రేవంత్ రాంగ్ డెసిషన్

రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో మళ్లీ లొల్లి షురువయ్యింది. మొన్నటి వరకు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై రుసరుసలాడారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పద్మావతే తమ అభ్యర్థి అని ప్రకటించగానే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం ఆక్షేపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఎలా నిర్ణయం తీసుకుంటారని విభేదించారు. తాను సూచించిన అభ్యర్థికే టిక్కెట్ ఇవ్వాలని బహిరంగంగా వాధించారు. చివరికి అధిష్టానం పద్మావతిని ఎంపిక చేయడం, ఏఐసీసీ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది.

ఎవరు చెప్పారు….?

ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. సమాచారాలు లేకుండానే ఎవరికి వారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంపై నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. రాష్ట్ర నాయకులెవరికీ సమాచారం ఇవ్వకుండా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి ఎలా పిలుపు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తమ్ మాటేమిటి?

ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముట్టడిలో అందరూ పాల్గొనాలని ఎలా చెబుతారంటూ ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని సమాలోచనలు జరుపుతున్నారు. ఇవ్వాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ దుమారం రేగింది. భట్టి విక్రమార్క ముందు నాయకులు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఈ సమావేశంలో వి.హనుమంతరావు,కోదండరెడ్డి, కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. మరి వీరి నిర్ణయం ఏముంటుందో వేచి చూడాల్సిందే.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*