విజయమ్మ పూర్తి లేఖ ఇదే…?

విజయమ్మ

మూడు రోజులుగా ఎల్లో మీడియాలో, రాజకీయంగా మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరవాత, డాక్టర్‌ వైయస్సార్‌గారి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్‌ వైయస్‌ఆర్‌గారు 2009 సెప్టెంబరు 2న మరణించిన నాటినుంచి మా కుటుంబం ఎవరెవరికి ఏయే కారణాలవల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాలమీద ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రజలలో చంద్రబాబు బలాన్ని పెంచలేం అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని వ్యతిరేస్తున్న తెలుగుదేశం పార్టీ, టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు–ఈటీవీ, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్, టీవీ 5 వంటి మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, చర్చలు ప్రసారం చేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. గత ఏడేళ్ళుగా పవన్‌ కల్యాణ్‌ కూడా వారి బాటలోనే మా కుటుంబాన్ని టార్గెట్‌ చేయటం కూడా అందరికీ తెలిసిన విషయమే.

ప్రజలు నీరాజనం….

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌–కార్పొరేషన్‌ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌బాబు నేతత్వంలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ–జడ్పీటీసీల్లో పోటీ నుంచి వైదొలగుతున్నాం అని ప్రకటించటాన్ని కూడా చూశాం. ఎల్లో మీడియా రాజకీయంగా ఎవరి కోసం ఈ పని చేస్తోందో అందరికీ తెలుసు. చిన్న గీతను పెద్దది చేయలేం కాబట్టి, పెద్దగీతను చెరిపి చిన్నది చేసేందుకు పైన చెప్పిన పార్టీలు, వ్యక్తులు ఒకే మాట–ఒకే బాటగా అబద్ధాలు చెప్పటం ప్రారంభించారు. వారు చెప్పిన అసత్యాలను ప్రజలు ఏనాడూ పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టే ఆనాడు మహానేతకు, ఇప్పుడు జగన్‌బాబుకు ప్రజలు ఇంతగా బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ప్రజలను కన్విన్స్‌ చేయటం సాధ్యం కావటం లేదు కాబట్టి, మా కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని మమ్మల్ని తగ్గించాలని ఆంధ్రజ్యోతి రాధాకష్ణ వారం వారం రాస్తున్న రాతల్ని చూస్తే ఈయన చేసేది జర్నలిజమేనా అనిపిస్తోంది.

వివేకా హత్యపై…

వైఎస్‌ వివేకానందరెడ్డిగారు మా మరిదిగారు. ఆయన్ను 2019 మార్చిలో ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందే. ఇది నామాట… ఇదే జగన్‌ మాట… ఇదే షర్మిల మాట. ఇందులో మా కుటుంబంలో ఎప్పటికీ రెండు అభిప్రాయాలు లేవు. హత్య జరిగినది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 మార్చిలో. ఆ హత్య తరవాత రెండున్ననర నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి ఆయన మంత్రి, పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి పాత్రమీద అనేక అనుమానాలున్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన్ను తిరుపతిలో స్టేజీమీద పెట్టుకున్న పవన్‌ కల్యాణ్, దర్యాప్తు సీబీఐ చేతిలో… అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్‌ మీద విమర్శలు చేశారు. ఇక్కడే మరో విషయం… జగన్‌మీద హత్యాయత్నం 2018 అక్టోబరులో జరిగితే… 2019 మే చివరి వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అంటే దర్యాప్తుకు సంబంధించిన కీలక సమయంలో మా ప్రత్యర్థి, కుటుంబ పరంగా కూడా మమ్మల్ని ద్వేషించే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ కేసుల్ని డీల్‌ చేశారన్న నిజాన్ని కూడా మరచిపోయి… ఇప్పుడు ఆ దర్యాప్తును కేంద్రం చేస్తోంది అని తెలిసి కూడా, ఈ రోజు ఏదీ ఎవరికీ గుర్తు లేదన్నట్టు పత్రికల్లో, టీవీల్లో, సభల్లో, ప్రెస్‌మీట్లలో ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. దర్యాప్తు సీబీఐ, ఎన్‌ఐఏ చేయాలి. ఈ రెండూ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావు. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. దర్యాప్తు వేగం పెంచాలని మధ్యలో జగన్‌బాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది.

నిజాలను దాచిపెట్టి…..

