ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ మూవీ రివ్యూ

f3 movie heros telugu news

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, నాజర్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి
ఎడిటింగ్‌: బిక్కిని తమ్మిరాజు
నిర్మాత: దిల్‌ రాజు
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటివరకు డైరెక్షన్ చేసినవి మూడు సినిమాలే అయినప్పటికీ.. ఆ సినిమాల్లో కథకు, కమర్షియల్ ఎలెమెంట్స్ కి చోటు లేకపోయినా… ప్రతి సీన్ లో కామెడీని జోడించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించకపోయినా.. బాగానే ఎంటర్టైన్ చెయ్యగలడు. అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా.. హిట్ అయ్యాయి. ఇక గత ఏడాది యంగ్ హీరోలకు లైఫ్ ఇస్తున్నానంటూ రకరకాల సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు.. అనిల్ రావిపూడి తో వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబోలో ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అనే కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మించాడు. గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యని వెంకటేష్… ఈ ఏడాది సంక్రాంతికి వరుణ్ తేజ్ తో కలిసి కామెడీ చెయ్యడానికి ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఇక గత ఏడాది తొలి ప్రేమతో బిగ్గెస్ట్ హిట్, అంతరిక్షంలో యావరేజ్ అందుకున్న వరుణ్ సీనియర్ హీరో వెంకీతో కలిసి ఈ సినిమాలో నటించాడు. ఇక అనిల్ రావిపూడి హీరోని హైలెట్ చేస్తూనే కామెడీ ట్రాక్ తప్పనివ్వకుండా ఉండేలా చూసుకుంటాడు. మరి సీనియర్ హీరో వెంకటేష్ మామూలుగానే కామెడీ కేరెక్టర్స్ లో మంచి పట్టున్న హీరో. ఇక కాస్త గంభీరమైన పాత్రలు చేస్తూ పోతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాలో వెంకీతో కలిసి ఎంతవరకు ప్రేక్షకులను నవ్వించాడో? గ్లామర్ గర్ల్స్ తమన్నా, మెహ్రీన్ కౌర్ లు తమ గ్లామర్, నటనతో ఎంతవరకు మెస్మరిజే చేసారో? చాలా రోజుల నుండి హిట్ కోసం చూస్తున్న దిల్ రాజుకు ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ తో ఎలాంటి హిట్ ఇచ్చిందో? పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాల వలే అనిల్ మళ్లీ ఈ సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడా? అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ:

హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. వెంకీ (వెంక‌టేష్‌) ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తుంటాడు. హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. అప్పటివ‌ర‌కూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. భార్య‌, అత్త వెంకీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు య‌త్నిస్తుంటారు. వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) హ‌నీని ఇష్ట‌ప‌డ‌తాడు. అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు అర్థ‌మైన వెంకీ.. హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌ యాద‌వ్‌ను హెచ్చ‌రిస్తాడు. ప్రేమ మ‌త్తులో వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్ట‌వు. చివ‌ర‌కు హ‌నీని పెళ్లి చేసుకుంటాడు. అప్ప‌టి నుంచి అక్కాచెల్లెళ్ల ఆధిప‌త్యానికి తోడ‌ళ్లులు న‌లిగిపోతుంటారు. మీరిద్ద‌రూ ఎక్క‌డికైనా వెళ్లిపోండ‌ని, అప్పుడే అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలిసి వ‌స్తుంద‌ని, ప‌క్కింటి వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఈ తోడ‌ల్లుళ్లకు స‌ల‌హా ఇస్తాడు. దీంతో ఇద్ద‌రూ యూర‌ప్ వెళ్తారు. అయితే, వెంకీ.. వ‌రుణ్‌ల‌తో పాటు, హారిక‌.. హ‌నీలు కూడా యూర‌ప్ వెళ్తారు. ఇంత‌కీ వీళ్లు యూర‌ప్ ఎందుకు వెళ్తారు? ప‌రఅ కాష్‌రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగార‌న్న‌ది అస‌లు క‌థ‌. చివ‌ర‌కు పెళ్లాల‌ మనస్సు మార్చారా? లేక వెంకీ, వరుణ్ లే మారిపోయారా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే!

నటీనటుల నటన:

