
జగన్ తాను ముఖ్యమంత్రిగా చేపట్టిన రోజు నుంచి కొన్ని ప్రాధాన్యతలను ఎంచుకున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపర్చడంతో పాటు నవరత్నాలను ప్రజలకు అందచేయడంపైనే జగన్ ఎక్కువగా దృష్టిపెట్టారు. తాను ఇచ్చిన హామీలను చట్టరూపంలో తెచ్చేందుకు అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకున్నారు. 19 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. మరోవైపు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్నారు.
ఎన్ని విమర్శలు చేసినా….
పోలవరం, పీపీఏ, బందరు పోర్టు కాంట్రాక్టులను రద్దు చేశారు. ముఖ్యంగా నవయుగ కంపెనీ చేపట్టిన పనులు సక్రమంగా జరగడంలేదని గుర్తించి ఆ కంపెనీని తొలగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అసలు విపక్షాల విమర్శలను కూడా జగన్ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అన్నా క్యాంటిన్ల విషయంలోనూ జగన్ వైఖరి అలాగే ఉంది. అన్ని విషయాల్లో తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందీ త్వరలో జగన్ మీడియా ముందుకు వచ్చే అవకాశముంది.
పోలవరం విషయంలోనూ….
ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ జగన్ తొందరపడకూడదంటున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసే సంస్థకే పనిని అప్పగించి రెండేళ్లలో పూర్తి చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. నవయుగను తప్పించినంత మాత్రాన పోలవరం నిలిచిపోయినట్లు కాదని, నవంబరు నెల వరకూ పోలవరం పనులు ప్రారంభించలేమని, అందుకు వరదలు, వర్షాలే కారణమని చెబుతున్నారు. ఇక రాజధాని విషయంలోనూ జగన్ తన వైఖరిని పరోక్షంగా బయటపెడుతున్నారు.
అమరావతి నిర్మాణంలోనూ….
అమరావతి నిర్మాణం తన ప్రాధాన్యతల్లో లేదని చెప్పారు. అందుకే బడ్జెట్ లో కూడా పెద్దగా నిధులు కేటాయించలేదు. దీంతో రాజధానిలో భూముల ధరలు అమాంతంగా పడిపోయాయి. అకారణంగా పెరిగిన రేట్లే వాస్తవ రేట్లకు వచ్చాయని వైసీపీ నేతలు చెబుతన్నారు. దాదాపు యాభై శాతం రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో కొందరికి మాత్రమే ఇబ్బందిగా ఉంటుందని, వైసీపీ నేతలు వివరణ ఇస్తున్నారు. రాజధాని, పోలవరం నిర్మాణాలు జగన్ హయాంలోనే పూర్తవుతాయని చెబుతున్నారు. అందుకే ఎన్ని విమర్శలు ఎందరు చేసినా తాను అనుకున్న దారిలోనే జగన్ వెళుతున్నారట. వారి విమర్శలకు కూడా స్పందించడం లేదు.
Leave a Reply