ఇద్దరిదీ ఒకే స్కూల్… ఒకే రకం ఎత్తుగడలు

చంద్రబాబు

చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పార్టీ పాలిటిక్స్ లో ఆరితేరిన నేతలు. రాజకీయ దిట్టలు. ఏ సమయానికి ఎటువంటి ఎత్తుగడ వేయాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు వారి వ్యూహాలు పారకపోవచ్చు. కానీ నిరంతరం చర్చను రేకెత్తిస్తూంటారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపేందుకే తాము పాలిటిక్స్ లో ఉన్నామన్నంత కలరింగ్ ఇవ్వడంలో ఎవరూ ఎవరికీ తీసిపోరు. ఏ సందర్భంలో అయినా తమ పార్టీలు పరాజయం పాలైతే అది ప్రజల ఓటమిగా, ప్రజాస్వామ్య పరాజయంగా చూపిస్తారు. అదే విజయం సాధిస్తే తమ ఘనతగా క్లెయిం చేస్తుంటారు. ఇది సాధారణ రాజకీయ విన్యాసమే. కేసీఆర్ , చంద్రబాబులు ప్రత్యర్థులుగా కనిపించినా పాలిటిక్స్ నడపటంలో ఒకే పంథా, ధోరణి కనిపిస్తుంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పన్నిన వ్యూహమే తాజాగా పట్టభద్రుల స్థానంలో కేసీఆర్ అనుసరించి చూపించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్, అతని తనయుడు హరికృష్ణ లను ప్రాతిపదికగా చేసుకుంటూ గతంలో చంద్రబాబు రాజకీయ భక్త విన్యాసాన్ని ప్రదర్శించి చూపించారు. ఇప్పుడు మాజీ ప్రధాని పీవీపై అచంచల భక్తిని చాటిచెబుతూ కేసీఆర్ అదే ఎత్తుగడతో రాజకీయ రంగాన్ని రక్తి కట్టిస్తున్నారు.

వీర రాజకీయ భక్తులు…

చంద్రబాబు , కేసీఆర్ లు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో సహచరులు. నిరంతరం సామాజిక సమీకరణలు , ఓట్ల గణాంకాలపైనే కసరత్తు సాగించి నిర్ణయాలు తీసుకుంటారు చంద్రబాబు. ఆ నేపథ్యంలోనే 1999 ప్రాంతంలో వెలమ సామాజిక వర్గానికి పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన నాయకుడు కోటగిరి విద్యాధరరావుకు మంత్రి పదవి అప్పగించారు. అదే వర్గానికి చెందిన కేసీఆర్ ను పక్కన పెట్టారు. ఇరువురి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు దారితీసిన ఘట్టాల్లో ప్రధానమైదన్న సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీతో రెండు సార్లు చేతులు కలిపారు. విడిపోయారు. టీఆర్ఎస్ తోనూ కలిసి నడిచారు చంద్రబాబు. అవసరాలకు అనుగుణంగానే ఆయన నిర్ణయాలు ఉంటాయి. కేసీఆర్ కూడా అంతే. కాంగ్రెసుతో జట్టు కట్టారు. టీడీపీతో జట్టుకట్టారు. వామపక్షాలనూ చేరదీశారు. సందర్బాన్ని బట్టి ఎత్తుగడలు మార్చారు. 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్టీయార్ మనవరాలు, హరికృష్ణ కుమార్తెను కూకట్ పల్లిలో శాసనసభకు అభ్యర్థిగా చంద్రబాబు నిలబెట్టారు. ఎన్టీయార్ సెంటిమెంటును రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ పట్ల ఉండే సానుభూతిని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని ఎత్తుగడ వేశారు. తాజాగా కేసీఆర్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవిని బరిలోకి దింపుతున్నారు. ఈ రెండు ఘట్టాల మధ్య ఉండే సారూప్యత, పోలిక ఇప్పుడు రాజకీయరంగంలో చర్చకు తావిస్తోంది.

యూ టర్న్ గురువులు..

ఏ విషయంలో అయినా ‘యూ’టర్న్ తీసుకోవడంలో వీరిద్దరూ ఒకరికి ఒకరు పోటీ. రాష్ట్రం వస్తే పార్టీని కాంగ్రెసులో కలిపేస్తానని మాట చెప్పి పట్టించుకోకపోయినా, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించి విస్మరించినా అదంతా కేసీఆర్ కు చెల్లుబాటవుతుంది. అదే విధంగా కాంగ్రెసు వ్యతిరేకతే పునాదిగా పుట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెసుతో జట్టు కట్టించడం , బీజేపీ అగ్రనాయకత్వం ముందు సాగిలపడి పొత్తు కుదుర్చుకుని మళ్లీ తిరుగుబాటు జెండా ఎగరవేయడం చంద్రబాబుకే చెల్లుతుంది. తాజాగా మరోసారి జట్టు కట్టేందుకూ ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే వీరి ఎత్తుగడలు మాత్రం తెలుగు రాజకీయాలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి.

