నిమ్మగడ్డ పెద్ద సెగ్గడ్డగా మారారే?

నిమ్మగడ్డ రమేష్ కుమార్

సాదారణ ప్రజల వాడుక భాషలో పంచాయతీ అంటే ఏదో వివాదం, గొడవ. దానిని పెద్దలు అంతా కలిసి కూర్చుని తీర్పు చెప్పాలన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్దలే పంచాయతీకి దిగారు. తాడో పేడో తేల్చుకుందా మనుకుంటున్నారు. రాజ్యాంగం సాక్షిగా నువ్వా? నేనా ? అని పరోక్ష సవాళ్లు విసురుకుంటున్నారు. ఇది తెగని పంచాయతీ. బారత ప్రజాస్వామ్యంలో ఇంకా పరిపక్వత రాలేదనేందుకు నిలువెత్తు ఉదాహరణ. అటు రాష్ట్రప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం జుట్టు పట్టుకుంటున్నాయి. పంతాలు, పట్టింపులకు పోతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసభాజనం చేస్తున్నాయి. పవర్ ఎవరిదనే సంగతి పక్కనపెడితే రాష్ట్రం పరువు బజారున పడుతోంది. రాజకీయ పార్టీలు ఎంత రచ్చసాగితే అంత మంచిదని ఎదురుచూస్తుంటాయి. అందులో తమకేమైనా ప్రయోజనాలున్నాయా? అనే కోణంలో ఎదురుచూస్తుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న తంతు అదే. ఇల్లు తగలబడుతుంటే చలికాచుకునే రాజకీయం ఇక్కడ రాజ్యం చేస్తోంది.

కుడి ఎడమైంది…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మద్య పూడ్చలేని అగాధం ఏర్పడిన సంగతి తెలిసిందే. గడచిన మార్చి నెలలో ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది మొదలు రెండు వ్యవస్థల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల కమిషనర్ నే మార్చాలనుకున్న ప్రభుత్వ దురుద్దేశం రాజ్యాంగ రక్షణల కారణంగా నెరవేరలేదు. అదే సమయంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నిహితంగా మెలగుతున్నారనేందుకు తగిన ఆధారాలను వైసీపీ సేకరించింది. మీడియా ద్వారా కమిషనర్ పరువును తీసింది. ఈ తతంగం అగ్గికి ఆజ్యం పోసినట్లే అయింది. పంచాయతీ ఎన్నికలు జరిపి తీరతానంటున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన పదవిలో ఉండగా , ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు వెళ్లకూడదనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో కరోనా సమయంలోనూ ఎన్నికలకు ఆటంకం లేదు. ముందుకు వెళ్లవచ్చన్న ప్రభుత్వం ఇప్పుడు కరోనానే వాయిదా కోరేందుకు సాకుగా చూపుతోంది. కరోనా విజృంభణనే నెపంగా చూపి గతంలో వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ అబ్బే ఫర్వాలేదు. ప్రస్తుతం తగ్గిపోయిందంటున్నారు. తమ వైఖరులు, ధోరణులు మార్చుకుని మరీ పోరాటానికి సిద్ధమయ్యాయి రెండు వ్యవస్థలు.

టీడీపీకి సంబురం…

ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా లాభపడుదామని ఆశగా ఎదురుచూస్తోంది తెలుగుదేశం. 2020 మార్చి లోనే ఎన్నికలు ముగిసి ఉంటే గరిష్ఠంగా వైసీపీ లాభపడి ఉండేది. అప్పటికి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటై ఉండటానికి తోడు సంక్షేమ పథకాలన్నీ వరసగా మొదలయ్యాయి. అందుకే వైసీపీ ఆ తంతును ముగించేయాలనుకుంది. కానీ కుదరలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో అనవసరమైన పేచీలకు సైతం దిగింది. అదిప్పుడు రాజకీయ ప్రతిష్ఠగా మారింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల వెల్లువ కొనసాగుతున్నప్పటికీ అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వంపై పెద్దగా ఆదారపడని మధ్యతరగతి, విద్యా వర్గాల్లో ఇది అసంతృప్తికి దారి తీస్తోంది. అందులోనూ గ్రామస్థాయిలో తెలుగుదేశం పటిష్టంగానే ఉంది. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటూ అప్పట్లో ప్రజలిచ్చిన భారీ మ్యాండేట్ పునరావృతం అయ్యే అవకాశాలు అంతంతమాత్రమే. మొత్తమ్మీద అధిక సీట్లను అధికారపక్షమే గెలుచుకుంటుందనడంలో ఎటువంటి సందేహంలేదు. కానీ వైసీపీ ఆశించినట్లు ఎనభై శాతం స్థానాలు రావడం దింపుడు కళ్లెం ఆశే. ఇప్పటికే ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే తమ రొట్టె విరిగి నేతిలో పడుతుందని టీడీపీ ఆశిస్తోంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం మార్చితో పూర్తవుతోంది. ఆ తర్వాత ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ నియమించే కొత్త కమిషనర్ నేతృత్వంలో ఎన్నికలు జరిగితే తమకు పెద్దగా లాభించదనే అంచనా లో ఉంది టీడీపీ.

