ఖైదీ నంబరు 150 – రివ్యూ (4 / 5)

నటీనటులు: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, రాయ్‌ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
కాస్ట్యూమ్స్‌: కొణిదెల సుస్మిత
ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
మాటలు: పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయి మాధవ్‌, వేమారెడ్డి
నిర్మాత: రామ్‌చరణ్‌
సమర్పణ: కొణిదెల సురేఖ
కథ: మురుగదాస్‌
దర్శకత్వం: వి.వి.వినాయక్‌
విడుదల తేదీ: జనవరి 11, 2017

తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ  నంబరు 150 ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. రాజకీయాల్లో చిరంజీవి నుంచి జనం కోరుకున్న దూకుడు సినిమాలో పుష్కలంగా లభిస్తుంది.  ఆరు పదుల వయసు దాటినా చిరు కరిష్మా ఏ మాత్రం తగ్గలేదు.  మునుపటి చిత్రాలకంటే అందంగా చిరును చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. టెక్నికల్ టీం కృషి కూడా స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది.

chiru2
చిరంజీవి ద్విపాత్రభినయం చేసిన ఖైదీ నంబరు 150…

రెండు విభిన్న పాత్రల్లో చిరంజీవి ఒదిగిపోయాడు. దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్ మాయ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. బెంగాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కత్తి శీను… జైలు నుంచి పారిపోతున్న మరో నిందితుడ్ని పట్టుకునేందుకు  జైలు సిబ్బందికి సహకరిస్తూ తాను తప్పించుకుని పారిపోతాడు. హైదరాబాద్‌లో ఉండే మిత్రుడు పార్వతి(అలీ) సాయంతో బ్యాంకాక్‌ పారిపోయేందుకు స్కెచ్‌ వేస్తాడు. పాస్‌పోర్టు., వీసా సమకూర్చుకుని బ్యాంకాక్‌  పారిపోయే క్రమంలో ఎయిర్‌ పోర్టులో  సుబ్బలక్ష్మీ (కాజల్‌) ప్రేమలో పడతాడు.  బ్యాంకాక్‌ ట్రిప్‌ వాయిదా వేసుకుని ఆమె కోసం వెదకడం ప్రారంభిస్తాడు. తాను ప్రేమించిన బాల్యమిత్రురాలు సుబ్బలక్ష్మీ కాదని మళ్లీ బ్యాంకాక్‌ వెళ్ళే ప్రయత్నంలో  శత్రువుల కాల్పుల్లో గాయపడిన శంకర్‌(డ్యూయల్ రోల్)ను ఆస్పత్రిలో చేరుస్తాడు. పోలీసులు తన కోసం వెదుకుతున్నారని గుర్తించి తన వస్తువుల్ని శంకర్‌ వద్ద వదిలేసి., అట్నుంచి బ్యాంకాక్ పారిపోవాలని ప్లాన్‌ వేస్తాడు. ఈ క్రమంలో కత్తిశీనును శంకర్‌గా భావించి., అతనికి గ్రామానికి సంబంధించిన కేసులో పరిహారం చెల్లించేందుకు  శీనును, కలెక్టర్‌ వృద్ధాశ్రమానికి  తీసుకువస్తాడు. పరిహారం తీసుకునేందుకు రైతులు నిరాకరించి చెక్కు చించివేయడంతో మళ్లీ డబ్బు వచ్చే వరకు అక్కడే ఉండాలని శీను., పార్వతి ప్లాన్‌ చేస్తారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది.

