ప్రజాపథం.. మనోగతం.. విజయరథం..

ys jagan telugu post telugu news

నాయకుడు ప్రజలమనిషిగా మారాలంటే వారితో కలిసిపోవాలి. సమస్యలు ఆలకించాలి. కష్టసుఖాలు తెలుసుకోవాలి. ప్రజలపై సానుభూతి కాకుండా సహానుభూతి పొందాలి. పైపై కబుర్లు, ప్రకటనలు, చందమామ హామీలు గుప్పిస్తేనే సరిపోదు. సామాన్యుల్లో ఒకరిగా ఒదిగినప్పుడే నాయకుడు ఎదుగుతాడు. పాతకాలం నాటి నాయకులు ప్రజలతో కలిసి ఉండటం వల్ల వారి మంచిచెడ్డలు తెలుసుకునేవారు. నిరంతరం వారి గురించే ఆలోచించి మంచి చేయాలని చూసేవారు. గడచిన రెండు దశాబ్దాలుగా నాయకుల్లో కొత్తతరం ప్రవేశించింది. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య,విద్యాసంస్థల అధినేతలు నాయకముసుగులోకి వచ్చి చేరిపోయారు. డబ్బు పోస్తే ఓట్లు కొనుక్కోవచ్చు. వ్యాపారవ్యవహారాలు నడుపుకోవచ్చు. ప్రజలతో పెద్దగా సంబంధం లేదనే భావనలోకి వచ్చేశారు. టిక్కెట్టు ఇస్తే నియోజకవర్గంలో గెలవడానికి ఎంత ఖర్చు పెడతావని అడిగే ధోరణికి అధినాయకులు వచ్చేశారు. ఈ నేపథ్యంలో లీడర్లకు , పబ్లిక్ కు మధ్య బంధం తెగిపోయింది. ప్రతినిధులకు, ప్రజలకు మధ్య సంబంధం సన్నబడిపోయింది. ప్రజాస్వామ్యం పేరుతో కొనసాగుతున్న ఈ దుర్భర రాజకీయ వాతావరణంలోనూ పాదయాత్ర ఒక పవిత్ర కార్యంగానే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేసిన ప్రజాసంకల్పం ఆపార్టీకి ఒక చేయూతగానే కాదు. ప్రజలకు మనోబలం సమకూర్చే సాధనంగానూ నిలిచిపోతుంది.

సమర సంకల్పం..

విస్త్రుతమైన ప్రజామద్దతు ఉన్నప్పటికీ జగన్ 2014లో అధికారానికి కూతవేటు దూరంలో ఆగిపోయారు. అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వై.ఎస్.వారసుడు , పునర్విభజనతో పురుడు పోసుకున్న నవ్యాంధ్రను సాకగలడా? లేదా? అన్న సందేహంతో ప్రజలు సందిగ్ధానికి లోనయ్యారు. పరిపాలనానుభవంలో పూర్వ రికార్డు కలిగిన చంద్రబాబు నాయుడినే ఎంచుకున్నారు. కొంతకాలం పాటు జగన్ ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పార్టీ కార్యకర్తలైతే పూర్తిగా నైతిక స్థైర్యాన్ని కోల్పోయారు. ఒకవైపు వేధిస్తున్న కేసులు, మరోవైపు అనూహ్యమైన అపజయం. సంక్లిష్టపరిస్థితి. తన ధోరణిని, వైఖరిని తప్పుపడుతూ దూరమైన ఎమ్మెల్యేలు. కేంద్రంలోనూ సహకరించని ప్రభుత్వం. ఇన్ని సమస్యల మధ్య మరొక నాయకుడైతే ఎవరో ఒకరికి సరెండర్ అయిపోవాల్సిందే. కానీ జగన్ జగమొండి. తొందరలోనే కోలుకుని ఎదురుదాడి ప్రారంభించారు. మూడేళ్లపాటు అలుపెరుగని రీతిలో చంద్రబాబు నాయుడిని ఎదుర్కొన్నారు. అవమానాలనూ చవి చూశారు. ఎవరిని విశ్వసించాలో, ఎవరిని దూరం పెట్టాలో తేల్చుకోలేని అయోమయాన్ని అనుభవించారు. ప్రతినిధులు సరే, ప్రజలైనా తనవెంట ఉన్నారా? అదే తేల్చుకోవాలనుకున్నారు. పాదయాత్రకు నాంది పలికారు. సమరసంకల్పానికి శంఖారావం పూరించారు.

