ఏబీని ఊరికే చేయలేదట

పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతీకారధోరణులు కొత్తేం కాదు. వైసీపీ, టీడీపీ అధినేతల వైరాలు వీటిని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా బలయ్యేది పోలీసు శాఖే. నిజాయతీగా ఉంటూ నిబంధనలు పాటిస్తూ నాయకులకు తైనాతీలుగా మారకుండా ఉన్నవారికి ఫర్వాలేదు. ప్రభుత్వం నుంచి అనుచితమైన లబ్ది అవసరం లేదు. కీలకమైనస్థానాల్లో పోస్టింగులు కూడా అవసరం లేదు. మనకు అప్పగించిన పని చేస్తే సరిపోతుందని సరిపెట్టుకున్న అధికారుల జోలికి ఎవరూ వెళ్లరు. అధికారంలోని అగ్రనేతలకు చేరువై అయాచిత ప్రయోజనం పొందాలనుకున్నవారికే కష్టాలొచ్చి పడతాయి. ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని టార్గెట్ చేస్తుంటారు. ఇది ఒక రకంగా స్వయం కృతమే. రాష్ట్రంలో 170 మంది వరకూ పోలీసు అధికారులు పోస్టింగుల కోసం నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు. వారిని ప్రభుత్వం నిరీక్షణలో పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో వారి పనితీరు , ప్రవర్తనపై ఆరా మొదలు పెట్టింది. సాంకేతికంగా తప్పిదాలు దొరికితే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తాజాగా రాష్ట్రంలో ఇదే విషయమై పెద్ద దుమారం చెలరేగుతోంది.

రాజును మించి…

ఇంటిలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం వైసీపీ, టీడీపీ సర్కారుల రాజకీయ ధోరణులకు పరాకాష్టగా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా మెలగిన వెంకటేశ్వరరావు తన అధికార పరిధిని మించి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనేది ఎప్పట్నుంచో ఉన్న అభియోగం. అడిషనల్ డీజీపీ స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి సర్వీసు రూల్స్, కోడ్ ఆప్ కాండక్టును ఉల్లంఘించి రాజకీయనేతలకు సహకరించడం కచ్చితంగా వ్యవస్థ ప్రయోజనాలకు విరుద్ధమే. అందులోనూ ఇండియన్ పోలీసు సర్వీసులో ఉన్న ఉన్నతాధికారులు డిపార్టుమెంటుకే మార్గదర్శకంగా ఉండాలి. నిజాయతీగా, రుజువర్తనతో ఉంటే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు. అటువంటి వారిని లొంగదీసుకుని తాము చెప్పినట్లు చేయించుకోవాలని ప్రయత్నించవు. ‘అధికార పార్టీ ప్రాపకం కావాలి. డిపార్టుమెంటులో చక్రం తిప్పాలి. అందలమెక్కాలి.’ అన్న భావనలు అధికారుల్లో నెలకొన్నప్పుడే దారి తప్పుతారు. తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. కానీ ప్రత్యర్థి పార్టీ పవర్ లోకి రాగానే పాపం సూప్ లో చిక్కుకుంటారు. అందుకే ఇది స్వయం కృతాపరాధంగానే చెప్పాలి. రాజును మించి భక్తి ప్రదర్శించి అధికారపార్టీకి మేలు చేయబోయి ఇబ్బందుల్లో పడుతుంటారు. తాజా సర్కారులో పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నవారిలో అత్యధికంగా పోలీసులే ఉండటం శాఖాపరమైన ప్రక్షాళన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

నిబంధనలకు నీళ్లు…

పోలీసు శాఖలో కొంత అత్యుత్సాహం ఉంటుంది. నాయకుల మన్ననలు పొందాలనే ఉద్దేశంతో నిబంధనలు పక్కనపెట్టి చొరవ కనబరుస్తుంటారు. చాలా సందర్భాల్లో న్యాయస్థానం చేత మొట్టికాయలు తింటుంటారు. అయినప్పటికీ పవర్ లో ఉన్నవారికి చేరువైతే చాలనే భావిస్తారు. ఫలితంగా నిబంధనలకు విరుద్దంగా పనిచేసేందుకు వెనకాడరు. బెదిరింపులు, సెటిల్ మెంట్లు, రాజకీయ బేరసారాల్లోనూ నేతల తరఫున పోలీసులు పైరవీలు చేయడం చాలా కేసుల్లో చూస్తుంటాం. అటువంటి అధికారులే పాలకపార్టీ అధికారం మారినప్పుడు మొదటి నిందితులుగా నిలుస్తారు. తాజాగా సస్పెన్షన్ కు గురైన ఏబీ వెంకటేశ్వరావు ఎదుర్కొంటున్న ఆరోపణలు తీవ్రమైనవిగానే చూడాలి. పోలీసు శాఖకు నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనేది వాస్తవికంగా సస్పెన్షన్ కు దారి తీసిన అంశం. అది సాంకేతికంగా తేలాల్సి ఉంటుంది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా మారేందుకు దళారి పాత్ర పోషించారంటూ ప్రభుత్వ సలహాదారు చేసిన ఆరోపణ తీవ్రాతితీవ్రమైనది. పరిపాలనకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు సమర్పించడం, కొందరు అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం కొంతమేరకు తప్పు పట్టాల్సిన పనిలేదు. ఏదో అనుచిత ప్రయోజనం ఆశిస్తున్నారనుకోవచ్చు. కానీ అధికార పార్టీ తరఫున బేరసారాలకు దిగి రాజకీయాలు నడపడం కచ్చితంగా వ్యవస్థకు చేటు చేసే పరిణామం.

పోలీసులే ఫస్ట్…

ప్రభుత్వమంటే ప్రజలకు ముందుగా కనిపించేది పోలీసు శాఖే. ప్రభుత్వం పట్ల భయభక్తులకు కారణం కూడా పోలీసు శాఖే. అందుకే ఆ డిపార్టు మెంటు పట్ల ప్రజల్లో ప్రేమ కంటే ద్వేషం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఆదేశిస్తే చాలు, శాంతి భద్రతల పేరిట ప్రజాందోళనలు, నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తుంటారు. చట్టపరమైన నిబంధనలు, ప్రజలకుండే హక్కుల గురించి పట్టించుకోరు. ఇంత చేసినా పోలీసులు తీవ్రమైన రాజకీయ అణచివేతకు గురవుతుంటారు. ఒత్తిడులను , బెదిరింపులను ఎదుర్కొంటూ ఉంటారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల నుంచి తీవ్రమైన హెచ్చరికలను పోలీసు శాఖ చవి చూసింది. ప్రస్తుతం టీడీపీ నాయకులు పోలీసులను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బలి పశువులుగా పోలీసులే మిగిలిపోతున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన విద్వేష భావాలు నెలకొని ఉండటంతో కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిపోయింది ధోరణి. పోలీసు అధికారుల సంఘాలు, ఉన్నతాధికారులు తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే డిపార్టు మెంటు నైతిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంది. నిజాయితీగా నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులకు అందలం దక్కకపోవచ్చు. కానీ అన్యాయం మాత్రం జరగదు. అదే అనుచితమైన ప్రయోజనం కోరుకుంటే తర్వాత కాలంలో కష్టాలు తప్పవు. తాజాగా ప్రక్షాళన పేరిట సాగుతున్న ప్రతీకార చర్యలు ఇదే గుణపాఠాన్ని నేర్పుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 34041 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*