ఆర్టీసీ ఇక కోలుకోలేదా?

ఆర్టీసీ బస్సులు

రోడ్డు రవాణా సంస్థ మరింత కష్టాల్లో పడనుందా? కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల దెబ్బకు ప్రగతి రధ చక్రాలు తిరగలేవా? అవుననే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. కేంద్ర తీసుకొచ్చిన నూతన రవాణ చట్టం అమల్లోకి వస్తే ఆర్టీసీ ఇక మూసుకోక తప్పదని చెబుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి ఉన్న ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసేలా నూతన కేంద్ర రవాణా చట్టం ఉందంటున్నారు నిపుణులు.

దినదిన గండమే….
ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు దినదిన గండం నూరేళ్ల ఆయుష్యుగా మారింది. ప్రయివేటు బస్సులకు ముకుతాడు వేయాల్సిన ప్రభుత్వాలు వాటికి అనుకూలంగా చట్టాలు తెస్తుండటంతో ప్రభుత్వ రంగ సంస్థ చతికిలపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టం ప్రకారం స్టేజ్ క్యారియర్ లను ప్రయివేటు ట్రావెల్స్ కు కూడా అనుమతిచ్చేయొచ్చు. ఇప్పటి వరకూ ఆర్టీసీకి తప్ప మరే ఇతర వాహనానికి స్టేజి క్యారియర్ అనుమతి లేదు. అయినా స్టేజీల వారీగా ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి ప్రయివేటు ట్రావెల్స్. అడపా, దడపా ఆర్టీఏ చేస్తున్నదాడులు ఏమాత్రం సత్ఫలితాలనివ్వడం లేదు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. నిరసనలు చేశారు. సమ్మెకు కూడా సిద్ధమయ్యారు.

కొత్త చట్టంతో ఇబ్బందులే…
అయితే తాజా నిబంధనల ప్రకారం ప్రయివేటు ట్రావెల్స్ కూడా స్టేజీ క్యారియర్ పర్మిషన్ తీసుకునే వీలుంది. ఇప్పటి వరకూ ప్రధాన రూట్లలోనే ప్రయివేటు బస్సులు నడుస్తున్నాయి. ఈ కొత్త చట్టంతో గ్రామీణ రూట్లకు కూడా ప్రయివేటు బస్సులు తిరుగుతాయని, తద్వారా ఆర్టీసీకి ఆదాయానికి భారీగా గండిపడుతుందని చెబుతున్నారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ సంస్థను రక్షించాల్సింది పోయి….ప్రయివేటు వారికి ప్రభుత్వం తాబేదారుగా మారడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. నూతన ట్యాక్సీ పాలసీతో ట్యాక్సీలు, ఆల్ ఇండియా పర్మిషన్ ఉన్న వాహనాలు, 16 సీట్లున్న మినీ బస్సులకు పర్మిషన్ ఇస్తే ఆర్టీసీ కోలువకోవడం కష్టమే నని చెబుతున్నారు. దీనిపై ఆందోళనకు దిగుతామంటున్నారు ఆర్టీసీ కార్మికులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*