రాటుతేలే నాయకత్వం…

ప్రజల్లోకి వెళితే ఏమొస్తుంది? అసెంబ్లీకి గండి కొట్టి, పార్టీని గాలికొదిలేసి తిరిగితే ప్రయోజనం ఉంటుందా? పరిశీలకులు సైతం తొలినాళ్లలో ఇదే అనుమానంతో ఉన్నారు. కానీ ప్రజల్లో తిరుగుతున్న నాయకునికి చట్టసభలతో పనిలేదు. ప్రజాస్వామ్యంలో జనమద్దతు ఉందని తెలిస్తే పార్టీ చెక్కుచెదరదు. ప్రజాబలాన్ని మించిన నాయకత్వ పటిమ మరొకటి ఉండదు. అన్నిటికంటే ముఖ్యం, సబ్బండ వర్గాలను కలిసి మీకు నేనున్నాననే భరోసా ఇవ్వడం. ఎంతకాదనుకున్నా ఈతరం నాయకులు హంసతూలికాతల్పాలపైనే పెరుగుతున్నారు. ప్రజలతో ఉండాల్సిన సాన్నిహిత్యం కరవు అవుతోంది. వారి కష్టాలను అర్థం చేసుకునే ఓపిక ఉండటం లేదు. మొక్కుబడి ప్రకటనలు చేసి వదిలేస్తున్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏంజరుగుతుందో వారికి తెలియడం లేదు. నాయకుల్లో ఉండే ఉదాసీనత, నిర్లక్ష్యం, నిర్దయ లకు మందుగా పాదయాత్రను చెప్పుకోవాలి. ఎటువంటి నాయకుడైనా తనతో కలిసి నడుస్తున్న ప్రజల కష్టాలను చూసి చలించిపోతాడు. పూర్వకాలంలో రాజులు మారువేషాల్లో తిరుగుతూ తన రాజ్యం ఎలా ఉందో, పాలన తీరుతెన్నులపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవారట. పట్టాభిషేకానికి ముందు యువరాజులను దేశాటనకు పంపించేవారట. బాటసారులుగా తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని పదికాలాల పాటు చల్లగా పాలించేవారు. నాయకత్వం రాణించాలంటే ముందుగా ప్రజలను కలవడం బహుముఖ ఫలితాలనిస్తుంది.

ఈ పాదం…ప్రజల కోసం..

మన దేశంలో, రాష్ట్రంలో పాదయాత్ర కొత్త కాదు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ పాదయాత్రతో యంగ్ టర్క్ గా ప్రఖ్యాతి వహించారు. సమస్యలపై ఆయన సునిశితమైన పరిశీలన చేస్తారని పేరు తెచ్చుకున్నారు. నాయకుల్లో విపరీతమైన మార్పులకు పాదయాత్రలు దోహదం చేస్తాయి. అంతెందుకు జగన్ మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖరరెడ్డికి ఒక వర్గం నాయకునిగా, ఫ్యాక్షనిస్టుగా కాంగ్రెసులో చెడుముద్ర ఉండేది. పీసీసీ ఇతర పదవులు అప్పగించినా ఆయన నాయకత్వాన్ని నిరంతరం విమర్శించే వారికి కొరత ఉండేది కాదు. కానీ ప్రజా ప్రస్థాన పాదయాత్రతో మొత్తం పరిస్థితి మారిపోయింది. జననేతగా నీరాజనాలు అందుకున్నారు. పార్టీలో తిరుగులేని నాయకునిగా ఎదిగారు. ముఠాముద్ర నుంచి జనం మనిషిగా , సర్వసమ్మతి కలిగిన పార్టీ నాయకునిగా గుర్తింపు వచ్చింది. ప్రధానంగా ప్రజాసమస్యలను చూసే కోణంలోనే మార్పు వచ్చింది. కోపం, ఆవేశం వంటి లక్షణాల స్థానంలో సహనం, సంయమనం వచ్చి చేరాయి. ప్రజారంజకంగా పాలించగలిగారు. తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినా హైటెక్ సీఈఓగా మాత్రమే ముద్ర పడిన చంద్రబాబును పదేళ్లపాటు అధికారానికి దూరం చేశారు ప్రజలు. వ్యవసాయం, గ్రామీణ వ్రుత్తి రంగాల పట్ల ఆయన చూపే నిర్లక్ష్యంతో సకల వర్గాలు అసంత్రుప్తికి గురయ్యాయి. 2012-13 ల్లో చంద్రబాబు చేసిన పాదయాత్ర ఆయన వైఖరిలో మార్పునకు దోహదం చేసింది. ప్రస్తుతం వ్యవసాయం, సాగునీటి రంగాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడానికి ఆయన చేసిన పాదయాత్ర కూడా ఒక కారణమనే చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతినాయకుడు ఉన్నతస్థానానికి చేరాలని ఆశిస్తారు. అది మనోగతం. అందుకు ప్రజాపథాన్ని మించిన విజయరథం మరొకటి లేదు.

Ravi Batchali
About Ravi Batchali 30071 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*