ఈసారి గెలవాల్సిందే అంటున్న చంద్రబాబు

chandrababu warning to kcr

తెలంగాణ తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్లేనని.. దుకాన్ బంద్ అని గులాబీ శ్రేణులు దెప్పిపొడుస్తూ ఎద్దేవా చేస్తూ ఉండవచ్చు గాక.. కానీ చంద్రబాబునాయుడు మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎన్నికల్లో తెలంగాణలో మనమే అధికారంలోకి వస్తాం అంటూ పార్టీ శ్రేణులకు ఉత్సాహం అందించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు నాయకులు పార్టీని వీడిపోయినప్పటికీ.. తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తల బలం, తెదేపాను అభిమానించే సామాన్యుల బలం అలాగే ఉన్నదని.. ఎట్టి పరిస్థితుల్లోను మనం గెలిచి తీరుతామని చంద్రబాబు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నాడు జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తదితరులు కేసీఆర్ సర్కారు పాలనను దుయ్యబట్టారు. ఇదంతా చాలా సహజ పరిణామాల్లాగా జరిగిపోయింది.

ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచి మనమే అనే నినాదంతో కార్యకర్తలలో స్ఫూర్తినింపడానికి నేతలు ప్రయత్నించడం అవసరమే.. కానీ.. నిశితంగా గమనిస్తే ఆ దిశగా పార్టీ క్రియాశీలంగా అడుగులు వేస్తున్నట్లు మాత్రం కనిపించడం లేదు. 31 జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత.. ఇప్పటిదాకా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియ మొదలైన దాఖలాలు లేవు. అలాగే గులాబీ సర్కారు ఏర్పడి, బలాన్ని మరింతగా పెంచుకున్న తర్వాత.. ఇప్పటిదాకా జరిగిన ఏ ఎన్నికలోనూ కూడా తెలుగుదేశం తమకున్న ప్రజాబలం సుస్థిరం అని నిరూపించుకోలేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో.. ‘గెలిచేది మేమే’ అనే ధీమా కంటె అప్రమత్తంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడం వారికి అవసరం అని పలువురు కార్యకర్తలు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*