చేతికి ..నోటికి మధ్యలో… ఇరవై లక్షల కోట్లు?

నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ‘ఆత్మనిర్భర భారత అభియాన్’ అడుగులు ఎలా ఉండబోతున్నదీ స్పష్టమవుతూ వస్తోంది. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో మొదటి రెండు అంకాలు పూర్తయ్యాయి. సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపశమనం కలిగించే ఆర్థిక ఉద్దీపనతోనే ఫైనాన్స్ మినిస్టర్ ప్యాకేజీకి శ్రీకారం చుట్టారు. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యమే అందుకు కారణం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 28శాతం ఈ రంగాల నుంచే వస్తోంది. దేశంలో 30 శాతం మందికి ఉపాధి సైతం ఈ పరిశ్రమల నుంచే లభిస్తోంది. విదేశీ ఎగుమతుల్లో 45 శాతం వీటి వాటానే. వ్యవసాయం తర్వాత మనదేశం మనుగడకు ఈ రంగమే ఊతమిస్తోంది. అయినప్పటికీ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కరోనా కాలంలో ఎక్కువగా దెబ్బతిన్నది ఈ రంగమే. 12 కోట్ల మంది ఆధారపడిన ఈ పరిశ్రమలు గందరగోళంలో పడ్డాయి. పాత బకాయిలు, బ్యాంకు రుణాలు పక్కనపెట్టినా అసలు నిర్వహణ వ్యయం సైతం వాటి వద్ద లేదు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. అందువల్ల తక్షణం ఆదుకోవాల్సిన రంగంగా కేంద్రం గుర్తించింది.

మన బ్యాంకింగ్…

పైకి చూస్తే సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రకటించిన ప్యాకేజీ చాలా భారీగా కనిపిస్తుంది. కానీ బ్యాంకింగ్ రంగం వీటిపై చాలాకాలంగా శీతకన్ను వేస్తూ వస్తోంది. ఈ రంగానికి బ్యాంకులు ఇచ్చే రుణమొత్తం ఆరున్నరశాతం మాత్రమే. రకరకాల సెక్యూరిటీలు, పూచీకత్తుల పేరిట చిన్న పరిశ్రమలకు బ్యాంకులు చుక్కలు చూపిస్తుంటాయి. ప్రాజెక్టు రిపోర్టులు పట్టుకుని పెట్టుబడి వ్యయాన్ని తమంతటతాము సమకూర్చుకుని, నిర్వహణ వ్యయం కోసం బ్యాంకులను ఆశ్రయించినా చాలామటుకు నిరాశే మిగులుతోందనేది వాస్తవం. తాజాగా తొలి విడత ప్రకటించిన ప్యాకేజీలో ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు నగదు లభ్యత ఉండేలా జాగ్రత్త వహించారు. ఇందులో డిస్కంలు, నాన్ బ్యాంకింగ్, మైక్రో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా అందించే నగదు, ఉద్యోగవర్గాల రాయితీల వంటివి పక్కనపెడితే మూడులక్షల 70వేల కోట్ల రూపాయలు నేరుగా పరిశ్రమలకు అందించే వెసులుబాటు కల్పించినట్లు కేంద్రం చెబుతోంది. ప్రభుత్వంతో నేరుగా సంబంధాలు నెరిపే పారిశ్రామిక సమాఖ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కానీ విడిగా పరిశ్రమల యజమానులతో మాట్టాడితే పెదవి విరుస్తున్నారు. కేంద్రం ఎంతగా గ్యారంటీ ఇచ్చినా బ్యాంకులు కదలవనేది వారి ఆరోపణ. వివిధ పథకాల కింద ఇప్పటికే అనేక రకాల రుణసదుపాయాలున్నప్పటికీ బ్యాంకులు అనేక రకాల కొర్రీలు వేస్తుంటాయి. అసాధారణ పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ప్రత్యేక సింగిల్ విండో ఏర్పాటు చేసి రుణసదుపాయం పరిశ్రమలకు నేరుగా చేరేలా చూడాలనేది వారి డిమాండ్.

