ఆక్రోశ్ దివస్ : బంద్ పాక్షికం.. నిరసనలు గరిష్టం

మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, ప్రజల కష్టాలు నేపథ్యంలో విపక్షాలు సోమవారం నాడు పిలుపు ఇచ్చిన ఆక్రోశ్ దివస్ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున జరుగుతోంది. వామపక్షాల ప్రాబల్యం బాగా ఉన్న చోట బంద్ వాతావరణం పాక్షికంగా ఉండగా, దేశవ్యాప్తంగా ప్రతిచోటా నిరసనలు మాత్రం మిన్నటుతున్నాయి. విపక్షాలు అన్నీ కూడా నిరసనల విషయంలో ఒక్కతాటిపైకి రావడంతో..  ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకత సర్వత్రా వినిపిస్తోంది. దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మోదీ నిర్ణయం పట్ల నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అంతలోనే పార్టీల మధ్యనే విభేదాలు వచ్చేసిన సంగతి తెలిసిందే. భారత్ బంద్ అంటూ వామపక్షాలు పిలుపుఇస్తే, బంద్ లేదు నిరసనలు మాత్రమే అంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కాయి. మొత్తానికి నిరసనలు మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో వామపక్షాలు పెద్ద ఎత్తున్న నిరసనలు వెలిబుచ్చుతున్నాయి. ఇక్కడ ఆ పార్టీలకు ఉద్యమాల బలం ఉండడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో కూడా విపక్షాల నిరసనల్ని పర్యవేక్షిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ లెఫ్ట్ పార్టీల నిరసనలకు వైఎస్సార్ కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. దాంతో ఏపీ వ్యాప్తంగా ప్రతిచోటా వైకాపా పూనికతోనే నిరసనలు బలంగానే జరుగుతున్నాయి. విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో కూడా నిరసన ప్రదర్వనలు జరగడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*