కాకాణి డాక్యుమెంట్లపై అన్నీ శేష ప్రశ్నలే

సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ఢన్ రెడ్డి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనా? పోలీసుల విచారణలో తేలిన నిజాలు నమ్మశక్యంగా ఉన్నాయా? అసలు నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది. విచారణలో వెలుగు చూసినవి వాస్తవాలేనా? అనేక ప్రశ్నలు… ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాకాణి ఆరోపణలు….

కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య వార్ గత నెల రోజులుగా నడుస్తోంది. సోమిరెడ్డికి వెయ్యి కోట్ల విలువైన ఆస్తులు మలేషియా, సింగపూర్ లో ఉన్నాయంటూ కాకాణి తీవ్రమైన ఆరోపణలే చేశారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీనిని సోమిరెడ్డి కూడా ఖండించారు. తనకు విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా సవాల్ విసిరారు సోమిరెడ్డి. అయితే ఆ తర్వాత సీన్ మారింది. పదిరోజుల పాటు తనకు విదేశాల్లో ఆస్తులు లేవన్న సోమిరెడ్డి తర్వాత కొత్త పల్లవిని అందుకున్నారు. అవి నకిలీ డాక్యుమెంట్లని చెప్పేశారు. తర్వాత డీజీపీకి ఫిర్యాదు చేశారు.

పోలీసులు చెబుతున్నదిదీ…

పోలీసుల కథనం ప్రకారం మణిమోహన్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తుల సాయంతో సోమిరెడ్డి పేరుతో విదేశాల్లో ఆస్తులున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడట. ఇందుకు సింగపూర్, మలేషియాల్లోని హోటళ్లలో పనిచేసిన అనుభవం కలిసి వచ్చిందట. అక్కడి బ్యాంకు లావాదేవీలను, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన మణిమోహన్ సోమిరెడ్డి పేరిట ఆస్తులున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశాడట. తర్వాత సోమిరెడ్డి ప్రత్యర్థి కాకాణిని కలిసి నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చాడట. మణిమోహన్ పొలిటికల్ లీడర్ల నే ఎంచుకుంటారట. ఇది పోలీసులు చెబుతున్న కథనం

కాకాణి అంత అమాయకుడా?

అయితే ఒక ఎమ్మెల్యేని కలవాలంటే అతనికి పరిచయమైన వ్యక్తికి… నియోజకవర్గానికి… లేదా జల్లాకు చెందిన వ్యక్తి సులభంగా కలిసే వీలుంటుంది. అయితే పొరుగు జిల్లా చిత్తూరు కు చెందిన మణిమోహన్ అనే వ్యక్తి కాకాణిని సులభంగా కలిసేశాడు. తన వద్ద సోమిరెడ్డికి విదేశాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇచ్చాడు. కాని తనకు పరిచయం లేని వ్యక్తి వచ్చి పవర్ లో ఉన్న మరో ప్రత్యర్ధికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయంటే కాకాణి సులభంగా నమ్మేశాడా? కనీసం క్రాస్ చెక్ చేసుకోలేదా? తనకు ఇచ్చిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ను కూడా కాకాణి పరిశీలించలేదా? లీగల్ ఒపీనియన్ తీసుకోకుండానే మీడియా ముందుకొచ్చారా? మరి ఇవే డాక్యుమెంట్లతో కాకాణి న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించినట్లు? ఈడీకి ఎందుకు ఫిర్యాదు చేసినట్లు…? ఇవన్నీ తేలని ప్రశ్నలే. అందుకే ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చాలని సింహపురి వాసులు కోరుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1