వెంకయ్యనాయుడుకు ఆ మాత్రం తెలియదా?

అమరావతి నగరంలో కోర్ కేపిటల్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రాస ప్రసంగాలకు, ఛలోక్తులకు అన్నిటికీ మించి మోడీ కీర్తనలకు పేరుమోసిన వెంకయ్యనాయుడు ప్రసంగం.. శుక్రవారం నాడు కూడా అదే రీతిలో సాగిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఎన్నికల ప్రచార సరళికి కూడా నరేంద్రమోదీనే స్ఫూర్తి అంటూ భజన చేయడం కాస్త అతిశయంగా అనిపించింది.

డొనాల్డ్ ట్రంప్ ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటూ భారతీయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నినాదానికి మోదీనే స్ఫూర్తి.. వారికి ఆ ఆలోచన ఎక్కడినుంచి వచ్చింది.. ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’ అంటూ 2014లో మనం సాగించిన ప్రచారం నుంచి వచ్చింది. అంటూ వెంకయ్యనాయుడు మోదీని యావత్తు ప్రపంచానికి స్ఫూర్తిదాతగా అభివర్ణించడానికి ప్రయత్నించారు.

కానీ వెంకయ్యనాయుడుకు తెలియకుండా ఉండకపోవచ్చు గానీ… నినాదాల విషయంలో  ఈ ‘అబ్ కీ బార్’ అనేది భాజపాకు ఇవాళ్టిది కాదు. వాజపేయి కాలంనుంచి ఉన్నదే. వాజపేయి రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు.. అప్పట్లో సుష్మాస్వరాజ్ హవా పార్టీలో బీభత్సంగా నడుస్తుండేది. ఆమె మద్దతు దారులందరూ ‘‘అబ్ కీ సర్కార్ అటల్ బిహారీ.. అగలీ బారీ బహెన్ హమారీ’’ ఇప్పుడైతే అటల్ బిహారీ ప్రభుత్వం ఉంది.. ఈసారి మాత్రం మా సోదరి వస్తుంది.. అనే నినాదాలతో వాజపేయి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వెంకయ్యనాయుడుకు ఖచ్చితంగా అది గుర్తుండవచ్చు. అయినా ఆయన మోడీ ప్రసన్నం ముఖ్యం గనుక.. ఈ నినాద ఘనతను ఆయనకు ఆపాదించేస్తున్నట్లుంది మరి!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*