రాబడి లెక్కలు చూసుకుని ఖంగుతిన్న చంద్రబాబు

నోట్ల రద్దు ఎఫెక్టుతో రాష్ట్రప్రభుత్వ ఆదాయం పడిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిరోజునుంచి అంటూనే ఉన్నారు. ఆ మేరకు రాష్ట్రాలకు ప్రత్యేకంగా చేయూత ఇవ్వడం గురించి ఆయన ప్రధానితో ఒక విడత మంతనాలు కూడా పూర్తిచేశారు. అయితే రాష్ట్రప్రభుత్వపు ఆదాయ వనరులు, శాఖలపై మంగళవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబునాయుడు..  పడిపోతున్న ఆదాయం చూసుకుని ఖంగు తిన్నారు. ఆదాయం పెంచుకోవాల్సిన మార్గాల గురించి అదికారులతో చర్చించారు.

ఆదాయం పెంచటానికి జిల్లాల వారీగా కన్సల్టెంట్లతో కసరత్తు చేసినా ఆశించినంత ఆదాయం రాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులు చూపించే లెక్కల్లో కచ్చితత్వం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆదాయాన్ని ఆర్జించే విభాగాల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సీఎంఓలో సమీక్షించారు.   మండలాల వారీగా జీఎస్ డీపీ ని రియల్ టైమ్ లో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల వసూళ్లకు జిల్లాల వారీగా శ్రద్ధపెట్టి తాను కొన్ని ప్రణాళికలను ఇచ్చినా అధికారులు లక్ష్యాలను అందుకోలేకపోయారని అన్నారు. అధికారులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని కోరారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కడ వృద్ధి రేటు పెరిగింది? ఎక్కడ తగ్గిందో సరైన కసరత్తు చేయాలని ,యంత్రాంగానికి ఒక దృక్పధం ఉండాలని, ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి లక్ష్య సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు  కొన్ని పన్నుల వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేయటం వల్ల ఖజానాకు రాబడి తగ్గిందన్నారు.  కొన్ని జిల్లాలలో కరవు, మరికొన్ని జిల్లాలలో అకాల, భారీ వర్షాల కారణంగా నీటి పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గాయన్నారు.

మానవ వైఫల్యం ఉన్నచోటనే వృద్ధిరేటు తగ్గుతోందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే  2016-లో నీటిపన్నులుగా రూ.831 కోట్లు లక్ష్యం కాగా రూ142.27 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రకృతి వైపరీత్యాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేనాటికి లక్ష్య సాధన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మరోవైపు గనుల శాఖలో పెద్ద ఖనిజాల ద్వారా  2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ 357 కోట్ల ఆదాయం లభించింది.  సూక్ష్మ లేదా ధాతు ఖనిజాల ద్వారా రూ. 502 కోట్ల ఆదాయం వచ్చింది.ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 2015-16లో వార్షిక ఆదాయ లక్ష్యం రూ 3500.00 అయితే  సాధించి ఆదాయం రూ. 3585.12 కోట్లు. 102.43 % లక్ష్యం సాధించింది. వృద్ధిరేటు 24.72% గా రాగా,  సగటు వృద్ధిరేటు  16.18%గా వచ్చిందని అధికారులు వివరించారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత వాహనాల విక్రయాలు గ్రామీణంలో 50%, పట్టణాల్లో 25% తగ్గిపోయాయని రవాణా శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 70% కార్లు, 40%  ద్విచక్రవాహనాలు ఫైనాన్స్ ఆధారంగానే విక్రయాలు జరుగుతాయని, అందుకే తగ్గుదల వచ్చిందన్నారు.  పాత వాహనాలను ఇచ్చి కొత్త వాహనాలు తీసుకునే వ్యాపారంపై  పెద్ద కరెన్సీ రద్దు ప్రభావం అధికంగా ఉందని, ప్లాస్టిక్ మనీపై బ్యాంకులు సర్వీసు చార్జీలు రద్దు చేస్తే వాహనాల విక్రయాలు పెరిగే అవకాశం ఉన్నదని రవాణా శాఖ సూచించింది.

తెలంగాణలో రవాణా శాఖ  ఆదాయంలో అధిక భాగం లైఫ్ ట్యాక్స్ ల మీదనే వస్తుందని, పెద్ద కరెన్సీ రద్దు తర్వాత  లైఫ్ ట్యాక్సుల రూపంలో రూ.45 కోట్లు నష్ట పోయిందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అధికారులు వివరించారు. వాహనాల విక్రయాల్లో  ఆంధ్రప్రదేశ్ 21.8 % ఉండగా, తెలంగాణ లో 15.09%గా ఉంది.

ఆటో ఇండస్ట్రీ కోలుకునేందుకు 6 నెలలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. డీమోనెటైజేషన్ వల్ల లైఫ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్ తగ్గుదల కనపడుతోందని చెప్పారు.  పన్నుల చెల్లింపును తాత్కాలికంగా నిలిపివేయటం వల్ల వసూళ్లు తగ్గాయన్న రవాణా శాఖ అధికారులు తెలిపారు.ఈ పోస్ మిషన్లను పెద్దసంఖ్యలో వినియోగిస్తున్నందువల్ల నాలుగు వారాల్లో పరిస్థితి మెరుగుపడవచ్చన్నారు.  మళ్లీ పన్నులు వసూళ్లు పునరుద్ధరించాలని రవాణా శాఖ అధికారులు కారు. కాగా రవాణా శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 2015-16లో రూ. 106 కోట్ల ఆదాయం ఉండగా  ఈ ఆర్ధిక సంవత్సరంలో (ఇప్పటి దాకా చూస్తే) 103.80 కోట్లకు తగ్గుదల కన్పించింది.

రంగాల వారీగా ఆదాయం (రూ. కోట్లలో)

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదాయం  2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ. 8064.98 కోట్లు (12.64%).

పరిశ్రమలు రూ. 3805.47 కోట్లు.

సేవారంగం: 33,887.55 కోట్లు,

వ్యవసాయం రూ. 1128.84 కోట్లు,

శాతాల వారీగా వృద్ధి రేటు చూస్తే ..

వాణిజ్య పన్నులు: 2015-16     16.79%, 2016-17 అక్టోబర్ దాకా  12.55%,

ఎక్సైజ్ 2015-16 లో  14.80% 2016-17 అక్టోబర్ దాకా  8.68%,

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 2015-16  24%, 2016-17 అక్టోబర్ దాకా:  9.29 శాతం,

రవాణా శాఖ: 2015-16 లో  20.70%,

2016-17  లో  21.08% ,

అటవీ శాఖ  2015-16: 23.13%, 2016-17   (-) 10.28%,

గనుల శాఖ: 2015-16:    55.00%,

ల్యాండ్ రెవెన్యూ: (-) 1.00 % 2016-17: 11.83%

గణాంకాలను నమోదు చేశాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*