బాబు రివర్స్ గేమ్

చంద్రబాబు

ప్రభుత్వ ఆధిపత్యాన్ని నిరూపించే ప్రధానయంత్రాంగం పోలీసు శాఖ. సర్కారు ప్రధాన కర్తవ్యం శాంతిభద్రతల పరిరక్షణ. ఈ రెండూ కలగలిసి ఉంటాయి. అరాచక శక్తులు, సంఘ విద్రోహులను అదుపులో ఉంచడానికే కాదు. అవసరమైనప్పుడు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలను నియంత్రించడానికి సైతం రక్షకభటులను విరివిగా వినియోగించడం ఆనవాయితీగా మారిపోయింది. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇది సర్వసాధారణ తతంగమే. అందుకే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని నిరూపించడానికి శాంతిభద్రతల సాకును బయటికి తీస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులలో రాజకీయమూ -శాంతిభద్రతలు ప్రధాన అంశంగా మారి చర్చకు దారి తీస్తున్నాయి. ఇందులో ఎవరికెంత మైలేజీ అన్న అంశాన్ని పక్కనపెడితే రాజకీయం మాత్రం తనవంతు ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షం దీనిని తనకు అనుకూలంగా మలచుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు తెరతీయాలనుకుంటోంది. ప్రభుత్వ పక్షం పాత విషయాలను తిరగదోడి లెక్క సరిచేసుకోవాలనుకుంటోంది.

టీడీపీ మైలేజీ…

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుయాయులు అత్యుత్సాహం చూపి వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం. స్వయంగా స్పీకర్ నియోజకవర్గంలోనే ఆయన కుటుంబసభ్యుల అరాచకాలపై అనేక ఆరోపణలు అప్పట్లోనే వినవచ్చాయి. తొలి సారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ధోరణికి భిన్నంగా 2014 నుంచి పరిపాలన సాగింది. చూసీ చూడనట్లు పోవడం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ వారినే సమర్థిస్తూ మాట్టాడటం వంటివి చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక ధోరణికి ఇటువంటి ఘట్టాలు కూడా కారణమనే చెప్పాలి. నిజానికి ఒక డజను నియోజకవర్గాల్లో ఇటువంటి తీవ్రస్థాయి అరాచకశక్తులు రాజ్యం చేశాయి. కానీ రాష్ట్రమ్మొత్తమ్మీద తెలుగుదేశం ప్రభుత్వంపై ఆ ప్రభావం పడింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తమ పాలనలో తమను దెబ్బతీసిన అస్త్రాన్నే బయటికి తీసింది. ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు, దాడులు చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో కొంత తీవ్రత ఉంది. దీనిని అస్త్రంగా మలచుకుంటూ దేశంలోనే తొలిసారిగా టీడీపీ రాజకీయ శరణార్థి శిబిరానికి తెరతీసింది. దీనివల్ల ఆ పార్టీకి కొంత పొలిటికల్ మైలేజీ ఉంటుంది. ఛలో ఆత్మకూరు అంటూ తలపెట్టిన యాత్ర భగ్నమయినప్పటికీ తాను అనుకున్న స్థాయిలో ప్రచారాన్ని మాత్రం టీడీపీ సాధించగలిగింది.

లెక్క సరికాదు….