గత కొంతకాలంగా వెంకటేష్ .. అందరిలా హీరోయిజం చూపించే పాత్రల జోలికి వెళ్లకుండా తన వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. దృశ్యం కానివ్వండి, గురు సినిమా కానివ్వండి వేటికవే వెంకటేష్ పాత్రల ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. తాజాగా ఎఫ్ 2 లోను వెంకటేష్ తనకు తగిన పాత్రనే ఎంచుకున్నాడు. వెంకీ పాత్రలో కామెడీ టైమింగ్ తో ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. వెంకటేష్ గతంలోనూ అంటే బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇంకా చాలా సినిమాల్లో హీరోయిజం తో పాటుగా కామెడీని మిక్స్ చేసి ప్రేక్షకులను నవ్వించేవాడు. ఇక ఇప్పుడు ఎఫ్ 2 లోనూ వెంకీ కామెడీ అదిరింది. లుక్స్, ఫ్ర‌స్ట్రేష‌న్ బాగా ఆకట్టుకున్నాయి. ఫన్ తో పాటుగా ఫ్ర‌స్ట్రేష‌న్ చూపిస్తూ సూపర్బ్ అనిపించాడు. అసలు సినిమాలో వెంకటేష్ పాత్రే మేజర్ హైలెట్. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడడానికి కొద్దిగా కష్టపడ్డాడు. కాకపోతే తెలంగాణ యాస వరుణ్ తేజ్ కి అతికినట్లుగా అనిపించింది.. కానీ అందులో ఒరిజినాలిటీ కనబడలేదు. ప్రస్తుతం ఫేడవుడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్న త‌మ‌న్నాకి చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి హీరోయిన్ పాత్ర ఎఫ్ 2 లో దక్కింది. భర్తను ఏడిపించే భార్యగా ఆకట్టుకుంది. ఇక గ్లామర్ పరంగాను మోడరన్ గా ఉంది. మరో హీరోయిన్ మెహ‌రీన్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. తనని పొగిడించుకుంటూ హ్యాపీ ఫీల్ అయ్యే పాత్రలో మెహ్రీన్ నటన పర్లేదు. ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు, హరితేజ ఇలా ప్ర‌తి పాత్ర కామెడీ కోసం సెట్ చేసిన పాత్రలే. ఇక మిగతా నటులు కూడా తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు అనిల్ రావిపూడి మాస్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలకన్నా ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్స్ ని చెయ్యడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎందుకంటే సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యింది అంటే.. సినిమా ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. అందుకే సేఫ్ గా తన జోనర్ లోనే సినిమాలు చేసుకుపోతున్నాడు. కానీ కొన్నాళ్లకి కామెడీ మొహం మొత్తినా… ప్రస్తుతానికి బాగానే వర్కౌట్ అవుతుంది. అందుకే తనకు టచ్ లేని జోనర్ ని టచ్ చేయకుండా అతనికి కలిసొచ్చిన ఆ కామెడీనే ప్రతిసారి నమ్ముకుని సక్సెస్ సాధిస్తున్నాడు. ఈసారి కూడా వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో ఫన్నీ గా ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ తెరకెక్కించాడు. ర‌చ‌యిత‌గా అనిల్‌ రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. త‌న బ‌లం కామెడీనే కనక… దాన్ని సాధ్య‌మైనంత‌ వ‌ర‌కూ ప్ర‌తి సీన్‌లో పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ, ఎఫ్‌ 2 చాలా చిన్న క‌థ‌. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథ మ‌న‌కు అర్థ‌మైపోతుంది. ట్విస్టులు, హంగుల‌ వైపు వెళ్ల‌లేదు. ట్రైలర్ లో చూపించినట్లుగానే.. ఎఫ్ 2 సినిమా ఆద్యంతం కనబడుతుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండే వారి లైఫ్ లోకి భార్యల రూపంలో ఫ్రస్ట్రేషన్‌ ఎంటరైతే వారి పరిస్థితి ఏమిటి అనేది అనిల్ రావిపూడి కామెడీ టచ్ ఇస్తూ తెరకెక్కించాడు. బయట జరిగే నిజమైన ఘటనలే అనిల్ ఇలా సినిమా రూపంలో ప్రేక్షకులకు అందించాడు. నిజ జీవితంలో భార్య బాధితుల జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ లో చూస్తాం. ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తిగా కామెడీ ప్రాధాన్యంగా సినిమాని నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు. ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. మెహ‌రీన్‌కు కూడా ఒక మేన‌రిజం ఇచ్చి, ఆ పాత్ర ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేశాడు. అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి క‌చ్చితంగా న‌వ్వుకుంటారు. సందర్భోచిత కామెడీ రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడు. కానీ సెకండ్ హాఫ్ కాస్త వీక్ అయినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం యూరప్ షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న బలం, సెకండ్ హాఫ్ లో కనబడదు. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. అయితే వెంకీ – తమన్నా, వరుణ్ – మెహ్రీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని విడివిడిగా చూడకుండా మొత్తంగా ఇది ఒక ఫ‌న్ రైడ్ సినిమా.

సాంకేతికవర్గం పనితీరు

ఇక టెక్నీకల్ గా దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపించినా… పాట‌లు అన్నీ ఆక‌ట్టుకోలేదు. యూర‌ప్‌లో తెర‌కెక్కించిన ఒకే ఒక్క పాట మాత్రం బాగుంది. నేపధ్య సంగీతం కూడా సో సో గానే ఉంది. ఇక సినిమాకి మేజర్ హైలెట్ సినిమాటోగ్రఫీ. సమీర్‌ రెడ్డి కెమెరా ప‌రంగా క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించాడు. యూరప్ లొకేషన్స్, ఫ్యామిలీ సీన్స్ అన్ని అందంగా చూపించాడు. ఎడిటింగ్ విషయానికొస్తే బిక్కిని తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాలి. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ కి కత్తెర వెయ్యాల్సింది. ఇక దిల్ రాజు ఈ సినిమా కోసం ఎడాపెడా ఖర్చు పెట్టకపోయినా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: వెంకటేష్ కామెడీ, సినిమాటోగ్రఫీ, కామెడీ, ఫస్ట్ హాఫ్, వెంకీ – వరుణ్ కాంబో సీన్స్, దర్శకత్వం

మైనస్ పాయింట్స్: కథ, మ్యూజిక్, సెకండ్ హాఫ్, ఎడిటింగ్

రేటింగ్: 2.75/5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*