అమరావతి తుది డిజైన్ ఖరారు….?

అమరావతి నగర నిర్మాణ డిజైన్ లు రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ బృందం అందించిన ఆకృతులపై మంత్రివర్గ సభ్యులు., ఇతర ప్రభుత్వ ముఖ్యులతో సమాలోచన చేసి తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. దీనిపై గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలోని నవ నగరాల్లో ముఖ్యమైన పాలనా నగరానికి సంబంధించి శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యస్థాన భవంతుల ఆకృతులు, అంతర్గత నిర్మాణ శైలి ఎలా వుండాలన్న అంశంపై తుది ప్రణాళికలను సిద్ధం చేసిన ఫోస్టర్ బృందంతో ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై కూలంకుశంగా చర్చించారు. వజ్రాకృతిలో శాసనసభ, బౌద్ధ స్థూపం ఆకారంలో హైకోర్టు భవంతులు ఉండాలన్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తుది ఆకృతులను రూపొందించారు. వీటిల్లో అంతర్గత నిర్మాణ శైలి బాగుందని, బాహ్య ఆకృతుల విషయంలో మిగిలిన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.  సచివాలయానికి సంబంధించి రెండు, మూడు ఆప్షన్లను ఇచ్చారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒకే ప్రాంగణంలో ఉండాలన్న ప్రతిపాదనపై అధికారుల స్థాయిలో పలువురు అభ్యంతరాలు తెలియజేయడంతో రెండు ఆప్షన్లను గమనంలోకి తీసుకున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు ఒకే భవంతిలో నాలుగైదు ఫ్లోర్లలో కార్యస్థానాలు ఉండటం వల్ల సందర్శకుల రాకతో సాధారణ పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతాయన్న అభిప్రాయంతో 300, 400 మీటర్ల దూరంలో వేర్వేరు భవంతుల్లో మంత్రులు, కార్యదర్శులకు, విభాగాధిపతులకు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావించినట్టు, దానికి అనుగుణంగా సచివాలయ, హెచ్‌వోడీ భవంతుల నిర్మాణం జరుపుతున్నట్టు కమిషనర్ తెలిపారు.

రాజీ పడేప్రసక్తి లేదు……

తరువాత ఫోస్టర్ బృందం హైకోర్టు, శాసనసభ భవంతులపై ఇచ్చిన ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి నిశితంగా ఆలకించి, నమూనా ఆకృతులను వివరంగా పరిశీలించారు. హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా ఉండాలని ఫోస్టర్ బృందానికి సూచించారు. శాసనసభ, హైకోర్టు నిర్మాణాలు ప్రపంచానికే తలమానికంగా ఉండాలనేది తాను మొదటి నుంచి చెబుతున్నానని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. హైకోర్టు భవంతి లోపల తమకు ఎటువంటి సౌకర్యాలు వుండాలో, అందులో అంతర్గత నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చునని, బాహ్య ఆకృతి మాత్రం తనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ నచ్చి మెచ్చే విధంగా ఉండాలని చెప్పారు. మరింత సమయం తీసుకునైనా హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా ఉండేలా రూపొందించి తీసుకురావాలన్నారు. ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మిస్తున్నామన్నది ఆర్కిటెక్టులు గుర్తుంచుకోవాలని చెప్పారు.

శాసనసభ భవనం ఇలా…..

శాసనసభ భవంతిపై ఫోస్టర్ బృందం సమర్పించిన ఆకృతులు, అంతర్గత నిర్మాణశైలి, ప్రణాళికలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్యస్థానాలు మంత్రులు, అధికారులు, ఉద్యోగుల రోజువారీ విధులకు వీలుగా ఉండటమే కాకుండా బాహ్యరూపం ప్రజలు ఆశ్చర్యానికి గురిచేసేలా అత్యద్భుతంగా ఉండి తీరాలన్నారు. శాసనసభ భవంతి నాలుగు అంతస్థులుగా ఉంటుంది. మొదటి అంతస్థును నాలుగు భాగాలుగా రూపొందించారు. మధ్యలో పబ్లిక్ ప్లేస్‌గా ఉంచారు. బేస్‌మెంట్ లెవల్‌లో వాహన పార్కింగ్ ఉంటుంది. మొదటి అంతస్థును మంత్రులకు, ముఖ్యమంత్రికి, సభాపతికి, పబ్లిక్, ప్రెస్ కార్యస్థానాల కోసం కేటాయించారు. నాలుగు వైపుల నుంచి ద్వారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి, సభాపతి, మంత్రులు రాకపోకలకు ప్రత్యేకమార్గం ఉంటుంది. శాసనసభ, శాసనమండలి కోసం రెండు వేర్వేరు భవంతులు ఈ సముదాయంలోనే అంతర్గతంగా ఉంటాయి. శాసనసభ భవంతి లోపలి భాగంలో 250 సీట్లతో శాసనసభ మందిరం ఉంటుంది. 231 సీట్లతో పబ్లిక్, ప్రెస్ గ్యాలరీలు ఉంటాయి. 103 సీట్లతో శాసనమండలి మందిరం ఉంటుంది. శాసనసభలో సభాపతి స్థానం వెనుక అతిపెద్ద స్క్రీన్ ఉంటుంది. అసెంబ్లీ దైనందిన వ్యవహారాలన్నీ ఈ స్క్రీన్‌పై ప్రదర్శించే ఏర్పాటు ఉంటుంది. త్రిభుజాకారంలో నిర్మించే బాల్కనీలు శాసనసభ నిర్మాణానికే అతి ముఖ్య అలంకారంగా ఉంటాయని ఫోస్టర్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. శాసనసభ కింది అంతస్థులోని మధ్య భాగం నుంచి వజ్రాకృతి మొదలవులవుతుంది. ఇది మొత్తం భవనం పై అంతస్థు వరకు ఉంటుంది. పైభాగంలో వజ్రం స్పష్టంగా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే వజ్రం కింది భాగం మొన వరకు అంతా పారదర్శకంగా స్పష్టంగా గోచరిస్తుంది. శాసనసభ, మండలి మధ్యభాగంలో సెంట్రల్ హాలుగా ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్లడానికి వజ్రాకారం చుట్టూ పైకి వెళ్లడానికి మార్గం ఉంటుంది. పైభాగంలో మ్యూజియం ఉంటుంది. ఇందులో ప్రజలందరికీ ప్రవేశం ఉంటుంది. పైకి వెళ్లే మార్గాన్ని అత్యుద్భుతంగా డిజైన్ చేశారు. భవంతి పైభాగంలో కళ్లకు కనిపించే వజ్రాకృతి చూపరులను కట్టిపడేస్తుంది. మొత్తం భవంతికే ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. పైభాగంలో డైమండ్ కట్, దానికి నాలుగు వైపులా లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వెళ్లేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఆకృతులన్నింటిపై భాగస్వాములందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1