నా లేఖ… నా లెక్క.. నా ఇష్టం

మమతా బెనర్జీ

‘‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు ఉండరీ నాటకంలో ’’ అంటూ ఒక సినిమాలో పవర్ పుల్ డైలాగ్ ఉంటుంది. రాజకీయాలకు అతికినట్లు సరిపోతుంది. తాజాగా మమతా బెనర్జీ దేశంలోని పదిమంది ప్రముఖ నాయకులకు లేఖలు రాశారు. మనమంతా మోడీపై పోరాడాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ శక్తినంతా కూడదీసుకుని సాగిస్తున్న పోరాటం అందరికీ తెలిసిందే. పశ్చిమబంగలో ఎన్నికల సమరం పతాకస్థాయిలో ఉన్న సమయంలో లేఖ రాయడమే చర్చనీయమవుతోంది. మోడీకి వ్యతిరేకంగా కట్టే ఫ్రంటుకు తాను నాయకత్వం వహిస్తాననని పరోక్షంగా సంకేతాలివ్వడం ఆమె ఉద్దేశం. ఇతర పార్టీలు కలిసి వస్తాయా? లేదా? జాతీయ రాజకీయాల్లో లేఖ ఎంతటి ప్రభావం చూపుతుందన్నది అప్రస్తుతం. తనను తాను జాతీయ నాయకురాలిగా ప్రొజెక్టు చేసుకుంటూ రాష్ట్రంలోని ఓటర్ల మన్నన, మద్దతు పొందడమే ఆమె తక్షణ లక్ష్యం. అందుకే ఈ టైమింగ్ ను ఎంచుకున్నారు. మోడీకి తానే దీటైన నాయకురాలినని పశ్చిమబంగ ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం మమతా బెనర్జీకి ఏర్పడింది. ఎన్నికల రణ క్షేత్రం మమత వర్సస్ మోడీ అన్నట్లుగా మారిపోయింది. బెంగాల్ పౌరుషాన్ని వెలికితీస్తూ తనను గెలిపిస్తే దేశ రాజకీయాలను శాసిస్తానని ఆమె చెప్పదలచుకున్నారు. అయితే ఈ అవసరార్థ రాజకీయంలోనూ తన స్వార్థ పూరిత ఆలోచనలకు పెద్ద పీట వేయడమే విచిత్రం.

సొంత రాష్ట్రంలో స్వార్థం…

మమతా బెనర్జీ లేఖలోని ఔచిత్యం, సంకుచితత్వం ప్రశ్నార్థకమవుతున్నాయి. లేఖలు రాసేందుకు ఆమె ఎంచుకున్న నేతలు, పార్టీలే ఇందుకు కారణం. తనకు నష్టం జరగకుండానే రాజకీయం చేయాలనుకుంటున్నారు ఆమె. అందుకే సొంత రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను పక్కనపెట్టేశారు. సైద్ధాంతికంగా బీజేపీతో, మోడీతో నిరంతరం పోరాటం సాగించే నిబద్ధత కమ్యూనిస్టులకు ఉంది. ఓట్లు వచ్చినా, రాకపోయినా, సీట్లు వచ్చినా, రాకపోయినా రాజీ లేని తత్వంతో వామపక్షాలు ముందుకు కదులుతున్నాయి. మమతా బెనర్జీకి అటువంటి సిద్దాంతరాద్దాంతాలు లేవు. గతంలో బీజేపీతోనూ కలిసి పనిచేశారు. మంత్రి అయ్యారు. కాంగ్రెసులోనూ ఉన్నారు. సొంత రాష్ట్రంలో బీజేపీ విసురుతున్న సవాల్ ను తట్టుకోలేకపోతున్నారు. అందుకు ప్రదాన కారణం మోడీ, షా ద్వయమే. అందుకే వారికి జాతీయ స్థాయిలో చెక్ పెట్టాలనుకుంటున్నారు. అదే సమయంలో తన రాష్ట్రంలో మళ్లీ వామపక్షాలకు అవకాశం ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. జాతీయంగా సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు కలిసి రావాల్సిందిగా సీపీఐ, సీపీఎం వంటి పెద్ద పార్టీలకు లేఖలు రాయలేదు. అసోంకి చెందిన సీపీఐ ఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యను మాత్రం కలుపుకోవాలనుకున్నారు. విశాల ప్రయోజనమే మమతా బెనర్జీ లక్ష్యమైతే సొంత అధికారాన్ని, రాజకీయ స్వార్థాన్ని పక్కనపెట్టి పోటీదారులను కూడా కలుపుకుపోవాలి. అందుకు వామపక్షాలకు మించిన అర్హత ఎవరికీ ఉండదు. మమత లేఖలో నిజమైన నిబద్దత, చిత్తశుద్ధి లోపించింది. అందుకే లేఖ లోని అంశం వాస్తవమే అయినప్పటికీ ఎన్నికల గండం లో ఆవేదన నుంచి బయటపడేందుకు రాసినట్లుగానే చూడాలి.

