పద్మ దేవేందర్ రెడ్డి కి శాసన సభలో అవమానం!

పద్మా దేవేందర్ రెడ్డి

ఒకే ప్రాంగణంలో రెండు అసెంబ్లీలు. ఒక అధికార పక్షానిది కక్ష సాధింపు, మొండితనం నిండిన వ్యతిరేక వైఖరి అయితే; రెండో అసెంబ్లీలోని అధికార పక్షానిది నేర్పు, అనునయంతో కూడిన సానుకూల వైఖరి. కొట్టొచ్చినట్టు కనిపించే ఈ రెండు ధోరణులు అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ పక్షాలు నడుస్తున్న తీరును తెలుపుతున్నాయి. తాజాగా, తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ సభ్యురాలు డి.కె.అరుణ ‘సంస్కారం లేనివారు సభను నిర్వహిస్తున్నారు’ అని నోరు పారేసుకున్నారు. ఆ సమయంలో స్పీకర్ స్థానంలో కూర్చుని సభను నడిపిస్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. సభలోనే ఆమె కంట తడి పెట్టారు.మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని… ‘మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవు. సభాపతిని డిక్టేట్ చేయడం సరికాదు. డికె అరుణ వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ‘పక్కనే ఉన్న ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారు. అయితే తాము అలాంటి చర్యకు పోదలచుకోలేదు. గతంలో మేము సభలో మాట జారితే తమ నాయకుడు కెసిఆర్… మంత్రులతో క్షమాపణ చెప్పించారు. అది మా సంస్కారం. క్షమాపణ చెబితే కిరీటమేమీ పడిపోదు’ అన్నారు పక్ష నేత జానారెడ్డికూడా ‘ఈ పద్ధతి మంచిది కాద’ని హితవు చెప్పారు. ‘సభలో అందరూ హుందాగా వ్యవహరించాలి. సభాపతిపై ప్రతిపక్షానికి గౌరవముంది. సభ్యులు ఆవేశపడినా మేము సర్ధుబాటు చేసిన ఘటనలు ఉన్నాయి’ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.దీనిపై స్పందించిన డీకే అరుణ… అసలు తాను ఆ మాట అనలేదు అంటూనే, ‘చైర్‌ని ఉద్దేశించి అనలేదు’ అన్నారు.కొద్దిసేపు వాగ్వాదం నడిచాక, ‘సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారనే మాట మాట్లాడారా? లేదా? చివరి సారిగా చెప్పండి’ అని డిప్యూటీ స్పీకర్ పద్మ ప్రశ్నించగా… ‘నేను అనలేదు’ అని అరుణ సమాధానమిచ్చారు. అనంతరం సభ ఆ అంశాన్ని వదిలేసి సబ్జెక్టుపై చర్చ ప్రారంభించింది.సరిగ్గా ఇటువంటి తరహా వాగ్వాదంలోనే ఏపి శాసనసభ్ తమ ఎమ్మెల్యే రోజాని ఏడాదిపాటు సస్పెండ్ వేయడం, ఆమె కోర్టుకెక్కడం, ప్రభుత్వ పక్షం పంతానికి పోవడం తదితర సంగతులు మనకు తెలిసిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*