ట్యాక్స్ హాలిడే నిజమైతే.. పరిశ్రమల వెల్లువే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు ఇది పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ తీరంలో కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ పేరిట పారిశ్రామిక జోన్ ను ఏర్పాటు చేయడానికి జరుగుతున్న కసరత్తు పరిశ్రమలు తదనుబంధ ఉపాధి మార్గాల రూపేణా రాష్ట్ర రూపురేఖలను రాబోయే రోజుల్లో మార్చివేసే అవకాశం ఉంది. కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ అంటే.. అదేమీ ఫక్తు రాజకీయ ప్రకటన మాత్రమే కాదు. దేశంలోనే ప్రయోగాత్మకంగా రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయదలచుకుని ఒకటి తూర్పుతీరం ఆంధ్రప్రదేశ్ లోను, మరొకటి పశ్చిమతీరం గుజరాత్ లోను ఏర్పాటు చేయడానికి నీతిఆయోగ్ స్వయంగా సంకల్పిస్తున్న వ్యవహారం. ఈ జోన్ లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తారనేది గొప్ప సంకేతంగా భావించాలి. ప్రత్యేకహోదాను కోల్పోవడం ద్వారా, పొందలేకపోవడం ద్వారా పరిశ్రమల ఏర్పాటు పరంగా ఏపీ ఏం నష్టపోబోతున్నదో.. అలాంటి నష్టంలో చాలా వరకు ఈ సీఈజడ్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది. సీఈజడ్ ప్రస్తుతం ప్రకటించిన రూపంలో కార్యరూపం దాల్చినాసరే.. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పరంగా వరప్రదాయిని అవుతుంది.
ప్రధానంగా ఎగుమతుల మీద ఆధారపడిన పరిశ్రమలను పెద్దసంఖ్యలో ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం, నీతిఆయోగ్ ఈ కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. తొలుత వీటికి కూడా ఎస్ఈజడ్ ల తరహాలో ఎకనామిక్ జోన్లనే పేరు పెట్టాలని అనుకున్నప్పటికీ, వీటిద్వారా ప్రధానంగా లక్ష్యిస్తున్నది ఉద్యోగాలనే గనుక.. ఎంప్లాయిమెంట్ జోన్ అని పేరుపెట్టారు. ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు ఇచ్చే వెసులుబాటును కూడా కల్పించగల ఉద్యోగాల ఆధారంగానే ఇస్తున్నారు. దాంతో ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అనుకోవచ్చు. ఎగుమతులు ప్రధానంగా అవసరమయ్యే పరిశ్రమలనే ఈ కేటగిరీలో ప్రోత్సహించాలనుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ కు వరమైంది. దేశంలోనే అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండడంలోని ఎడ్వాంటేజీ వారికి ఇప్పుడు స్వానుభవంలోకి వస్తోంది. కొత్తగా ఈ సీఈజడ్ లలో వచ్చే కంపెనీలలో పదివేల ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఐదేళ్లు, ఇరవై వేల ఉద్యోగాలు కల్పించే సంస్థలకు పదేళ్ల పాటూ ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని నీతిఆయోగ్ వెల్లడించడం గొప్ప సంకేతం. చైనా కంపెనీలు కూడా మానవవనరులు మన దేశంలోనే చీప్ గా దొరుకుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ యూనిట్లు నెలకొల్పడానికి ఉత్సాహం చూపిస్తున్నాయని భావిస్తున్న తరుణంలో.. ఇలాంటి టాక్స్ హాలిడే ఏర్పాటుతో సీఈజడ్ ఏర్పాటుకావడం సంతోషకరం.
హోదా నష్టం కాస్తంత భర్తీ!
ప్రత్యేకహోదా విషయంలో జగన్ చెబుతున్నది ఇందులో కార్యరూపం దాల్చవచ్చు. హోదా అంటూ వస్తే గనుక.. పరిశ్రమలకు పన్ను రాయితీలు వస్తాయి.. దానివల్ల పరిశ్రమలు వెల్లువలా వచ్చి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయనేది జగన్ చెబుతున్న మాట. అయితే.. ప్రస్తుతం హోదా మనకు దక్కకపోయినా.. ఈ సీఈజడ్ అలాంటి ఏర్పాటునే కలిగిస్తోంది. చిన్నసన్న వాటికి కాకపోయినా పెద్ద పరిశ్రమలకు ఇందులోనూ ట్యాక్స్ హాలిడే ఉంటుంది. అది ఖచ్చితంగా ఉపాధిపరంగా , హోదా రాకపోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.