బ్యాంకులు ఐపీ పెట్టాయంటూ మైసూరా పిల్!

మైసూరా రెడ్డి

నోట్ల రద్దు వ్యవహారం, తత్పర్యవసానంగా రోజులు గడుస్తున్నప్పటికీ ప్రజలకు తీరని కష్టాలు.. క్రమంగా న్యాయపీఠం ఎదుటకు చేరుతున్నాయి. నోట్ల రద్దు నిర్ణయాన్నే ఉపసంహరించుకునేలా చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషన్ లు వీగిపోయాయిగానీ.. ఆ సందర్భంలో ప్రజలు కష్టాలకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ కష్టాలు ఇప్పటిదాకా అణువంతైనా తగ్గలేదు. కొత్తనోట్ల లభ్యత లేక కష్టాలు మరింత పెరిగాయా అనుకునే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి మైసూరా రెడ్డి తాజా హైకోర్టులో సోమవారం ఓ పిల్ దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం మంగళవారం విచారించనుంది.

బ్యాంకులు మూసివేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని, నోట్లు లేవు అనే నెపంతో బ్యాంకులు మూసివేయడం అనేది .. ఐపీ పెట్టిన వ్యక్తితో సమానం అని పేర్కొంటూ సీనియర్ నేత మైసూరా రెడ్డి తన పిల్ లో పేర్కొన్నారు. బ్యాంకుల్లో మా డబ్బులు మాకు ఇవ్వకుండా మూసివేస్తున్నారు.. అనేది పిల్ లో మైసూరా చేసిన ప్రధాన ఆరోపణ. వ్యక్తిగత అవసరాలకోసం బ్యాంకులకు వెళితే.. డబ్బులేదంటూ తిప్పి పంపుతున్నారంటూ మైసూరా రెడ్డి పిల్ లో ఆరోపించారు.

మైసూరారెడ్డి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేకుండా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చిన తరువాత.. రాయలసీమ హక్కుల కోసం గళం వినిపించిన మైసూరా రెడ్డి.. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లుగా కూడా ఒక దశలో పుకార్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే మైసూరారెడ్డి రాజకీయంగా తెరమరుగైనట్లుగానే అందరూ భావిస్తున్న తరుణంలో.. ఇప్పుడు మళ్లీ నోట్ల రద్దు బ్యాంకుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై పిల్ వేయడం ద్వారా మైసూరా వార్తల్లోకి వచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*