గతంలో తెలుగుదేశం హయాంలో ఇబ్బందులు పడిన వైసీపీ నాయకులు లెక్క సరిచేసుకుందామంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమ ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలపై వారికి పెద్దగా అవగాహన లేదనే చెప్పుకోవాలి. శాంతిభద్రతల సమస్య సృష్టించడం ద్వారా ప్రతిపక్షంతో పోటీ పడాల్సిన అవసరం అధికారపార్టీకి ఏమాత్రం ఉండదు. పోటాపోటీ ఘర్షణల కారణంగా పోలీసు శాఖ ఇరకాటంలో పడుతుంది. ప్రభుత్వాన్నే అందరూ నిందిస్తారు. అదే ప్రతిపక్షం మాత్రమే రోడ్డెక్కితే నిర్బంధ విధానాలతో కంట్రోల్ చేయడం పోలీసులకు తెలుసు. అనువుగాని చోట అనవసరంగా వివాదాన్ని పెంచుకోకుండా సంయమనం పాటించడం పాలకపక్షానికి అవసరం. ఏ అవకాశం దొరికినా అధికారపార్టీని రచ్చకీడ్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది ప్రతిపక్షం. అధికారపార్టీకి అనేక రకాల బాధ్యతలుంటాయి. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూసుకోవడం, పరిపాలనలో అధికారయంత్రాంగం సజావుగా సేవలందించేలా శ్రద్ధ వహించడం ,అభివ్రుద్ధి ప్రణాళికల అమలు వంటి వాటిపై ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ద్రుష్టి పెట్టాలి. టీడీపీ ట్రాప్ లో పడితే అది వైసీపీ ప్రభుత్వ ఇమేజ్ కే నష్టదాయకం.

ఆలస్యంగా మేలుకొలుపు…

తెలుగుదేశం పార్టీ గుంటూరులో క్యాంప్ తెరిచి బాధితులను మీడియా ముందుకు తెచ్చి ఆందోళన మొదలు పెట్టేవరకూ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన తర్వాతనే కదలిక వచ్చింది. ముందుగానే శిబిరం వద్దకు పోలీసు, రెవిన్యూ అధికారులు వెళ్లి సొంత గ్రామాలకు వారిని పంపించే ఏర్పాట్లు చేసి ఉంటే సమస్య ముదురుపాకాన పడి ఉండేది కాదు. కానీ ప్రభుత్వ పెద్దలు ఏమనుకుంటారోననే సందేహంతో అధికారులు సంశయించారు. కానీ చివరికి వారికి తప్పలేదు. శాంతిభద్రతలు పరిపాలనకు గీటురాయి. అటువంటి విషయంలో్ ప్రభుత్వ అలసత్వం దొరికితే ప్రతిపక్షం ఊరుకోదు. ఇటు ప్రతిపక్ష నేత నుంచి అటు హోం మంత్రి వరకూ అందరూ స్పందించి విషయాన్ని రచ్చ కీడ్చినప్పటికీ ముఖ్యమంత్రి స్పందించకపోవడం గమనార్హమనే చెప్పాలి. ఈవివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యూహాత్మకంగానే సీఎం మౌనం వహించారనుకోవాలి.

చంద్రబాబు స్పీడు పెంచారు…

రాజకీయ చాణుక్యుడుగా చంద్రబాబు అనుభవం ప్రతిపక్షంలో బాగానే పనికొస్తోంది. దిమ్మతిరిగే స్థాయిలో పరాజయం పాలైన తర్వాత దాదాపు టీడీపీ రాజ్యసభపక్షం మొత్తం బీజేపీలో చేరిపోయింది. ఇందుకుగాను చంద్రబాబు నాయుడే వేగంగా పావులు కదిపారేమోనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తుంటారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశానికి, బీజేపీకి మధ్య ఉన్న వైరాలు సమసిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ మీద పోరాటంలో రెండింటి వైఖరి దాదాపు ఒకే విధంగా ఉంది. రివర్స్ ఎన్నికలను ప్రజలు కోరుకుంటున్నారంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన తరుణం ఏర్పడింది. వైసీపీ అధినేతపై ఆపార్టీలో అందరికీ భయభక్తులున్నాయి. కానీ సమన్వయం చేసే యంత్రాంగమే సక్రమంగా పనిచేయడం లేదనిపిస్తోంది. దీనిని వెంటనే దిద్దుబాటు చేసుకోకపోతే తెలుగుదేశానికి రాజకీయాస్త్రాలను అయాచితంగా అందచేసినట్లవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 29064 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*