జేపీ సూచనలు స్వచ్ఛ పాలకుల తలకెక్కుతాయా?

అవినీతిని రూపుమాపేందుకు తమ సర్కారు కట్టుబడి ఉన్నదని మోదీ పదేపదే చెబుతూ ఉంటారు. గత పాలకులు అందరూ అచ్చంగా అవినీతి పరులే అని.. తాము స్వచ్ఛమైన పాలన అందిస్తామని కూడా ఆయన వక్కాణిస్తుంటారు. అయితే పరిపాలన యంత్రాంగలో అవినీతిని రూపుమాపడానికి కేంద్రం పార్లమెంటు ముందుకు తెస్తున్న అవినీతి నిరోధక చట్టసవరణ బిల్లు చూస్తే జనానికి నవ్వొస్తుంది. నల్లధనం రూపుమాపుతా అంటూ పెద్ద మాటలు పలుకుతూ.. పెద్ద పెద్ద తిమింగలాల్ని వదిలేసి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నట్లుగానే.. అవినీతిన నిరోధక చట్టం సవరణకు ఉద్దేశించిన బిల్లులోని అంశాలు కూడా ఉన్నాయి. వాటివల్ల లంచం తీసుకున్న అధికారులు కాదు కదా.. ఇవ్వజూపిన వాళ్లే జైలుకు పోయే పరిస్థితి కనిపిస్తోంది.

బిల్లులో కొత్తగా చేస్తున్న సవరణల ప్రకారం ప్రభుత్వాధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిని విచారించడానికి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. వారి అనుమతి లేకుండా కనీస దర్యాప్తు కూడా చేయకూడదు.  లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన సామాన్యులకు మాత్రం మూడేళ్ల జైలు శిక్ష వేసేలా నిబంధనల్ని రూపొందించారు.

సరిగ్గా ఈ అంశం దగ్గరే లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ విభేదిస్తున్నారు. ఫౌండేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ కు కూడా ఆయన ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ అవినీతి నిరోధక చట్టం సవరణ బిల్లులో మార్పులు చేయాలని… అవినీతి అధికారుల భరతం పట్టేలా సవరణలు ఉండాలని జయప్రకాశ్ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి, విపక్ష నాయకురాలు సోనియాగాంధీకి, ఎంపీలకు కూడా లేఖలు రాశారు.

అయితే వ్యవస్థలోని అవినీతి మూలాల మీదనే మనుగడ సాగించే రాజకీయ నాయకులకు అచ్చంగా దానిని తుడిచిపెట్టేసేంత స్వచ్ఛమైన బుద్ధి ఉంటుందా అనేది అనుమానమే. నల్లధనం నియంత్రణ విషయంలోనే పాట్లు సామాన్యులకు ఎదురవుతున్నాయే తప్ప.. పెద్ద చేపలన్నీ నిశ్చింతగానే ఉన్నట్లు పరిణామాలు చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో స్పష్టంగా అవినీతి నిరోధక బిల్లు విషయంలో మోదీ సర్కారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. విజ్ఞత గల జేపీ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*