అరణ్య రోదన…

ఇంతకీ మమతా బెనర్జీ లేఖ ఎటువంటి స్పందన తెస్తుందనేది ముఖ్యం. ఆమె లేఖతోనే రాజకీయ పార్టీలు ఒక్కటిగా మారవు. ఆయా పార్టీల, నాయకుల అవసరాలకు అనుగుణంగానే స్పందిస్తుంటాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు, సైద్దాంతిక విరోధి అయిన కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే మోడీకి వ్యతిరేకంగా ఏ అవకాశం దొరికినా జట్టు కట్టేందుకు సై అంటుంటాయి. కమ్యూనిస్టులను ఉద్దేశపూర్వకంగా మమత దూరం పెట్టారు. ఇక మిగిలిన పార్టీలు పచ్చి అవకాశ వాద రాజకీయాలే నడుపుతున్నాయి. చాలాకాలంగా మోడీ బలాన్ని చూసి గప్ చుప్ అయిపోయాయి. తన రాష్ట్రంలో ఎన్నికల ముందు హడావిడి చేసిన కేసీఆర్ తర్వాత చాప చుట్టేశారు. సొంత ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. పైపెచ్చు కేసీఆర్ కలకత్తా వెళ్లి మరీ మమతా బెనర్జీని కలిసినప్పుడు ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు ఆమె స్నేహహస్తాన్ని కేసీఆర్ అందిపుచ్చుకుంటారనుకోవడం అమాయకత్వమే. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు, న్యాయవ్యాజ్యాలతో అభద్రతలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి వ్యతిరేకంగా ఎప్పుడూ స్పందించలేదు. భవిష్యత్తులోనూ స్పందించరు. స్టాలిన్ కేంద్రంతో తెర వెనక సయోధ్యతోనే డీఎంకే నేతలపై కేసులు లేకుండా చేసుకోగలిగారనేది రాజకీయ రహస్యం. ప్రతిపక్ష కూటమికి అధికారం దక్కకపోతే ఎప్పుడో ఒకప్పుడు బీజేపీతో దోస్తీ చేసేందుకు పావులు కదుపుతున్నారు పవార్. డిల్లీలో తన పాత్రను కాపాడుకోవడానికే శతవిధాలా ప్రయత్నిస్తారు అరవింద్ కేజ్రీవాల్. మమతా బెనర్జీతో అంత తొందరగా జట్టుకట్టడం సాధ్యం కాదు. అఖిలేష్ యాదవ్ సైతం తన అవసరాన్ని బట్టి పోయేవాడే తప్ప దేశమంతా పూచుకుని తిరిగే రకం కాదు. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీఇచ్చిన ఎమోషనల్ అప్పీల్ ను వినీ విననట్లు నటించేవారే ఎక్కువ.

వారు పనికి రారా…?

మమత బెనర్జీ పవర్ లో ఉన్నవాళ్లను, పవర్ లోకి వచ్చేవాళ్లను ఎక్కువగా దృష్టిలో పెట్టుకున్నారు. పైపెచ్చు తనకు గిట్టనివారిని దూరంగా ఉంచేశారు. దేశవ్యాప్తంగా ఉనికి ఉన్నపార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఏదో ఒకనాడు ప్రధాని కావాలనేది బహుజన సమాజ్ మాయావతి ఆకాంక్ష. దేశంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలు తమది అని గర్వంగా క్లెయిం చేసుకునే పార్టీ. అన్నిచోట్లా ఓట్లు పడతాయా? లేదా? అన్నది పక్కనపెడితే జాతీయ ప్రతిపక్ష కూటమిలోకి మాయావతిని మాటమాత్రంగా కూడా ఆహ్వానించకపోవడం విచిత్రమే. అదే విధంగా అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నూ మమతా బెనర్జీ గుర్తించలేదు. ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు. కానీ జాతీయంగా గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇకపై పవర్ లోకి వచ్చే చాన్సులు తక్కువనే అనుమానంతో చంద్రబాబు నూ దూరంగా పెట్టేశారు. ఒకానొక సమయంలో ప్రధానిగా పనిచేసిన దేవెగౌడ పార్టీ జనతాదళ్ల సెక్యులర్ జోలికి కూడా పోలేదు. అంటే మమతా బెనర్జీ తన లెక్కల ప్రకారం మాత్రమే ప్రతిపక్షాలు కూటమి కట్టాలని ఆశిస్తున్నారు. ఇది సంకుచిత ధోరణి. కాంగ్రెసు పార్టీ వామపక్షాల భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. అలాగే జనతాదళ్ సెక్యులర్, టీడీపీ, బహుజన సమాజ్ లనూ కలుపుకుని పోవాలనుకుంటోంది. మొత్తమ్మీద ఈ సమయంలో లేఖ రాయడం పక్కా రాజకీయ ఎత్తుగడ అని చెప్పకతప్పదు. ఎన్నికల తర్వాత ఈ ప్రయత్నం చేసి ఉంటే మమతా బెనర్జీ కమిట్ మెంట్ వెల్లడయ్యేది. గెలిస్తే ఆమె చుక్కానిగా ఉంటూ జాతీయ ప్రతిపక్షాలను కూడగట్టి ఫ్రంట్ ఏర్పాటుకు దోహదమయ్యేది. తన అగ్రస్థానం కాపాడుకోవచ్చు. ఒకవేళ ఓడిపోయినా అంతా కలిస్తే తప్ప జాతీయంగా బీజేపీకి పోటీ ఇవ్వలేమనే సంకేతంతో అయినా కూటమి కట్టవచ్చు. అప్పుడు కూడా మమతా బెనర్జీ భావోద్వేగానికి అర్థం ఉంటుంది. ఎటూ కాని సమయంలో ఎన్నికల మధ్యలో ఈ అప్పీల్ మాత్రం దీదీ బలహీనతనే చాటి చెబుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 35931 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*