తిరుమలేశుని బాటలో.. సంస్థలు డిజిటల్ కావడం ముఖ్యం!

దేశంలో జరిగే ఆర్థిక లావాదేవీలు సమస్తం ఆన్‌లైన్ పద్ధతిలోకి మార్చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్రప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. రాష్ట్రం మొత్తం డిజిటల్ ఆర్థిక లావాదేవీలు పెరగడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పోస్ యంత్రాలు, స్వైపింగ్ మెషిన్లు, మొబైల్ వ్యవహారాలు ముమ్రంగా వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో అందరికీ ఎదురయ్యే ఆలోచన.. డిజిటల్ లావాదేవీలకు ప్రధానంగా అప్‌డేట్ కావాల్సింది ఎవరు? ప్రజలా.. సంస్థలా? అనేది కీలకం. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం అని చెబుతున్న ప్రభుత్వాలు ప్రాథమికంగా లావాదేవీలు జరిపే సంస్థల్లో చైతన్యం తీసుకురావడం అనేది ముఖ్యం. ఆ కోణంలో గమనించినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యానికి అభినందనలు చెప్పాల్సిందే. తిరుమలలో భక్తులు నగదు చెల్లించాల్సి వచ్చే ప్రతి చోటా స్వైపింగ్ మెషిన్లను ఏర్పాటు చేసింది టీటీడీ. నిజానికి భక్తుల వద్ద నగదు కొరత నేపథ్యంలో ఇది తాత్కాలికంగా చేసిన ఏర్పాటే అయినప్పటికీ.. ప్రభుత్వాల ఆలోచన డిజిటల్ దిశగా నడుస్తున్న నేపథ్యంలో.. ఈ స్వైపింగ్ మెషిన్లను శాశ్వతంగా కొనసాగించాలని కూడా అనుకుంటున్నారు.

అయితే తిరుమల తిరుపతి దేవస్థానాల బాటలోనే ప్రజలతో లావాదేవీలు నిర్వహించే దాదాపు అన్ని సంస్థలు కూడా డిజిటల్ బాటలోకి మళ్లవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ప్రజలందరికీ చైతన్యం కల్పించడం, వారిద్వారా నూరుశాతం డిజిటల్ లావాదేవీలు చేయించడం అనేది రెండో దశ కిందకు ప్లాన్ చేసుకుని, ముందుగా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలలో ఇవి వాడేలా చైతన్యం కలిగించడం అనేది కీలకం అని పలువురు భావిస్తున్నారు.

నిజానికి టీటీడీ వంటి ధార్మిక సంస్థే డిజిటల్ పర్వంలోకి మారిపోతున్నప్పుడు , వ్యాపార సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా డిజిటల్ విధానాల్లోకి మారవలసిన అవసరం ఉంది. వ్యాపారాలు పడిపోయాయని, జరగడం లేదని ఆందోళన చెందుతున్న వారు.. అలా చింతించడానికి బదులుగా డిజిటల్ విధానాలను అనుసరిస్తే… కనీసమాత్రంగా బిజినెస్ గ్యారంటీ ఉంటుందనే సంగతిని కూడా గుర్తించాలి. ప్రభుత్వం నిశ్చితాభిప్రాయంతో ముందుకు సాగుతున్నప్పుడు, వెనక్కు మళ్లే ఆలోచన లేనప్పుడు… వ్యాపార సంస్థలు ఇన్ని రోజులుగా డిజిటల్ పద్ధతిలోకి మారకుండా ఉండడమే పొరబాటు అనుకోవాలి.

అందుకే ప్రజలకంటె ముందుగా.. సంస్థలన్నీ కూడా డిజిటల్ విధానంలోకి మారితే.. ప్రాథమికంగా వారికే మేలు జరుగుతుంది. వ్యాపారాలు గతంలో కంటె కొంత మేర తగ్గినప్పటికీ.. ఆ తేడా పరిమితంగా మాత్రమే ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*