నిజాలు ఇలా ఉంటే పత్రిక ఉంది కదా అని రాధాకష్ణ ఏం రాశారు? డాక్టర్‌ సునీత ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలంటాడు. వివేకానందరెడ్డిగారిమీద జగన్‌ చేయి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయంటాడు. సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు న్యాయం జరగటం లేదని సునీతమ్మ కుంగిపోతోందని రాశాడు. అదే సమయంలో షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారని రాశాడు. మా బంధు వర్గం కూడా రెండుగా చీలిపోయిందని, జరుగుతున్న పరిణామాలు చూసి నేను కూడా మానసికంగా కుమిలిపోతున్నానని రాశాడు. వివేకానందరెడ్డిగారిమీద చేయి చేసుకోవటం ఏమిటి? వయసులో పెద్ద అయితే ఇంట్లో తోటమాలిని కూడా అన్నా అని సంబోధించే మనస్తత్వం జగన్‌ది. సంవత్సరాల తరబడి జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రల్లో జగన్‌ స్వభావం, మనస్తత్వం ఎలాంటివో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ విషయాలు అందరికీ తెలుసు… ఇంతటి తీవ్రమైన అసత్య ఆరోపణలు రాధాకష్ణ ఏ నోటితో చేయగలుగుతున్నాడు? వివేకానందరెడ్డిగారి వర్ధంతికి నివాళులు అర్పించకుండా ఎవరో అడ్డుకున్నారని రాశారు. నిజానికి ఆ సందర్భంలో నన్ను హాజరు కావాల్సిందిగా జగన్‌ తానే నాకు చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో వెళ్ళ వద్దనే కుసంస్కారాలు మా ఇంటా వంటా లేవు. నా పిల్లల్ని చూసి, వైయస్సార్‌ భార్యగా, వారి తల్లిగా ఎప్పుడూ గర్వపడ్డానే తప్ప నేనెందుకు కుంగిపోవాలి? నా పిల్లలు ఇద్దరూ ప్రజాసేవలో ఉన్నారని, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తున్నారని… ఎలాంటి ఎదురుగాలిని అయినా తట్టుకుని జగన్‌బాబు నిలబడ్డాడని… పరిపాలనలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడని… మహానేతకు భార్యగా, ఏపీ ముఖ్యమంత్రికి తల్లిగా ఉన్న నేను గర్వపడతానా? లేక కుంగిపోతానా? షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మింది. ఓదార్పు యాత్ర కావచ్చు… పాదయాత్ర కావచ్చు… తెలంగాణలో అవకాశం అన్నకు కాకుండా, దేవుడు తనకే ఇచ్చాడంటే దాని అర్థం తెలంగాణ ప్రజలతో తనకు అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని ఆమె నమ్ముతోంది. కాబట్టి షర్మిలమ్మ తెలంగాణలో ముందడుగు వేస్తోంది. ఎల్లో మీడియా పిచ్చిరాతల్లో నా బిడ్డలమధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అది ఏనాటికీ జరగని పని.

షర్మిల నిర్ణయంపై….

ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌బాబు తనకు పొరుగున ఉన్న ఏ రాష్ట్రం ముఖ్యమంత్రితో అయినా, అక్కడి ప్రభుత్వంతో అయినా తన రాష్ట్ర శ్రేయస్సు దష్ట్యా సత్సంబంధాలు ముఖ్యమని భావించినందువల్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ను తెలంగాణలో నడిపించటం కుదరదని స్పష్టం చేసినందున… ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజల్లో ప్రజాసేవలో ఉండాలని షర్మిలమ్మ నిర్ణయించుకుంది. ఇవి వేర్వేరు అభిప్రాయాలే తప్ప వారిద్దరి మధ్య విభేదాలు కావు. అయినా ఓ వీక్లీ సీరియల్‌గా అసత్యాలతో కథలు రాశారు. ఇక సునీత విషయానికి వద్దాం. వివేకానందరెడ్డిగారిని హత్య చేసినవారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలన్నదే సునీత డిమాండ్‌. అదే మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈ విషయంలో మా అందరి మద్దతూ ఆమెకు ఉంది. మహిళలపట్ల జగన్‌బాబుకు ఉన్న అత్యంత గౌరవం, అభిమానం ఆయన పాలనలో అనేక పథకాల్లో కనిపిస్తూనే ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తులో…..

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, స్వయంగా తనకు సంబంధించిన కేసే అయినా… లేక తన బాబాయి హత్య కేసే అయినా… కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు చేస్తున్నప్పుడు తాను చేయగలిగినది ఏముంటుంది? ఇవన్నీ అందరికీ అర్థం అవుతున్న నిజాలు. అంతెందుకు? డాక్టర్‌ వైయస్సార్‌గారి మరణాన్నే తీసుకోండి… ఆయనది మరణమా, లేక హత్యా అన్న అనుమానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉంది. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగాం? మా సంస్కారాలను తెలుగుదేశం వారు, వారి అనుకూల మీడియా అధిపతులు గౌరవించకపోయినా పరవాలేదు. కానీ ఈ కుటిలమైన రాతలేమిటి? బురదపూయటం వారి పని, శుభ్రం చేసుకోవటం మా కుటుంబం పని అన్నట్టుగా రాస్తున్న ఈ రాతలనిండా చంద్రబాబుకు అధికారం పోయిందన్న కడుపు మంటతోపాటు జగన్‌బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న ఈర్ష్య కూడా చంద్రబాబులో, ఆయన ఆనుచరుల్లో ఏమాత్రం దాగటం లేదు.

చంద్రబాబు భజన చేసినా…?

నేను ముందుగానే చెప్పినట్టు… వీరు తమ మీడియాలో ఎంతగా చంద్రబాబు భజన చేస్తున్నా దాని వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు కాబట్టి వీరికి ఇక మిగిలిన దారేమిటి? అసత్యాలు, కట్టుకథలతో ఇక వైయస్సార్‌ కుటుంబం మీద పడాలన్న నిర్ణయంతోనే గడచిన ఏడాదిగా ఇలాంటి రాతలు మరీ ఎక్కువయ్యాయి. రాష్ట్రపతి–జగన్‌ ఏం మాట్లాడుకున్నారు? ప్రధాని–జగన్‌ ఏం మాట్లాడుకున్నారు… అని వారిద్దరి మధ్యా వీరే ఉన్నట్టుగా… వన్‌ టూ వన్‌ సంభాషణల్ని కూడా ఏవేవో ఊహించుకుని దాన్ని న్యూస్‌గా ప్రింట్‌ చేసే పత్రికలతో, అలాంటి వార్తల్ని పట్టుకుని ప్రెస్‌మీట్లు పెట్టే పార్టీలతో మా కుటుంబం గత నాలుగున్నర దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అసత్యాలను ఇంతగా నమ్ముకుని పత్రికల్ని, పార్టీల్ని నడుపుకునే కంటే వీరంతా వేరే ఏదన్నా పని చేసుకుంటే బాగుంటుంది.

 

– వైఎస్ విజయమ్మ

Ravi Batchali
About Ravi Batchali 40437 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*