ఉత్తికే : చంద్రబాబు మరియు ఆవు వ్యాసమూ...
ఆవు వ్యాసం గురించి అందరికీ తెలుసు. అనగనగా ఓ కుర్రాడు ఆవు వ్యాసం మాత్రమే నేర్చుకుని బడికి వెళ్లాడు. పంతులుగారేమో విమానం గురించి వ్యాసం రాయమన్నారు. మనవాడు.. విమానంలో వెళ్తుంటే.. కింద గడ్డి కనిపించును. గడ్డి మేస్తూ ఆవు ఉండును. ఆవుకు నాలుగు కాళ్లుండును, పొదుగు ఉండును.. అంటూ తాను నేర్చుకున్నదెల్లా రాసేశాడు. బస్సు గురించి రాయమన్నా సరే.. బస్సులో వెళ్తోంటే పొలాల్లో ఆవు కనిపించును.. అంటూ మళ్లీ ఆవు కథ మొదలెట్టి రాసేశాడు. ఇదీ ఆవు వ్యాసం ఎపిసోడ్ అంటే..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి కూడా పరిస్థితి అలాగే తయారైపోయినట్లుంది. ఆయన బుర్ర మొత్తం బీచ్ ఫెస్టివల్ ప్రేమోత్సవం నిండిపోయింది. ఆయనేమో ప్రెవేటు సంస్థ వారికి మాట ఇచ్చేశారు. తీరా రాష్ట్రంలో చూస్తే నగుబాటు అయ్యేలా.. జనం దాన్ని తూర్పార పట్టేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన బీచ్ ఫెస్టివల్ గొడవను భుజానికెత్తుకోవడమే చోద్యం అనుకుంటే.. సందర్భ శుద్ధి లేకుండా.. చంద్రబాబు అదే మాట్లాడుతూ ఉండడం జనానికి నవ్వు తెప్పిస్తోంది.
చంద్రబాబునాయుడు నిన్న సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఏ సమావేశంలో పాల్గొంటే ఆ సమావేశానికి తగినట్లుగా చక్కటి గణాంక వివరాలతో కూడిన ప్రసంగాలను సిద్ధం చేసుకువెళ్లి.. నివేదించడంలో చంద్రబాబు ముందంజలోనే ఉంటారు. సైన్స్ కాంగ్రెస్ సభలో కూడా సైన్స్ సంగతులను ఆయన కొంతవరకు మాట్లాడారు. అంతలో ఆయన బుర్రలోంచి.. బుడుంగుమని బీచ్ ఫెస్టివల్ బయటకు వచ్చింది. అక్కడినుంచి బీచ్ ఫెస్టివల్ అనేది ఎంత గొప్పదో.. తాను సంస్కృతికి ఎంత విలువ ఇస్తాడో.. బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా తాను ఎంతగా సంస్కృతిని కాపాడబోతున్నాడో.. ఇలాంటి కబుర్లను ఆయన వినిపించారు. అయినా సైన్స్ కాంగ్రెస్ వేదిక మీద బీచ్ ఫెస్టివల్ గొడవ ఏంట్రా బాబూ అని జనం ముక్కున వేలేసుకున్నా సరే.. సదరు వేడుకను సమర్థించుకుంటూ చంద్రబాబు గారి వాక్ప్రవాహం సాగిపోయింది. చూడబోతే.. ఆయన బుర్ర మొత్తం బీచ్ ఫెస్టివల్ ఆక్రమించేసినట్లుగా ఉన్నదని జనం జోకులేసుకున్నారు.