దేశాన్ని రెండు ముక్కలు చేయనివ్వను….!!!

rahulgandhi speech in samshabad

కేవలం ధనికులు, పెట్టుబడిదారుల కోసం మోదీ ప్రత్యేకంగా భారతదేశాన్ని రూపొందిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శంషాబాద్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. నీరవ్ మోదీ, చోక్సీ, విజయ్ మాల్యా వంటి వాళ్లు బ్యాంకుల నుంచి లక్షల కోట్లు రుణాలు తీసుకుని పారిపోయినా, విచారణ కేంద్ర ప్రభుత్వం చేయదన్నారు. ఐదేళ్ల పాలనలో దేశాన్ని రెండు ముక్కలు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రుణాలు ఎగవేసి పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నా, మరోవైపు రైతులు తమ రుణాలను మాఫీ చేయమన్నా పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా మోదీ పట్టించుకోవడం లేదన్నారు. లోక్ సభ లో టీఆర్ఎస్ ఎంపీలు మోదీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. నోట్ల రద్దు సమయంలో కేసీఆర్ దానిని సమర్థించారన్నారు. నోట్ల రద్దు వల్ల దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులుగా మారితే, కేసీఆర్ మాత్రం శభాష్ అంటారని రాహుల్ అన్నారు.

వంత పాడుతున్నారు…..

జీఎస్టీ అమలు చేస్తే దానికి కేసీఆర్ వంతపాడతారన్నారు. లోక్ సభ, రాజ్యసభలో మోదీ పాల్పడే ప్రతి దుర్మార్గానికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నారన్నారు. రఫైల్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అనిల్ అంబానీకి కట్టబెట్టే ప్రయత్నాన్ని మోదీ చేశారన్నారు. హెచ్ఎఎల్ కు కాంట్రాక్టు ఇవ్వకుండా అంబానీకి కాంట్రాక్టులిచ్చి నిరుద్యోగుల పొట్ట కొట్టారన్నారు. అనిల్ అంబానీ జీవితంలో ఎప్పుడూ యుద్ధ విమానం తయారు చేయకపోయినా ఆయనకు కాంట్రాక్టులిచ్చారన్నారు. ప్రతిరోజూ నరేంద్ర మోదీ అవినీతిపై తాను ప్రశ్నిస్తున్నానన్నారు. హిందూ పత్రికలో మోదీ అవినీతి గురించి ప్రచురించినా పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పుడైనా కేసీఆర్ నరేంద్ర మోదీ ముప్పయి వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని ప్రశ్నించారా? అని నిలదీశారు. ఇక్కడ కేసీఆర్ మనసులో నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాలని ఉందన్నారు. కేసీఆర్ అవినీతి కూడా నరేంద్రమోదీకి కూడా తెలుసునన్నారు. రిమోట్ కంట్రోల్ తో కేసీఆర్ ను మోదీ ఆడిస్తున్నారన్నారు. కేసీఆర్, మోదీల మధ్య దోస్తీ ఉందన్నారు.

అందరికీ కనీస ఆదాయం….

తాను ఎట్టి పరిస్థితుల్లో భారత్ ను రెండు ముక్కలుగా చేయబోనివ్వనన్నారు. మోదీ కేవలం పదిహేను మంది పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ కనీస ఆదాయ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. భారతదేశంలో ఉన్న ఏ పేద వాడు కూడా ఆకలితో అలమటించే పరిస్థితి ఉండదన్నారు. తాము ఒక ఆదాయ పరిమితిని ఫిక్స్ చేస్తామని, దానికంటే తక్కువగా ఏ పేదవారూ ఉండకూడదని తమ ఉద్దేశ్యమన్నారు. ప్రతి పేద వాడి బ్యాంక్ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నగదును జమ చేస్తామన్నారు. నరేంద్ర మోదీ నీరవ్ మోదీ జేబులో డబ్బులేస్తే, తాను పేదవాడి జేబులో వేస్తామని చెప్పారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి…. చెప్పినట్లే చేశామన్నారు. తాము అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు అండగా నిలబడతామన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళ రిజర్వేషన్లు బిల్లు అమలు చేస్తామన్నారు. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ సంచలన ప్రకటించారు.

Ravi Batchali
About Ravi Batchali 30044 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*