రాయలసీమలోని నీరూరు అనే గ్రామం ., రైతుల భూమి చుట్టూ కథ తిరుగుతుంది.  నీరు లేని నీరూరులో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో  అక్కడ కోలా ఫ్యాక్టరీ పెట్టాలని అశోక్‌ అరోరా అనే పారిశ్రామిక వేత్త(విలన్)  ప్రయత్నిస్తుంటాడు. జలవనరుల్ని కనుగొనే ప్రయత్నంలో  ఆ ప్రాంత రైతులందర్ని హతమార్చి వారు భూముల్ని అమ్మేసినట్లు  నకిలీ పత్రాలు సృష్టిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శంకర్‌  గ్రామస్తులతో కలిసి ఆందోళన ప్రారంభిస్తాడు. అధికారులు., ప్రభుత్వం., మీడియా ఎక్కడా న్యాయం జరగకపోవడంతో గ్రామానికి చెందిన కొందరు రైతులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం సంచలనమవుతుంది. ఈ వ్యవహారంపై న్యాయవిచారణ జరుగుతున్న సమయంలో  శంకర్‌ స్థానంలోకి కత్తిశీను ప్రవేశిస్తాడు. శంకర్‌ను బెంగాల్‌ జైలుకు తరలిస్తారు. మొదట్లో డబ్బు కోసం  ఆశ్రమంలో పాగా వేసిన శీను….. శంకర్‌ పోరాటానికి మద్దతుగా ఓ సంస్థ విరాళాలు అందించి అతని నేపథ్యాన్ని వివరించడంతో మనసు మార్చుకుంటాడు.  విలన్‌ను ఢీకొట్టే క్రమంలో చిరంజీవి తరహా మాస్ మసాలా ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి.  సమస్య తీవ్రతను  ప్రజలందరికి వివరించేందుకు హైదరాబాద్‌ మొత్తం నీటి సరఫరా నిలిపివేసి జనం దృష్టిని ఆకర్షిస్తాడు. చివరకు శంకర్‌., శీను వేర్వేరు అని తెలుసుకున్న విలన్, శంకర్‌ను కిడ్నాప్‌ చేసి భూములు తనకు రాసివ్వాలని ఒత్తిడి చేస్తాడు. శంకర్‌., శీను కలిసి  విలన్‌ను తుదముట్టించడంతో  కథ ముగుస్తుంది.

chiru_kajal

భూసేకరణ., కార్పొరేట్ శక్తుల దుర్మార్గాల చుట్టూ తిరిగే కథ సగటు ప్రేక్షకుడ్ని బాగానే అలరిస్తుంది. ఆరు పదుల వయసు దాటినా చిరంజీవి న్యూలుక్‌ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. సినిమాటోగ్రాఫీ.,  బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రేక్షకుల్ని విసుగు చెందనివ్వకుండా కూర్చోబెడతాయి.  రైతుల సమస్యల్ని వివరించే క్రమంలో కథనం కొన్ని చోట్ల నెమ్మదించినా    ప్రేక్షకులు ఆ బోర్‌ ఫీల్ కాకుండా దర్శకుడు విజయవంతమయ్యాడు.  పరుచూరి సోదరుల పంచ్‌ డైలాగులు., సాయిమాధవ్‌ మాటలు థియేటర్‌ను హోరెత్తిస్తాయి.  కామెడీ కూడా ఎక్కడ శృతి మించకుండా జాగ్రత్తపడ్డారు.  పార్వతీ పాత్రలో అలీ., డాబర్‌మెన్‌ పాత్రలో బ్రహ్మానందం., కేర్‌టేకర్‌ పాత్రలో రఘుబాబు., ప్రభుత్వాధికారిగా జయప్రకాష్‌రెడ్డి., పొలిటికల్‌ రౌడీగా పోసాని ప్రేక్షకుల్ని నవ్విస్తారు.

చిరంజీవి 150వ చిత్రంలో ఆయన సరసన నటించిన కాజల్‌ పాత్ర నిడివి తక్కువే అయినా   పాటల్లో చిరు పక్కన చక్కగా ఒదిగిపోయింది.  తొలిపాటలో రాయ్ లక్ష్మీ అంద చందాలు చిరంజీవిని డామినేట్ చేసినా, ప్రేక్షకులు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తారు.
chiru_lawrence
మొత్తం మీద ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే  సినిమాను నడిపించడంలో దర్శకుడు సక్సెస్‌ సాధించారు.  వెండితెరపై ప్రజా సమస్యలపై చిరంజీవి లేవనెత్తిన అంశాలు ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులకు దగ్గరగా కనిపిస్తాయి. రైతు ఆత్మహత్యలు., భూసేకరణలు వంటి అంశాలపై మీడియా అనుసరిస్తోన్న వైఖరిపై విమర్శనాస్త్రాలు గట్టిగానే సంధించారు. పొలిటికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న హీరో నేపథ్యంలో సినిమాను  చూస్తే…… వెండితెర వేదికగా  రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడినట్లు  భావించవచ్చు.  చిరంజీవి ఎక్కుపెట్టిన సామాజికాంశాలు ఆయనలోని రాజకీయ నాయకుడికి కూడా పనికివచ్చేలా చిత్రం ఉంటుంది.
రేటింగ్: 4 / 5

1 Comment on ఖైదీ నంబరు 150 – రివ్యూ (4 / 5)

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1