒరిగిపోయిందని తెదేపా, భాజపా వర్గాలు మురిసిపోకుండా ఉంటే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*