అదే రాజకీయం…

తెలుగు వారికి పీవీ నరసింహారావు, ఎన్టీరామారావు అంటే ఎనలేని ఇష్టం . ఇద్దరూ జాతీయ స్థాయి నాయకులు. తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు తొలి దశలో 1996 నుంచి 2004 వరకూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. పార్టీలోనూ, ప్రజల్లోనూ ఎన్టీయార్ పేరును కనుమరుగు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. ఎన్టీయార్ ప్రవేశపెట్టిన మద్య నిషేధం వంటి పథకాలనూ ఎత్తి వేశారు. 2004లో ఓటమి చవి చూసిన తర్వాత మళ్లీ ఎన్టీయార్ పల్లవిని ఎత్తుకున్నారు. ఎన్టీయార్ కు భారత రత్న టీడీపీ జాతీయ స్థాయి డిమాండ్లలో ఇప్పుడొక ప్రధానమైన అంశం. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్టీయార్ కు భారత రత్న ఇచ్చే ప్రతిపాదన వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడే అడ్డుకట్ట వేశారనేది రాజకీయ రంగంలోని వారు చెప్పుకునే మాట. పార్టీకి సేవలందించిన హరికృష్ణ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలనుకుంటే చంద్రబాబుకు పెద్ద కష్టం కాదు. తెలుగుదేశం నవ్యాంధ్రప్రదేశ్ లో2019 వరకూ అధికారంలో ఉంది. హరికృష్ణ కుమార్తె రాజకీయ ఆకాంక్షలకు గుర్తింపు ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యురాలిగానో చేసి ఉండేవారు. కానీ గెలుపు సాధ్యం కాని చోట పోటీకి నిలిపి సెంటిమెంటు రంగరించాలని చూశారు. ఎత్తుగడ పారలేదు. ఆ తర్వాత మళ్లీ ఆ కుటుంబాన్ని వదిలేశారు. సుహాసిని టీడీపీ పాలిటిక్స్ లో కనుమరుగై పోయారు.

అదే బాటలో కేసీఆర్…

తాజాగా పీవీ నరసింహారావును కాంగ్రెసు కు దూరం చేసి తమ పార్టీ సొత్తు చేయాలని చూస్తున్నారు కేసీఆర్. పీవీ శతజయంతిని అట్టహాసంగా నిర్వహించారు. భారతరత్న డిమాండ్ కు ఊపు తెచ్చారు. పీవీ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలనుకుంటే అన్ని రకాల అర్హతలు ఉన్న పీవీ కుమార్తె వాణి దేవికి గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చిటికెలో పని. లేదంటే పీవీ భారతరత్న డిమాండ్ ను సజీవంగా ఉంచాలంటే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆమెను రాజ్యసభకు పంపవచ్చు. కానీ బలమైన పోటీ నెలకొని ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారు. అక్కడ గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీ గా చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, బీజేపీ ఎమ్మెల్సీ రామచందరరావు బరిలో ఉన్నారు. వారిద్దరికీ పట్టభద్రుల్లో విపరీతమైన పలుకుబడి ఉంది. టీఆర్ఎస్ బలహీనంగా ఉంది. తాజా పరిణామాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధికార పార్టీ ఓటమి పాలైతే ప్రజల్లో పార్టీ పలచన అయిపోతుంది. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాల తర్వాత ప్రతి అడుగునూ ఆచితూచి వేయాల్సి వస్తోంది. ఇంత క్లిష్టమైన స్థితిలో పీవీ కుటుంబ ప్రతిష్టను పణంగా పెట్టి పోటీకి నిలపడమేమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇది పీవీపై భక్తి కాదు. ఓడిపోతే ప్రజలు పీవీ కుటుంబాన్ని ఆదరించనట్లు, ఒకవేళ నెగ్గితే టీఆర్ ఎస్ విజయం గా లెక్కిస్తారు. నిజంగా ఓటమే ఎదురైతే ఆ పరాభవ భారాన్ని తగ్గించుకునేందుకు ఈ ఎత్తుగడ వేశారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 33969 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*