ముస్లిం మహిళలంటే డిగ్గీకి అంత చులకనా?

ముస్లిం పర్సనల్ లా లో జోక్యం చేసుకోవడానికి, ముస్లింల మత విశ్వాసాలలో జోక్యం చేసుకోవడానికి.. ముస్లింల మహిళలు గురవుతున్న వివక్షను దూరం చేసే ప్రయత్నం చేయడానికి చాలా తేడా ఉంది. సాక్షాత్తూ ముస్లిం మత పరమైన పాలన జరుగుతున్న దేశాలే అనేకం.. తమ ఆచారాల్లోని ఒక పద్దతి ఇవాళ్టి సామాజిక పరిస్థితులకు అనువైనది కాదు.. దాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉన్నది అని గుర్తెరిగిన తర్వాత.. మన దేశంలో మాత్రం ఆ విషయం గురించి మాట్లాడితే నేరం కింద చూడడం చాలా ఆశ్చర్యకరం.

ఒక పదాన్ని మూడు సార్లు పలకడం ద్వారా… జీవితాంతమూ ఉండవలసిన వైవాహిక బంధాన్ని పుటుక్కున తెంచేయడం అనే వెసులుబాటు ఏ మతంలో ఉన్నప్పటికీ అది గర్హించదగినదే. మానవ అనుబంధాలకు విలువ ఇచ్చే ప్రపంచంలో ఈ దుర్మార్గపు ఆచారాన్ని చక్కదిద్దడానికి నిజానికి మన దేశంలో కూడా ఏనాడో ప్రయత్నం జరిగి ఉండాల్సింది.

కానీ కులాలను, మతాలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసే, అవకాశవాద రాజకీయ పార్టీలు రాజ్యమేలినంత కాలం అలాంటి ప్రయత్నం జరగలేదు. తలాక్ వ్యవహారంలో వేలు పెడితే సాంతం కొన్ని కోట్ల ఓట్లను మనం కోల్పోతాం అని పార్టీలు ఆలోచించాయే తప్ప.. అదే దామాషాలో మహిళల జీవితాలకు వైవాహిక బంధం పట్ల ఒక భరోసా ఇవ్వడానికి ఈ సామాజిక దురాచారానికి సమాధి కట్టడం అవసరం అనే వాస్తవాన్ని పట్టించుకోలేదు.

మొదటిసారిగా మోదీ ప్రభుత్వం తలాక్ ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నది. ముస్లిం పర్సనల్ లా లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోయేది లేదని పలువురు ముస్లిం మత పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఇదంతా దీనికి సంబంధించిన నేపథ్యం.

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ఈ వివాదాన్ని రచ్చకీడ్చడానికి ప్రయత్నిస్తున్నారు. హైదరాబాదు పాతబస్తీలో సద్భావన యాత్ర నిర్వహించిన సందర్భంగా.. తమ సభకు ముస్లిం లు పెద్దసంఖ్యలో వస్తారని ఆయన కలగన్నారో ఏమో గానీ.. లేదో పాతబస్తీలో ఉన్నాం గనుక.. వారిని ప్రసన్నం చేసుకునే మాటలు చెప్పాలని భావించారో ఏమో గానీ.. తలాక్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదు అని సెలవిచ్చారు. ఆ ప్రయత్నం హిందూ ముస్లిం సమైక్య భావనకు విఘాతం కలిగిస్తుందిట. అలాంటి కోణం డిగ్గీరాజాకు ఎలా కనిపించిందో కూడా అర్థం కావడం లేదు.

చూడబోతే దిగ్విజయ సింగ్ కు ముస్లిం మహిళ వ్యక్తి స్వేచ్ఛ, వారి ఆత్మ గౌరవం పట్ల అపరిమితమైన చులకన భావం ఉన్నట్లుగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు. ముస్లిం మహిళలు ఇప్పుడు గురవుతున్న మతపరమైన దురాచారాల దాష్టీకం నుంచి ఎన్నటికీ బయటకు రాకూడదని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముస్లిం మహిళలు కూడా మనుషులే, వారికి కూడా వ్యక్తిస్వేచ్ఛ ఉంటుంది అని గుర్తించలేని డిగ్గీ రాజా ముస్లిం మత పెద్దలను మాత్రం ప్రసన్నం చేసుకుంటే అదే తమ పార్టీకి వరదాయిని అని భావిస్తున్నట్లుంది.

అయినా తలాక్ దురాచారాన్ని రూపుమాపే విషయంలో హెచ్చరికలు చేస్తున్న ముస్లిం మతపెద్దలకు సదవగాహన కలిగేలా.. ముస్లిం మతం నుంచే తార్కిక ఆలోచన ఉన్న పెద్దలు ముందుకు రావాలి. అతివాదుల ఆగడాలకు వెరవకుండా.. తమ మతాన్ని కూడా సామాజిక ఆధునిక జీవిన శైలికి అనుగుణంగా వ్యక్తిస్వేచ్ఛలను హరించకుండా.. సర్వజనామోదయోగ్యంగా తీర్చిదిద్దుకోవడం గురించి వారు ప్రయత్నం చేయాలి. అప్పుడే సామాజిక సమతుల్యత సాధ్యం అవుతుంది. సంఘజీవనం సమైక్య వాతావరణంలో పరిడవిల్లుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*