జగన్ ప్లాన్ బి ఇదేనా …?

అమరావతి

తెలుగు రాష్ట్రాల విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ? ఇదే అందరిలో ఉత్కంఠ రేకెత్తించింది. కొలువు తీరిన చంద్రబాబు సర్కార్ కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ నివేదికను తుంగలో తొక్కి మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి హడావిడి చేశారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా కానీ కొత్త రాజధాని అమరావతి గా నిర్ధారించలేదు. ఈలోపు ఎక్కడ రాజధాని ఉండాలో గుర్తించి భారీ ఇన్ సైడర్ ట్రేడింగ్ చక్కగా నడిచింది.

అడ్డంగా కొనేశారు ….

మంత్రులు, ఎంపిలు, ఎమ్యెల్యేలు ఇంకా అధికారపార్టీ తో టచ్ లో వున్న బడాబాబులు అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలోనూ చుట్టుపక్కల భారీగా భూములు కొనుగోలు చేసుకున్నారు. కొందరు బాహాటంగానే అవును కొన్నాం కొంటే తప్పేంటి అని నేతలు ఎదురు ప్రశ్నలుకు దిగారు అంటే ఎంత దారుణంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ సాగిందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడితో ఆగలేదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి జివో ల పేరుతో అయినవారికి కట్టబెట్టేశారు. ఆ తరువాత కట్ చేస్తే ఎపి రాజధానిలో ఎకరం భూమి విలువ కోట్ల రూపాయలే పలుకుతుంది. గజం స్థలం కూడా సామాన్యుడు కొనలేని దుస్థితి.

గజం స్థలం కొనలేని దుస్థితి ….

తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలివచ్చిన ఎపి ప్రభుత్వ ఉద్యోగులు సొంత స్థలం సంగతి దేవుడెరుగు కనీసం అద్దెకు ఇల్లు తీసుకుని ఉండాలన్నా చుక్కలు అంటిన అద్దెలు చూసి అవాక్కయ్యారు. రాజధాని ఎవరికోసం ఇందుకోసం అనే ప్రశ్న ఇక్కడి నుంచే ఉదయించింది. అధికారం చేతిలో వుంది కదా అని అడ్డు అదుపు లేకుండా జరిగిన అమరావతి అక్రమాలు అన్ని ఇన్ని కావు. దాంతో జగన్ దీనిపై నెమ్మదిగా తన వ్యూహం అమల్లో పెట్టినట్లు తెలుస్తుంది. ముందుగా చుక్కలు అంటిన ధరలను నేలకు దిగివచ్చేలా దశలవారీ ప్లాన్ అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

జగన్ ప్లాన్ ఇదేనా ?

అమరావతి లో మొదలు పెట్టిన నిర్మాణాలను మాత్రమే పూర్తి చేసి మిగిలిన అన్ని జిల్లాల్లో అభివృద్ధి కి బీజాలు వేయాలని తద్వారా ప్రజల మనసు గెలవాలన్న లక్ష్యం గా పెట్టుకున్నట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అమరావతి లో ఇప్పటికే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ భవనాలు అందుబాటులో వున్నాయి. ఇవి పేరుకు తాత్కాలికమే అయినా వీటినే శాశ్వత భవనాలు గా చేసుకుంటే సరిపోతుందని జగన్ ప్లాన్ బి అంటున్నారు. సమతుల అభివృద్ధికి బీజాలు వేయాలంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా గా చేయాలన్న ఆలోచన ఇప్పటికే ముఖ్యమంత్రికి వుంది. ఎన్నికల వాగ్దానంలో సైతం జగన్ ఇదే హామీ ఇచ్చారు. దీన్ని అమల్లో పెట్టడానికి కసరత్తు సైతం ఒక పక్క సాగుతుంది. ఆ లెక్కలు పూర్తి అయ్యాక ఆయా కొత్త జిల్లాలనే మీ ప్రాంతాలకు రాజధానులు అవే అని ప్రకటించే ఛాన్స్ ఉంటుందంటున్నారు.

పరిపాలన రాజధానిగా అమరావతి …

కేవలం అమరావతిని పరిపాలన రాజధానిగా మార్చి వివిధ శాఖల డైరెక్టరేట్ కార్యాలయాలను జిల్లాల్లో నిర్మించాలని జగన్ ప్రభుత్వం లెక్కేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకే రాజధానిపై విపక్షాల నుంచి స్థానిక ప్రజల వరకు గోల గోల నడుస్తున్నా ముఖ్యమంత్రి మౌనం పాటించడానికి రీజన్స్ ఇవే అంటున్నారు. పేరుకే రాజధాని తప్ప అన్ని ప్రాంతాలు రాజధాని తో పోటీ పడాలనే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా మెజారిటీ ప్రజల మనసు గెలుస్తామన్న ఆలోచనలో సర్కార్ ఉందంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1348 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*