లోను..గ్రాంటు…

కేంద్రం బ్యాంకుల వద్ద నిధుల లభ్యత పెంచుతున్న మాట వాస్తవం. అయితే 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భారీగా ఆర్థిక సాయం ఉంటుందని వివిధ వర్గాల ప్రజలు భావించారు. ప్యాకేజీ అంటే రుణం ఇవ్వడమే అన్నట్లుగా రూపకల్పన చేశారు. పరిశ్రమలు కోలుకోవడానికి కొంత గ్రాంటును రాయితీ రూపంలో , వడ్డీ తగ్గింపు రూపంలో ఇచ్చి ఉంటే బాగుండేదని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 45 లక్షల యూనిట్లకు 3 లక్షల కోట్ల రూపాయల మేరకు రుణాలు, మరో 2 లక్షల సంక్షుభిత పరిశ్రమలకు 20 వేల కోట్లు, విస్తరణకు అవకాశం ఉన్న కంపెనీలకు 50 వేల కోట్లు ఇవ్వాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. అంతా రుణమే. అందులోనూ వడ్డీతో కూడిన రుణం. ఇప్పటికే రెండు నెలలుగా కంపెనీలు పనిచేయడం లేదు. ప్రజల్లోనూ కొనుగోలు శక్తి పడిపోయింది. మళ్లీ ఉత్పత్తులు పట్టాలకు ఎక్కి , ప్రజలకు చేరి వారు కొంటేనే పరిశ్రమలు కోలుకుంటాయి. అందువల్ల రానున్న అయిదారునెలలు సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు తీవ్రమైన సంక్షోభాన్నే ఎదుర్కొంటాయంటున్నారు. ఇవి నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వ కొనుగోళ్లకు ఈ పరిశ్రమలను అనుసంధానం చేయాలనే డిమాండ్ వస్తోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వివిధ రకాల వస్తువులు, సామగ్రి కొంటుంటాయి. కానీ అవి రకరకాల ఏజన్సీల ద్వారా కొనుగోళ్లు జరపడంతో దళారీలు బాగు పడటమే ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిని మార్చి కొంతమేరకు ఊతమిస్తే ప్రయోజనదాయకమనే భావన వ్యక్తమవుతోంది.

అంకెల గారడీనా..?

నిజానికి కేంద్ర్రప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రకటిస్తున్న అనేక పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయనే వాదన ఉంది. కొన్నిటిలో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా కొత్త రుణవితరణగా చేస్తున్నారనే విమర్శలూ వినవస్తున్నాయి. కేంద్రం నుంచి ఆర్థిక సాయం లేకుండా వివిధ రకాల సర్దుబాట్ల ద్వారానే ఆర్థిక వ్యవస్థను కుదుటపరచాలనే ప్రయత్నం సాగుతోంది. అందుకే బడ్జెట్ లోనూ, సాధారణ బ్యాంకింగ్ రుణాలకు సంబంధించిన అంశాలు కూడా ప్యాకేజీలో పెద్దగా కనిపిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రకటించిన పథకాలు కొత్త, పాత అన్న విషయాలు పక్కనపెట్టినా పరిమాణం మాత్రం భారీగానే ఉంది. మొత్తం వ్యవస్థ స్తంభించిపోయిన పరిస్థితులు. అనుకున్న పథకాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వాలంటే ఆచరణకు నోచుకోవాలి. ఆ దిశలో ప్రభుత్వం పక్కా మార్గదర్శకాలతో వ్యవస్థలపై కొరడా ఝళిపించకపోతే లక్షిత వర్గాలకు ప్రయోజనం సమకూరదు. లక్ష్యానికి, ప్రణాళికకు మధ్య లంగరు అందదు. అప్పుడు గాలి మేడగానే మిగిలిపోతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 30894 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*