ఎక్కడ నెగ్గాలోకాదు….ఎక్కడ తగ్గాలో…టీడీపీకి తెలుసు

తెలుగుదేశం

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. పార్టీ నుంచి సస్పెండ్ చేశామంటారు. అవసరమైనప్పుడు ఆయన పార్టీ వాడే కదా? అని సర్దిచెప్పుకుంటారు. జిల్లా తెలుగుదేశం పార్టీలో అరుదైన దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రకాశం జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. ఈయన పోను కూడా పోవడం లేదు. కానీ అధికార పార్టీకి పని వచ్చి పడింది. ఏం చేస్తాం? మనోడే కదా? అని వెళ్లి కలుసుకున్నారు.

ఈదరను సస్పెండ్ చేసిన టీడీపీ…
ప్రకాశం జిల్లాలో తొలినుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నందమూరి తారకరామారావుకు వీరాభిమానిగా ఈదర హరిబాబుకు పేరుంది. ఆయన తొలినుంచి పార్టీలోనే ఉన్నారు. ప్రతి ఏటా లక్షలు ఖర్చు చేసి ఎన్టీఆర్ నాటక పరిషత్ ఉత్సవాలను నిర్వహిస్తునే ఉన్నారు. ఒకసారి ఒంగోలు ఎమ్మెల్యేగా ఈదర గెలిచారు. అయితే తర్వాత ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ మరణానంతరం పార్టీలోనే ఉన్నా ఆయనకు పదవులేమీ దక్కలేదు. చివరకు గతంలో జరిగిన జడ్పీటీసీఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికయ్యేందుకు పార్టీ ఆదేశాలను ఈదర ధిక్కరించారు. వైసీపీ తో కలిసి ఆయన జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయనను జడ్పీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. అయితే ఈదర న్యాయస్థానాన్ని ఆశ్రయించి తిరిగి తన పదవిని తెచ్చుకోగలగాడు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ ఈదరను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కార్యాలయం స్థలం కోసం….
తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసినప్పటి నుంచి ఈదర పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈదరకు పార్టీ నుంచి ఎటువంటి ఆహ్వానం అందడం లేదు. అయితే ఇప్పుడు పార్టీకి ఈదర అవసరం వచ్చి పడింది. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కావాలి. అందుకు ఈదర సాయం కావాలి. ఇంకేముంది…పాత వివాదాలను పక్కన బెట్టి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ ఈదర వద్దకు వెళ్లారు. మాటామంతీ కలిపారు. అసలు విషయం చెప్పేశాడు. సహజంగానే తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమతో ఉండే ఈదర ఓకే చెప్పేశారు. ఇదేంటి? పార్టీ నుంచి సస్పెండ్ చేశారుకదా? అని మీడియా ప్రశ్నిస్తే..తామంతా ఒకటే అంటారు టీడీపీ నేతలు. ఇదండీ అసలు విషయం. ఇది ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*