న్యాయపరీక్ష…

మొత్తమ్మీద అటు వైసీపీ, ఇటు టీడీపీ రాజకీయాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పావు గా మారింది. న్యాయవ్యవస్థకు సైతం సవాల్ ఎదురవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. తనకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను వినియోగించుకోవడం మొదలు పెట్టేశారు. నూతనంగా అభివృద్ధి, సంక్షేమపథకాల లబ్ధిని నిలిపివేశారు. అసలు ఎన్నికల ప్రక్రియనే నిలిపివేయమని రాష్ట్రప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరుతోంది. గతంలో ఎప్పుడూ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాక న్యాయస్థానాలు నిలిపివేసిన ఉదంతాలు తక్కువ. అవసరమైతే కొన్ని జాగ్రత్తలు మాత్రం న్యాయస్థానాలు సూచించేవి. ఇప్పుడు రాష్ట్ర్ర ప్రభుత్వ అభ్యర్థనను మన్నిస్తే చెడు ఉదాహరణకు తావిచ్చినట్లవుతుంది. భవిష్యత్తులో పార్టీలు, ప్రభుత్వాలు ఈ ఉదాహరణను చూపుతూ స్థానిక ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అసలే స్థానిక ఎన్నికలను రాష్ట్రాలు సకాలంలో జరపడం లేదు. అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలమైన సమయంలో కానిచ్చేస్తున్నాయి. నిజానికి చంద్రబాబు నాయుడి హయాంలోనే ఎన్నికలు జరపాల్సి ఉంది. కానీ శాసనసభ ఎన్నికలపై ప్రభావం ఉంటుందనే దురాలోచనతో బాబు ఎన్నికలకు గండి కొట్టారు. ఇప్పటికైనా ఎన్నికలు జరుగుతాయనుకుంటే ప్రభుత్వ వైముఖ్యంతో అదీ అనుమానాస్పదంగానే మారుతోంది.

కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వస్తే …

ఎన్నికల నిర్వహణను నిర్దిష్ట గడువులో కేంద్ర ఎన్నికల సంఘం సక్రమంగా నిర్వహిస్తోంది. రాష్ట్రప్రభుత్వాల యంత్రాంగాల ద్వారానే ఆ పనిని సమర్థంగా చేస్తోంది. అదే స్థానిక ఎన్నికల విషయానికొచ్చేటప్పటికి రాష్ట్రప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేయాల్సి వస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇది స్థానిక సంస్థల స్వతంత్రప్రతిపత్తికే భంగకరం. రాష్ట్రాల ఎన్నికల సంఘాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోకి తీసుకుని రావాలి. నిర్దిష్ట కాలవ్యవధిలో తప్పని సరి ఎన్నికలు పెట్టేలా చట్టాలను సవరించాలి. అప్పుడే తమ ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించే పరిస్థితి ఉత్పన్నం కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి ఉదంతాలు పునరావృతం కావు. స్థానిక సంస్థల ప్రయోజనాలకు ఇదే సరైన మార్గం. కేంద్రం , పార్లమెంటు ఈదిశలో ఆలోచన చేయాల్సిన అవసరాన్ని తాజాగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు కల్పిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 37876 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on నిమ్మగడ్డ పెద్ద సెగ్గడ్డగా మారారే?

Leave a Reply

Your email address will not be published.


*