ముద్రగడతో మోహన్‌బాబు : ఏమిటి సంకేతం?

మోహన్ బాబు

సమకాలీన వ్యవహారాల్లో సినీ నటుడే అయినప్పటికీ రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక క్రేజ్ కలిగి ఉన్న వ్యక్తి మంచు మోహన్‌బాబు! ఎన్నడో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయన ఓసారి రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. అయితే తరచూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉండడం, తాను రాజకీయాల్లోకి త్వరలో వస్తా అంటూ కొన్ని సంకేతాలు ఇస్తుండడం మోహన్ బాబుకు అలవాటే.

అయితే తాజాగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసకారి సీఎం అంటూ నానా మాటలూ దూషిస్తూ నిందలు వేస్తూ ఉండే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి మరీ మోహన్ బాబు భేటీ కావడం, అనంతరం, ఒక పోరాట యోధుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నదంటూ ముద్రగడ గురించి ఆకాశానికెత్తేస్తూ వ్యాఖ్యానించడం, కాపు ఉద్యమం విజయవంతం అవుతుందంటూ దీవించడం…  సీరియస్ గా పరిగణించాల్సిన అంశం లాగానే ఉంది. ముద్రగడతో మోహన్ బాబుకు పాత పరిచయం ఉన్న మాట వాస్తవమే కావొచ్చు గాక.. కానీ తాజా పరిణామాల్లో ఆయనతో భేటీ అనేది నలుగురిలో చర్చనీయాంశమే.

అభిజ్ఞవర్గాల సమాచారాన్ని బట్టి మోహన్ బాబు , సీఎం చంద్రబాబునాయుడు మీద కినుకగానే ఉన్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో సాయిబాబా ఆలయం, కల్యాణ్ మండపం, వృద్ధాశ్రమం వంటివి చాలా కలిపి నిర్మించడానికి స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వానికి వినతిపత్రం పెట్టుకుంటే కేవలం 1.5 ఎకరాలు ఇవ్వడం ఆయనకు అవమానంగా ఉంది. అలాగే ప్రెవేటు విద్యాలయాలకు యూనివర్సిటీ హోదా ఇవ్వడంలో తమ శ్రీవిద్యానికేతన్ కు ప్రాధాన్యం దక్కలేదనే బాధ కూడా ఉన్నదని వదంతులున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు వ్యతిరేక పోరాటం చేసే వ్యక్తులకు శక్తులకు తన మద్దతు ఉంటుందని మోహన్ బాబు సంకేతం ఇవ్వదలచుకున్నారా అని పలువురు సందేహిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*